"ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. కానీ ఇంత ఘోరమైన అభియోగం చేయకురా..." భోరుమని ఏడుస్తూ అన్నాడు ఆనందం.

 

    ఆంజనేయులికి ఆనందంపై జాలేసింది.

 

    ఆనందాన్ని నమ్మబుద్ధయింది కూడా.

 

    "అయితే ఆ భుజంగరావే మనల్ని పరీక్షించటానికి పంపించాడంటావ్...?"

 

    "ఖచ్చితంగా... మనల్నికాదు. నిన్నే... నీకు ఆయన కూతుర్ని ఇచ్చి చేస్తాడో ఏమో... నిన్ను బాగా పరీక్షించి, మంచివాడివని నమ్మకం కుదిరాక ఒక నిర్ణయానికొస్తాడని నా అనుమానం. నీకు తెలుసో లేదో ఇప్పుడు వాళ్ళమ్మాయి అమెరికాలో ఎం.బి.ఏ. చేస్తోంది. అమెరికా నుంచి తరుచూ లెటర్స్ కూడా రావటం నేను చూశాను" అన్నాడు ఆనందం కళ్ళు తుడుచుకుంటూ.

 

    "అంతేనంటావా...!?" అంటూ ఆంజనేయులు చిద్విలాసంగా నవ్వాడు.

 

    ఆనందం భృకుటి ముడిపడింది. తిరిగి డేగలా ఆంజనేయులి వేపు చూశాడు.

 

    "నేనమ్మను. పిన్నిగారితో నీ పెళ్ళాం పేరు తరణీ అని చెప్పినప్పుడే నాకనుమానం వచ్చింది... ఆ ఫోటో ఇచ్చినప్పుడు నాకనుమానం రాలేదు గానీ... ఇప్పుడొస్తోంది... నువ్వు ఆ పెద్దావిడతో కాదు... నాతో డ్రామాలాడుతున్నావ్ రా... చెప్పరా... భాయ్... ఆ తరణి నీకు తెలుసని, ఆవిడ ణీ భార్యని చెప్పేసి, పుణ్యం కట్టుకోరా భాయ్..." ఈసారి ఆనందం అడ్డం తిరిగి పోయాడు.

 

    "ఇంతసేపూ చెప్పింది ఏవైందిరా... మహాప్రభూ... ఆ పిల్లకీ, నాకూ సంబంధం లేదురా... దేవుడో... సిన్మాల్లోనూ, నవలలోనూ వాడుకుంటారే... యాదృచ్చికమూ, కాకతాళీయమూ అని... అదే జరిగిందిప్పుడు... అంతేతప్ప... ఆ తరణికి నాకూ ఏ విధమైన సంబంధమూ లేదు. అంతే..." ఈసారి ఏడవటం ఆంజనేయులి వంతయింది.

 

    అదే సమయంలో పట్టీల చప్పుడు వినిపిస్తే తల తిప్పాడు ఆంజనేయులు.

 

    "ఏ విధమైన సంబంధమూ లేదని అంటున్నారు... దేని గురించి... నా గురించేనా... అవును మీరు మారతారనుకోవడం నా బుద్ధి తక్కువ. పెళ్ళయి ఇన్నాళ్ళయింది... ఏ విధమైన సంబంధం లేనట్లు ప్రవర్తించడం తప్ప, బుద్దెరిగి ప్రవర్తించారు గనుకనా... ఆఫీసుకి ఎన్ని ఫోన్లు చేసినా, ఒక్క ఫోనుకీ జవాబు లేదు... ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్క ఉత్తరానికీ రిప్లయిలేదు... అందుకే... ఎన్నాళ్ళని భరిస్తాను... అందుకే నా ఇంటికి నేనొచ్చేశాను... ఏమన్నయ్యా, ఇలా చెప్పా చెయ్యకుండా రావడం తప్పంటావా... చెప్పన్నయ్యా..." పొడవాటి జడను కుడిచేత్తో పట్టుకుని గిరగిరా తిప్పుతూ అడుగుతున్న తరణి వేపు చూస్తూ...

 

    "లేదు సిస్టర్... లేదు... యూ ఆర్ రైట్... సిస్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్... నాకు మొదటి నుంచీ అనుమానం అంతా వీడిమీదే..." కళ్ళు మిటకరించి ఆంజనేయులి వేపు చూస్తూ అన్నాడు ఆనందం.

 

    "అన్నయ్య ఇక నుంచి నా పార్టీయే... కదన్నయ్యా..." అని గబుక్కున గదిలోకి పరుగెత్తికెళ్ళి, అంతలోనే బయటికొచ్చి...

 

    "అత్తారింటికి ఉత్తి చేతుల్తో వెళ్ళగూడదని మా వాళ్ళు లడ్డూలు చేశారు తీసుకో అన్నయ్యా..." అంటూ చేతిలో ఓ లడ్డూ పెట్టి, "మీరో లడ్డూ తినగూడదూ..." అంది ఆంజనేయులు కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.

