"అదెక్కడో ఆంధ్రాలో వుంటోంది బాబూ! దానికి గొడవలేం తెలీవు."

 

    ఆ మాటను విన్పించుకోలేదు కాళిదాసు.

 

    "ఆంధ్రాలో ఏ వూరు?"

 

    సత్తెయ్య చెప్పలేదు.

 

    అసలు కీలకం అర్ధంకాగానే కాళిదాసు వుగ్రుడైపోయాడు.

 

    "నువ్వు చెప్పకపోయినా నేను కనుక్కుంటాను. నువ్వు చెప్పకుండా నేను కనుక్కున్నాననుకో నీ కూతురు మరి నీకు కనబడదు...! నువ్వు చెప్పావనుకో... నీ కూతురు క్షేమంగా వుంటుంది. ఆలోచించుకో."

 

    "ఇంతకీ నువ్వెవరు....?" తడారిపోయిన గొంతుతో అడిగాడు సత్తెయ్య.

 

    "నేనా? కాళిదాసుని...."

 

    "కాళిదాసు అంటే..." ఏదో జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు సత్తెయ్య.

 

    "పదేళ్ళ క్రితం వరంగల్ పార్టీ అధ్యక్షుడ్ని డిగ్రీ కాలేజీ ఫంక్షన్ లో...."

 

    "ఆహా... బాగానే గుర్తుచేసుకున్నావన్నమాట నా పేరు చెప్పగానే! నా హిస్టరీ గుర్తుచేసుకున్న వ్యక్తివి ఒకడివి వున్నావన్నమాట. భేష్... అంచేత సత్తెయ్యా! చెప్పెయ్! మర్యాదగా చెప్పెయ్..."

 

    కాంతి ఇంకిపోయిన కళ్ళతో భార్య అరుణమ్మ వేపు చూశాడు సత్తెయ్య.

 

    అదే సమయంలో రోడ్డు మీద ఓ పోలీస్ జీపు ఆగింది. అందులో నుంచి దిగాడు డేవిడ్. గబగబా లోనికొస్తూ, లోన్నించి మాటలు విన్పించడంతో కిటికీ పక్కగా నిల్చున్నాడు ఆ మాటల్ని వింటూ.

 

    "మా అల్లుడు గుంటూరు మిల్లులో పనిచేస్తారు. అరండల్ పేట, రెండోలైన్లో వుంటాడు."

 

    "అడ్రస్ కరెక్టేనా?"

 

    "వాళ్ళనేమీ చెయ్యకు బాబూ!" ప్రాధేయపడ్డాడు సత్తెయ్య.

 

    అతడు చెప్పిన అడ్రస్ వినగానే కిటికీ పక్కన నుంచున్న డేవిడ్ వచ్చి పని అయిపోయిందన్నట్టుగా గబగబా వెనక్కొచ్చేసి జీపెక్కాడు. జీపు ముందుకు దూసుకుపోయింది.

 

    "నేనక్కడకు వెళ్ళేది మాక్కావల్సిన ఆదిత్య కోసం... మీ అమ్మాయి కోసం కాదు..." బయటికొచ్చి, మలుపు వరకూ వెళ్ళి రోడ్డు పక్కన పెట్టిన లారీ ఎక్కాడు కాళిదాసు.

 

    "గురూ! నువ్వు ఆ ఇంట్లో వున్నప్పుడు ఏదో పోలీస్ జీపాగింది. అందులోంచి ఇన్స్ పెక్టర్ దిగి, గుమ్మం వరకూ వెళ్ళి, అయిదు నిమిషాలాగి, వెనక్కి వచ్చేశాడు. జీపు వెంటనే వెళ్ళిపోయింది.

 

    "ఆ ఇంటి మీద పోలీసు నిఘా వుంది. రొటీన్ చెకప్ కి ఎవడో ఇన్స్ పెక్టర్ వచ్చుంటాడులే..." కేర్ లెస్ గా చెప్పాడు కాళిదాసు.

 

    "దుర్గా! మనం ఇప్పుడు గుంటూరు వెళ్ళాలి..." ఆజ్ఞ జారీచేశాడు కాళిదాసు.

 

    దుర్గ క్వార్టర్ బాటిల్లోని డ్రింక్ ని పూర్తిచేసి, బాటిల్ ను పక్కకు విసిరేసి-

 

    "రైటో రైట్" అని హుషారుగా అనుకొని గేరు మార్చాడు. లారీ ముందుకు కదిలింది.


                                                 *    *    *    *    *


    ఉదయం నుంచి వర్షం కురుస్తూనే వుంది.

 

    వర్షంలో... పల్లెటూర్లో వర్షంలో తడుస్తూ, జలపాతాన్ని చూస్తూ గడపడం ఎంతో ఆనందంగా వుంది ఆదిత్యకు.

