కుటుంబరావ్ మొఖం ఆనందంతో వెలిగిపోయింది.

 

    "అయ్యో! మీరు అడగాలా! అది మా డ్యూటీ బాబూ! ఎక్కడ గొప్పతనం, టాలెంటూ ఉంటాయో అక్కడ సన్మానాలు చేయటం మా బాధ్యత- అమ్థె౧ మీరెళ్ళి పోండిక! ఎల్లుండి సాయంత్రమే సన్మానం! సరేనా?"

 

    "మరి మేము ఏమేం ఏర్పాట్లు చేయాలో చెప్తే-..." నసిగాడు శాయిరామ్.

 

    "అదంతా నాకొదిలేయండి- మీరు స్టేజీ, షామియానాలు ఏర్పాటు చేసుకుంటే చాలు- మిగతాదంతా మా అసోసియేషన్ చూసుకుంటుంది.

 

    అందరం అతని మంచితనానికి, విశాల హృదయానికి ధన్యవాదాలు చెప్పి తిరిగి వచ్చేశాము. ఆ మర్నాటి నుంచే జనార్ధన్ కి సన్మానసభ ఏర్పాట్లు మొదలయిపోయాయ్.

 

    గోపాల్రావ్ తన "ఈ క్షణం" పేపర్లో ఆ విషయం గురించి పెద్ద న్యూస్ అయిటమ్ వేసేశాడు.

 

    రెండోరోజు సాయంత్రం అయిదయేసరికి కుటుంబరావ్ కార్లో వచ్చేశాడు కాలనీకి. అందరం అతని చుట్టూ మూగేశాము.

 

    "ఇంకో అరగంటలో మావాళ్ళొచ్చేస్తారు" అన్నాడతను. అప్పటికే వేదిక ముందు మా కాలనీ తాలూకూ పిల్లా పెద్దా ఆడా- మగా అంతా కిక్కిరిసిపోయి ఉన్నారు. శాయిరామ్ మైక్ ముందు నిలబడి మామూలుగానే ఆ సన్మానం గురించి సన్మానానికి సంబంధంలేని విషయాలు మాట్లాడుతున్నాడు.

 

    ఈలోగా ఒక వాన్ వచ్చి ఆగింది వేదిక దగ్గర. అందులోనుంచి చాలామంది బిలబిలమంటూ దిగి నిలబడ్డారు. అందులోనుంచి ఓ వ్యక్తి తిన్నగా వేదిక మీదకెళ్ళి శాయిరామ్ ని పక్కకు తప్పించి మైక్ అందుకున్నాడు.

 

    "సోదరీ సోదరీమణులారా! ఈ మహత్తరమయిన సన్మాన సభకు అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ కుటుంబరావ్ గారిని కోరుతున్నాను. అలాగే ఈ కాలనీ ప్రముఖులు శ్యామల్రావ్ గారిని వేదిక నలంకరించవలసిందిగా మీ అందరి తరపునా కోరుతున్నాను-"

 

    సభలో కలవరం బయల్దేరింది.

 

    "శ్యామల్రావ్ వేదికెక్కడానికి వీలులేదు-" అని అరచారు కొంతమంది.

 

    ఇదేదో గొడవయేట్లుందని మేము అడ్డుపడి వాళ్ళు గొడవచేయకుండా ఆపాము. కుటుంబరావ్, శ్యామల్రావ్ వేదికెక్కారు. మరుక్షణంలో జనార్ధన్ ని ఓ సన్నాయి, మద్దెల మ్యూజిక్ తో మా రంగారెడ్డి తోడుగా తీసుకుని వేదిక మీదకొచ్చాడు. కుటుంబరావ్ అతనికి ఎదురెళ్ళాడు. ఓ పన్నెండేళ్ళ పాప హారతి పళ్ళెంతో సహా వాన్ దిగి పరుగుతో వేదికెక్కి జనార్ధన్ కి హారతి ఇస్తూ "స్వాగతం" అంటూ పాటపాడింది.

 

    జనార్ధన్ ని ఓ మూల కుర్చీలో కూర్చోబెట్టారు. వాన్ లో నుంచి మరో వ్యక్తి దిగి దగ్గరకొచ్చి నిలబడి ఫోటోలు చడామడా తీసేయసాగాడు. వాళ్ళంతా ఎవరో ఇంత పకడ్బందీగా ఎలా ఏర్పాట్లు చేయగలిగారా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాం మేము. పురోహితుడు వచ్చి మంత్రాలు చదువుతూంటే శ్యామల్రావ్ లేచి జనార్ధన్ మీద శాలువా కప్పాడు.

 

    వాడిమెడలో దండలేశాడు కుటుంబరావ్. అందరూ తప్పట్ల వర్షం కురిపించేశారు.

 

    "ఇప్పుడు నగరంలోని వివిధ అభిమాన సంఘాలు తమ ప్రియతమ చలనచిత్ర హీరోని పూలమాలాంకితుడిని చేస్తారు-" అన్నాడు కుటుంబరావ్.

 

    నేను ఆశ్చర్యంగా రంగారెడ్డి వేపు చూశాను.

 

    "మనాడికి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయా?"

 

    "నాకూ అదే అర్ధం కావటం లేదు- ఒకే ఒక్క అభిమాన సంఘం మన కాలనీలోనే ఉంది- అదీ జనార్ధనే బ్రతిమాలి ఏర్పాటు చేశాడు-"

 

    "జనార్ధన్ ఫిలిమ్ పాన్స్ అసోసియేషన్ చికడ్ పల్లి" అంటూ మైకులో పిలిచాడతను. మా కాలనీ జనం మధ్యలో కూర్చున్న ఓ వ్యక్తి లేచి జనార్ధన్ మెడలో పూలదండలేశాడు.

