తన పరిస్థితికి తనే ఆశ్చర్యపోతున్నాడు ఆదిత్య.

 

    కొన్ని గంటల్లో తన జీవితంలో జరిగిన పరిణామాల్ని తనే ఇంకా నమ్మలేక పోతున్నాడు. బుద్ధిగా చదువుకొని, మంచి మార్క్సు తెచ్చుకుని అనుభవజ్ఞుడైన సీనియర్ దగ్గర చేరి, అనతికాలంలోనే లీడింగ్ లాయర్ గా పేరు తెచ్చుకోవాలని తను కన్న కలలు ఏమయిపోయాయి?

 

    నేరాల్ని అరికట్టవలసిన తనే నేరస్థుడు కావటం ఒక అనూహ్య పరిణామం!

 

    డబ్బున్న వాడు తప్పు చేస్తే - తనకున్న డబ్బుతో బయట కొనేస్తాడు.

 

    అదే లేనివాడు తప్పు చేస్తే జీవితాన్నే ఫణంగా పెట్టవలసి వస్తుంది.

 

    వేదాంతిలా నవ్వుకున్నాడో క్షణం...

 

    అంతే... ఆ మరుక్షణం కర్తవ్యం గుర్తుకొచ్చి అలర్టయిపోయాడు.

 

    "కారుని వరంగల్ పోనివ్వు - వీలైనంత వేగంగా, కమాన్ క్విక్. మూవ్..." అన్నాడు ఆదిత్య అప్పుడు వాచీ చూసుకుంటూ.

 

    అప్పుడు సమయం సరిగ్గా పదకొండున్నర అయ్యింది.


                                              *    *    *    *    *


    తల్లిదండ్రులకు డబ్బిచ్చి చెల్లెలి పెళ్ళి జరిపించమని చెప్పి-కొన్నాళ్లు తన గురించి పట్టించుకోవద్దని చెప్పి వెనుదిరిగాడు ఆదిత్య.

 

    హఠాత్తుగా అంత డబ్బెలా వచ్చిందని వివరాలడిగి వెళ్ళిన తల్లి దండ్రులకు చిర్నవ్వే సమాధానంగా చెప్పి హైదరాబాద్ బయలుదేరాడు ఆదిత్య అప్పటికప్పుడే.

 

    హైదారాబాద్ చేరుకునేసరికి సమయం సాయంత్రం ఆరు గంటలు అయ్యింది.

 

    కారుని ఆదర్శనగర్ పోనివ్వమన్నాడు ఆదిత్య.

 

    మరో ఐదు నిమిషాలకు కారక్కడుంది. ఆదిత్య కారులోంచి దిగకుండానే తల బయటకుపెట్టి చూశాడు. సెహనాయ్ రెస్టారెంట్ ముందు ఓ వ్యక్తి ఒక సంచితో నిలబడి వున్నాడు. ఆ వ్యక్తిని గుర్తుపట్టి దగ్గరకు రమ్మని సైగ చేశాడు ఆదిత్య. అతను పరిగెత్తుకుంటూ కారు దగ్గరకి వచ్చాడు.

 

    అతని చేతిలోని సంచిని జాగ్రత్తగా తీసుకొని "ఉన్నాయా?" అన్నాడు ఆదిత్య. ఉన్నాయన్నట్లు ఆ వ్యక్తి తలూపాడు. ఆదిత్య ఆ వ్యక్తికి రెండు వేలిచ్చాడు.

 

    కారు తిరిగి బయలుదేరింది.

 

    అప్పటికే ఫోటోగ్రాఫర్ రమేష్ చంద్ర ఆదిత్య కోసం ఎదురు చూస్తున్నాడు.

 

    అతని కిస్తానన్న రెండువేలు అతనికిచ్చి, ఐడెంటిటీ కార్డు, కెమేరా తీసుకుని కారెక్కి బషీర్ బాగ్ స్కైలైన్ చౌరస్తా దగ్గర దిగిపోయాడు ఆదిత్య.

 

    "వెళ్ళిపొమ్మంటారా సార్?" అప్పటివరకూ ఎక్కడికి తీసికెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాడు తప్ప కారు డ్రైవర్ ఒక్కమాట మాట్లాడలేదు.

 

    "మరేం పనిలేదు... నువ్వెళ్ళొచ్చు" అన్నాడు ఆదిత్య.

 

    కారు ముందుకెళ్ళిపోయింది.

 

    ఆదిత్య ఆ పక్కనే వున్న ఫోటో స్టోర్స్ లో ఫిల్మ్ కొని, ఆ షాపు వాడిచేత లోడ్ చేయించి నిజాం కాలేజీ కేసి కదిలాడు.


                           *    *    *    *    *


    సరిగ్గా ఏడు గంటలైంది.

 

    అధికార పార్టీ సభకు వచ్చిన వేలాది ప్రజలతో నిజాం కాలేజీ హోరెత్తిపోతోంది.