 

    "లడ్డూ వద్దు, గాడిద గుడ్డూ వద్దు. ఇంతకీ నువ్వెవరో చెప్పు..." గసుర్తూ అన్నాడు ఆంజనేయులు.

 

    "అన్నయ్యా... నువ్వు రెండు నిమిషాలు కళ్ళు మూసుకో..."

 

    తరణి అలా అనగానే ఆనందం వెంటనే కళ్ళు మూసేసుకున్నాడు.

 

    ఆంజనేయులు ముక్కు పట్టుకుని పిండేసి, జడ చివర గంటలతో అతని బుగ్గలమీద కొట్టి...

 

    "నేనెవర్నా... మీ పెళ్ళాన్ని... అర్ధమైందా..." అనేసి "అన్నయ్యా.. ఇప్పుడు కళ్ళిప్పుకో పర్వాలేదు..." అనేసి తుర్రున లోనకెళ్ళిపోయింది తరణి.

 

    పళ్ళు పటపటా నూరుతూ కళ్ళిప్పాడు ఆనందం.

 

    "నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి, నీ పెళ్ళాం నిన్నేం చేసిందిరా... చెప్పరా..." అడిగాడు ఆనందం అనుమానంగా చూస్తూ.

 

    "నిన్ను కళ్ళు మూసుకోమందా... నాకు జెల్లకొట్టి వెళ్ళిపోయింది" చాపమీద కూలబడుతూ అన్నాడు ఆంజనేయులు.

 

    "లడ్డూ బావుంది తినరా..." అన్నాడు ఆనందం.

 

    "తేరగా వచ్చిందని పాసి మొహాన్నే తినేస్తున్నావా...?" చాపమీద వున్న లడ్డూని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఆంజనేయులు.

 

    "ఏం తినగూడదా... పాసి, లడ్డూ తింటే బలమని, చిన్నప్పుడు మా మామ్మ చెప్పిందిలే..." లడ్డూ తింటూ అన్నాడు ఆనందం.

 

    "ఈ లడ్డూ కధేమిటో... ఆ పిల్ల ఎవరో... ఈ కధ ఇలా ఎందుకు మలుపు తిరిగిందో... అంతా విచిత్రాల మయంరా... ఏవిటో... ఏవిటో నాకేం తెలియడం లేదు..." పిచ్చి చూపులు చూస్తూ అన్నాడు ఆంజనేయులు.

 

    "మళ్ళీ ఆ మాట అంటే చంపేస్తాను... సాక్ష్యాలూ, రుజువులూ ఎదురుగా వుంటే, మళ్ళీ నాతో అబద్ధం ఆడతావురా... ఒప్పేసుకో... ఒప్పేసుకో..." లడ్డూని తినేసి చేతులు దులుపుకుంటూ అన్నాడు ఆనందం.

 

    "రాత్రి మనం పడుకునే వరకూ జరిగిందంతా నీకు తెలుసు కదరా... నువ్వు కూడా నన్ను అర్ధం చేసుకోకపోతే ఎలాగరా..." ఏడుపు ముఖం పెట్టి అన్నాడు ఆంజనేయులు.

 

    ఆ సమయంలో లోన్నించి వచ్చింది తరణి.

 

    "వేన్నీళ్ళు రెడీ... ఏమండీ మీరు చేస్తారా... అన్నయ్యని వెళ్ళమన్నా.."

 

    "నువ్వుండు... నేనే వెళ్తాను..." ఆనందం గబుక్కున లేచి పెరట్లోకి పరిగెట్టాడు.

 

    "ఇన్నాళ్ళయింది ఇక్కడకొచ్చి... చాపలతోనే కాలక్షేపం చేస్తుంటే ఎలాగండి... ఒక మంచమైనా కొనుక్కోలేక పోయారూ..." చాపను చుట్ట బెడుతూ ఓరకంట ఆంజనేయులు వేపు చూస్తూ అంది తరుణి.

 

    గుడ్లప్పగించి తరణి వేపు చూడడం తప్ప, మరో భావం లేదు ఆంజనేయులి ముఖంలో.

 

    "ఇదిగో పిల్లా... నువ్వెవరు... అర్దరాత్రి తలుపులన్నీ వేసున్న ఈ ఇంట్లోకి ఎలా వచ్చావ్... ఆ భుజంగరావు... నన్ను టెస్ట్ చెయ్యడానికి నిన్ను పంపించాడా...? చెప్పవా... ప్లీజ్...? వాడు రాకముందే నాకన్నీ చెప్పెయ్యవా..." గాబరాగా అటూ యిటూ చూస్తూ అడిగాడు ఆంజనేయులు.

 

    అదే సమయంలో లోన్నించి వచ్చాడు ఆనందం.

 

    "నువ్వు వస్తూ, వస్తూ ఏదయినా కొత్త టవల్ గానీ తెచ్చావా..." తరణిని అడిగాడు ఆనందం.

 

    "ఇప్పుడే ఎందుకు... రాత్రికి చెప్తాలెండి..." ఆనందానికి వినబడేట్టుగా అని...