 

    "జనార్ధన్ ఫాన్స్ అసోసియేషన్ వైజాగ్."

 

    మేమంతా ఉలిక్కిపడ్డాం- వీడికి దండలేయటానికి వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారా? ఓ వ్యక్తి పుల్ సూట్ లో వేదికమీదకొచ్చి జనార్ధన్ మెడలో దండలేసి వెళ్ళిపోయాడు.

 

    ఈసారి "జనార్ధన్ ఫాన్స్ అసోసియేషన్ చికాగో-" అంటూ చదివాడు కుటుంబరావ్. మేము అదిరిపడ్డాం.

 

    "చికాగోలో వీడికి అభిమాన సంఘమా?" ఆశ్చర్యంగా అడిగాడు గోపాల్రావ్.

 

    మేం చూస్తుండగానే వేదిక పక్కనే నిలబడ్డ నల్లగా తుమ్మ మొద్దులా ఉన్న ఓ గిరిజాలవాడు స్టేజి ఎక్కి జనార్ధన్ మెడలో ఓ పెద్ద దండ వేశాడు. ఆ దండమీద "మేడిన్ చికాగో" అన్న అక్షరాలు కనబడుతున్నాయ్.

 

    "వాడి మొఖం చూస్తుంటే అమెరికాలో ఉంటూన్న కళ ఏ మూలనయినా కనబడుతోందా?" అడిగాడు రంగారెడ్డి. ఈలోగా మరో పేరు వినిపించింది.

 

    "జనార్ధన్ ఫిలిం ఫాన్స్ క్లబ్, హాంకాంగ్-

 

    మరో సూటువాలా వచ్చి జనార్ధన్ మెడలో మరో పూలదండ వేశాడు. మాకు మతిపోతోంది. ఆ తతంగం చూస్తూంటే. అరగంట సేపు దండల కార్యక్రమం జరిగింది.

 

    "ఇప్పుడు ప్రముఖ కవివర్యులు "కాంతిశ్రీ" గారు అభినందన కవితలు వినిపిస్తారు" అన్నాడు కుటుంబరావ్.

 

    ముందు వరుసలో కూర్చున్న ఓ లావుపాటి యువకుడు రెండు కాగితాలు తీసుకుని స్టేజీ మీదకు చేరుకున్నాడు. అతను మైక్ ముందు నిలబడటంతోనే స్టిల్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయబోయాడు.

 

    ఠక్కున తనూ వచ్చి ఫోటోలో పడేట్లు నిలబడ్డాడు శాయిరామ్.

 

    కాంతిశ్రీ తన కవితలు చదవటం ప్రారంభించాడు.

 

    "అన్నా జనార్ధనన్నా!
    నువ్ వేశావెన్నో వేషాలు!
    నీవు లేనిలోటు తీరదులే!
    నువ్ పోయిన 'గాప్ పూడదులే! అంటూ విచారంగా పాడి ఆపాడు. అతనలా గద్గద స్వరంతో పాడుతుంటే మాకు కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్. జనార్ధన్ కంగారుగా అతనివేపు చూచాడు.

 

    "ఏమిటండీ- ఆ కవిత్వం- నేను ఉన్నాగా, ఎక్కడికో పోయానంటాడేవిటి?" అడిగాడు కుటుంబరావ్ ని దీనంగా.

 

    కుటుంబరావ్ కవిని కంగారుగా పక్కకు పిలిచాడు.

 

    "ఏయ్ ఏమిటోయ్ ఆ కవిత్వం- సరిగ్గా చూసి అఘోరించు-"

 

    "సారీ సార్- కాగితానికి మొదటివేపు చదవాల్సింది రెండోవైపు చదివాను-" అన్నాడతను నొచ్చుకుంటూ. పొరబాటు సరిదిద్దుకుంటూ రెండోవేపు చదవసాగాడు.

 

    "అన్నా జనార్ధన్నా!
    నీ వేషాలకు మా జోహార్లు
    నీ ఫీలింగ్స్ కి మా హేట్సాఫ్!
    నటనే నీ ఊపిరిగా
    ఊపిరే నీ నటనగా
    వర్ధమాన నటీనటులకు నువ్ చుక్కానివి.
    తెలుగు కళామతల్లికి రెండో ఎక్కానివి."

 

    అంతా తప్పట్లు మార్మోగిపోయినయ్.    

 

    కవివర్యుడు అందరికీ నమస్కరించి స్టేజి దిగాడు. వెంటనే మళ్ళీ మైకు దగ్గరకొచ్చాడు కుటుంబరావ్.

 

    "ఇప్పుడు ప్రముఖ నటులు జనార్ధన్ గురించి ఆంధ్రుల అభిమాన నవలా రచయిత్రి శాంతిశ్ర్రీ గారు ప్రసంగిస్తారు."

 

    వెంటనే ఒకావిడ ముందు వరుసలో నుంచి చకచక నడిచి వేదికమీద కొచ్చింది.

 

    మేమంతా మొఖమొఖాలు చూచుకున్నాం.

 

    "ఆవిడ ఆంధ్రుల అభిమాన రచయిత్రా? ఆ పేరుతో ఒక్క రచనకూడా ఏ మాగజైన్ లోనూ చూళ్ళేదే," అంది రాజేశ్వరి హడావుడిగా మా దగ్గరకొస్తూ.