ఆమె 3000 మందిని కాపాడారు!

అత్యాచారాల గురించి రోజూ ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్నింటిని జనం చదివి మర్చిపోతారు, మరికొన్నింటిని చదివి చలించిపోయి న్యాయం కోసం ఉద్యమాలని లేవదీస్తారు. కానీ ఉద్యమమే జీవితంగా గడుపుతున్నారు సునీతా కృష్ణన్‌. అత్యాచార బాధితురాళ్ల కోసమూ, పడుపు వృత్తిలోకి దిగినవాళ్లని రక్షించడం కోసమూ ఆమె చేస్తున్న పోరాటం సామాన్యమైనది కాదు.

సునీతా తల్లిదండ్రులు కేరళాకి చెందినవారు. తండ్రి ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ ఉద్యోగి కావడంతో తరచూ బదిలీలు అవుతూ ఉండేవి. ఆయనతో పాటు కొత్త చోటుకి చేరుకునే సునీత దేశంలోని ఎన్నో ప్రాంతాలనీ, అక్కడ జీవన విధానాన్ని పరిశీలించే అవకాశం ఉండేది. ప్రజలతో, ప్రాంతాలతో అనుబంధం ఏర్పడటం వల్ల సమాజానికి ఏదన్నా చేయాలన్న తపన మొదటి నుంచీ సునీతకి ఉండేది. మానసిక వికలాంగులకి, మురికివాడల్లోని పిల్లలకీ ఎంతో కొంత సాయం చేస్తూ ఉండేది. బహుశా సునీత కొన్నాళ్లకి అందరిలాగానే ఉద్యోగంలోనో, పెళ్లిలోనో స్థిరపడిపోయి ఉండేదేమో. కానీ తనకి 15 ఏళ్లు ఉండగా ఒక సంఘటన జరిగింది. 8 మంది కలిసి సునీత మీద దారుణంగా అత్యాచారం చేశారు. ‘అ సమయంలో నాకు బాధ కంటే కోపమే ఎక్కువగా కలిగింది’ అంటారు సునీత. అత్యాచారం ఎంత దారుణమైన నేరమో, ఆ తరువాత సమాజం స్పందించే తీరు కూడా అంతే నేరపూరితంగా ఉంటుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా అనుభవించారు- ‘అత్యాచారం తరువాత నన్ను వెలివేతకి, వేదనకీ గురిచేశారు… ఎందుకంటే నేను బాధితురాలిని కాబట్టి! కానీ ఆ ఒంటరితనమే నాకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది’ అంటూ చెప్పుకొస్తారు ఆమె. ఆ ఒంటరితనమే తనలాంటి బాధితులందరి పక్షాన నిలబడాలన్న కసిని ఆమెలో రేకెత్తించింది.

తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేయాలన్న సునీత ఆశయంతో ఆమె తల్లిదండ్రులు విభేదించేవారు. దాంతో తన చదువు పూర్తయ్యాక ఆమె బెంగళూరుని వీడి హైదరాబాదుకు చేరకున్నారు. 1996లో సునీత జీవితం మరో మలుపు తిరిగింది. ‘మెహబూబ్‌ కీ మెహందీ’ అనే ఒక రెడ్‌లైట్‌ ప్రాంతంలో ఉండే పడుపు గృహాలని పోలీసులు ధ్వంసం చేశారు. దాంతో అప్పటి వరకూ వేశ్యా వృత్తిలో ఉన్నవారికీ, వారి పిల్లలకీ దిక్కులేకుండా పోయింది. వారందరినీ ఆదుకునేందుకు సునీత తన నగలని అమ్మి ‘ప్రజ్వల’ అనే ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు సునీత. వీలైనంతమందిని పడుపు వృత్తి నుంచి రక్షించడం, వారికి పునరావాసాన్ని కల్పించడమే ధ్యేయంగా ప్రజ్వల ప్రస్థానం సాగింది. కానీ ఇదేమత తేలికగా జరగలేదు. ఎందుకంటే వేశ్యావృత్తి చుట్టూ ఎంతో క్రూరత్వం ఉంటుంది. కాసిని రూపాయల కోసం అభం శుభం తెలియని పసిపాపలని సైతం ఈ వృత్తిలోకి దించేవారుంటారు, ఆ వృత్తి మీద బతికే మాఫియా ఉంటుంది…. వీరందరినీ దాటుకుని సునీత దాదాపు 3000 మందికి పైగా ఆడపిల్లలని ఆ వృత్తి నుంచి తప్పించగలిగారు! ఆ పని చేయడంలో ఎంత ప్రమాదం ఇమిడి ఉందో ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె మీద దాదాపు 14 సార్లు భౌతిక దాడులు జరిగాయి. ఆమె ఆటోని గుద్దించారు, విషప్రయాగం చేశారు, యాసిడ్‌ పోశారు…. అలాంటి ఒక దాడిలో ఆమె కుడి చెవి పూర్తిగా దెబ్బతిన్నది కూడా. కానీ భగవంతుని దయ వల్ల వాటన్నింటినీ తప్పించుకోగలిగానంటారు సునీత. తాను పూర్తిచేయాల్సిన కార్యం ఇంకా ఉందనీ, అది పూర్తయ్యేదాకా భగవంతుడు తనని కాపాడుతూనే ఉంటాడనీ అంటారామె.

సునీత కేవలం ఒక స్వచ్ఛంద సంస్థను నడపడమే కాదు. అత్యాచార బాధితుల గురించీ, పడుపు వృత్తిలో ఉండేవారి గురించీ సమాజానికి తెలియచేసేందుకు వందలాది ఉపన్యాసాలు ఇచ్చారు. పోలీసుల దగ్గర్నుంచీ ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరి కోసమూ సదస్సులను నిర్వహించారు. బాధితుల గురించి సమాజంలో అవగాహన కలిగించేందుకు ఎన్నో డాక్యుమెంటరీలను తీశారు. ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా తన భర్త రాజేశ్‌ టచ్‌రివర్‌తో కలిసి ‘నా బంగారు తల్లి’ అనే సినిమాను కూడా తీశారు. పడుపు వృత్తిలో ఉండేవారిని రక్షించేందుకు ఏం చేయాలి, వారిని ఆ నరకకూపం నుంచి తప్పించిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అత్యాచార బాధితులకి ఎలా అండగా నిలవాలి, నేరానికి పాల్పడిన వారిని ఎలా శిక్షించాలి…. వంటి ఎన్నో విషయాలలో ప్రభుత్వాలు సైతం ఇప్పుడు సునీతను సంప్రదిస్తున్నాయి.

సునీత చేసిన కృషికి ఎన్నో అవార్డులూ, రివార్డులూ లభించి ఉండవచ్చు. కానీ ఆమె కోరుకుంటున్నది పేరు ప్రఖ్యాతలు కావు ‘సమాజం బాధితారి పట్ల ఆసక్తి చూపిచేకంటే… నేరస్తుని గతాన్ని పరిశీలించడంలోనూ, అతణ్ని శిక్షించడంలోనూ మరింత శ్రద్ధ వహించాలి’ అంటారు. వెలివేయాల్సింది బాధితురాలిని కాదు, నేరస్తుని అని కోరుకుంటారు. ఎసి గదుల్లో కూర్చుని అత్యాచార బాధితుల గురించి మాట్లాడటం తేలికే, కానీ అలాంటి అత్యాచార బాధితులని మన ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునేందుకు కూడా మనం ఎందుకు వెనుకంజ వేస్తున్నాం అని నిలదీస్తారు. సునీత కోరుకున్నట్లుగా బాధితురాలిని బాధించే సమాజం కాకుండా, ఆమెను సేదతీర్చే మనస్తత్వం మనలో అలవడాలని కోరుకుందాం.

- నిర్జర.