 

    నెమ్మదిగా చీకటిపడుతోంది. పవర్ ఫెయిల్యూర్ వల్ల, అప్పుడప్పుడూ తటాలున కన్పించే వెలుతురు తప్ప, ఊరంతా చీకటి దుప్పటిలో మునగదీసుకొని వుంది.

 

    వరదప్రవాహంలా ముందుకొస్తున్న అనుభవాల ఒరిపిడి నుండి బయట పడేందుకు తనను విశ్వప్రయత్నం మీద నియంత్రించుకుంతున్నాడు ఆదిత్య.

 

    వర్షం, కీచురాళ్ళరొద... జలపాతపు హోరు, గాడాంధకారం... ఒడల్ని జలదరింపజేసే ఆ వాతావరణం ఆదిత్యనేం భయపెట్టలేకపోతున్నాయి.

 

    సుమబాల తనను నమ్మడంలేదు.

 

    నమ్మందే తనేం సహాయం చేయలేడు.

 

    గుర్రం పెద్దబ్బాయి రూపంలో ముంచుకురానున్న ప్రమాదాన్ని ఆమె పసిగట్టే స్థితిలో లేదు.

 

    అందంలో రెబెక్కా సుందరే అయినా, ఆలోచనల్లో రిజిడ్ గా  వుంటోంది. ఏం చేయాలి?

 

    తనెన్నాళ్ళు అక్కడుండాలి?

 

    తన కోసం ఓ పక్క పోలీసులు, మరోపక్క అహోబలపతి మనుషులు,ఇంకోపక్క గుర్రం పెద్దబ్బాయి మనుషులు వేటాడుతుండవచ్చు.

 

    తనను ప్రమాదం చుట్టుముట్టేలోపే తను అహోబలపతికి శిక్ష విధించాలి. అది జరగాలంటే తను వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే సుమబాల... పాప...? అంతలో ధరణికుమార్ దీనమైన ముఖం జ్ఞప్తికి వచ్చింది.

 

    సుమబాల తననునమ్మితే, ఆమెనో దారి చేసి సురక్షితమైన ప్రాంతంలో వుంచి, వీలైతే విదేశం పంపించివేస్తే తన బాధ్యత తీరిపోతుంది.

 

    అమెరికన్ వీసా రూల్స్ కఠినంగా వున్నా ఏదో రకంగా తల్లి, బిడ్డల్ని ధరణి కోరుకున్నట్టు అమెరికా పంపించివేస్తే ఆమె సురక్షితంగా భవిష్యత్ జీవితాన్ని గడుపుతుంది.

 

    కానీ ఇవన్నీ ఎలా జరగాలి?

 

    బాధ్యత ఇటు లాగుతుంటే, ప్రతీకారం అటు లాగుతోంది.

 

    మానవత్వం కట్టిపడేస్తుంటే రాక్షసత్వం పగ తీర్చుకోమంటోంది. అలాంటి సైకలాజికల్ ఏంకర్ కి చిక్కుకుంటానని ఆదిత్య ఏమాత్రం ఊహించలేదు. అందుకే అయోమయంలో పడిపోయాడు.

 

    "రాత్రి ఎంతయిందో తెలీదు. పాత ఇల్లు కావడంవల్ల చూరులోంచి చినుకులు పడుతున్నాయి. కంటిమీదకు నిద్ర రావడంలేదు. సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తున్నాడు.

 

    "ఆదిత్య బాబూ... ఆదిత్య బాబూ..."

 

    ఆ గొంతును వెంటనే గుర్తుపట్టాడు ఆదిత్య... రంగి... గబుక్కున లేచి తలుపు తీశాడు.

 

    ఎదురుగా లక్ష్మమ్మ, రంగి నుంచొని వున్నారు.

 

    "ఏమిటి... లక్ష్మమ్మ... ఏమైంది?"

 

    "సుమమ్మ పాపకు జ్వరం ఎక్కువైపోయింది. రెండ్రోజుల్నుంచీ జ్వరమట. ఇంట్లో వున్న మాత్ర వేసింది ఆయమ్మ. ఎవరితో చెప్పలేదు కూడా, హాస్పిటల్ కు తీసికెళ్ళాలి. తప్పదు. ఏం చేయాలో తోచక సుమమ్మ మా ఇంటికొచ్చింది."

 

    "హాస్పిటల్ ఎక్కడుంది?"

 

    "వెంకటాపురంలో...."

 

    "ఇప్పుడు టైమెంతయింది?"

 

    "పన్నెండు గంటలు దాటింది." అంది రంగి.

 

    "ఊళ్ళో ఎడ్లబళ్ళన్నీ సోమవారం సంతకు వెళ్ళిపోయాయి బాబూ! దిక్కుతోచక నీ దగ్గరకొచ్చాం" అంది లక్ష్మమ్మ దీనంగా.