 

    చీఫ్ మినిస్టర్ కోసం లీడర్స్ ఎదురు చూస్తున్నారు.

 

    స్టేజీకి దిగువన, కుడిప్రక్కన ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అన్న బోర్డువున్న ప్రాంతంలో ఫోటోగ్రాఫర్స్ మధ్యలో కూర్చున్నాడు ఆదిత్య.

 

    ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్స్ చొరవగా "ఏ ప్రెస్?" అని అడిగారు ఆదిత్యను.

 

    "న్యూస్ ఏజెన్సీ" టక్కున జవాబు చెప్పాడు ఆదిత్య.

 

    ఎవరి గొడవలో వాళ్ళున్నారు. అంత పరిశీలనగా ఎవరూ పట్టించుకోలేదు.

 

    కార్యక్రమం మొదలయ్యింది. మూడో సర్వే కడ్డీ దగ్గరున్న ఆదిత్య అప్రమత్తంగా వున్నాడు.

 

    వైజయంతిమాల బాల నృత్య కార్యక్రమం... ఆ తర్వాత పి.సి. సర్కార్ మాజిక్ షో... ఆదిత్యలో టెన్షన్ పెరిగిపోతోంది.

 

    ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ వింగ్ పక్కన ఖాళీ... కొంచెం దూరంలో కరెంట్ ఫెయిలైతే... ప్రోగ్రాంకి యిబ్బంది లేకుండా జనరేటర్... ఆ ప్రక్కన యిద్దరు స్టాఫ్...

 

    ఆ ప్రాంతమంతా చీకట్లో వుంది. జనరేటర్ ప్రక్కన మెట్లు-ఆ ప్రక్కన వరండా- వరండాకు రెండో వైపు క్లాస్ రూమ్స్.

 

    వి.ఐ.పీలు సాధారణంగా ఆ దారంటే వస్తారు. ఒకసారి చీఫ్ మినిస్టర్ లాంటి వి.ఐ.పీలు లోనికి వచ్చేశాక మళ్ళీ వాళ్ళు వెళ్ళేవరకూ అక్కడ ఏ ఒక్క పోలీసూ వుండడు.

 

    చాలా మీటింగుల్లో ఆదిత్య ఆ విషయం గమనించాడు. అందుకే తను తప్పించుకోవడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు.

 

    చేతి వాచీ వేపు చూశాడు.

 

    సరిగ్గా ఏడు నలభై అయిదు నిమిషాలయ్యింది!

 

    ఒక్కసారిగా హడావుడి మొదలయ్యింది. చీఫ్ మినిస్టరు, మంత్రులు రావటంతో కలకలం రేగింది.

 

    పోలీస్ ఆఫీసర్స్ హంగామా... కార్యకర్తల నినాదాలు... చప్పట్లు, కేకలు.

 

    పవర్ ఫుల్ లైట్స్ వెలుగులో వేదిక అట్టహాసంగా మెరిసిపోతోంది.

 

    పార్టీ కార్యదర్శి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందో చెప్తూ-

 

    చీఫ్ మినిస్టర్ ని వేదికపైకి ఆహ్వానించాడు. అతిథులుగా వచ్చి కేంద్రమంత్రుల్ని ఆహ్వానిస్తున్నాడు.

 

    ఆ అధికార మహాసభకు మొత్తం పాతికమంది అతిథులు... అన్ని రంగాలకూ చెందిన వ్యక్తులున్నారు.

 

    వాళ్ళని ఆహ్వానించడానికి పావుగంట పైగా పడుతుంది.

 

    ఆ తర్వాత దండల కార్యక్రమం.

 

    తను అనుకున్న ప్లాన్ ప్రకారం ఫోటోగ్రాఫర్స్ వింగ్ లోంచి బయటికొచ్చి జనరేటర్ ప్రక్కనుంచి మెట్లెక్కి వరండా, క్లాస్ రూమ్స్ దాటి లాన్ లోకొచ్చి కాలేజీ మెయిన్ గేటు దగ్గర కెళ్ళాడు.

 

    ఎక్కడా పోలీసు కన్పించలేదు.

 

    ఒక్క మెయిన్ గేటు దగ్గర తప్ప... మెయిన్ గేట్ దగ్గర ఇద్దరు పోలీసులు నీరసంగా నుంచున్నారు. పార్టీ మీటింగ్ కావటంతో సెక్యూరిటీ అంత పకడ్బందీగా లేదు. అదే ప్రభుత్వానికి చెందిన మీటింగ్ అయితే తనకి చాలా కష్టమయ్యేది.

 

    గేట్లోంచి బయటికొచ్చి, రోడ్డుకటూ యిటూ చూశాడు ఆదిత్య.

 

    వరసగా పార్క్ చేసిన కార్లు, పోలీస్ వ్యాన్ లు.