బ్రిటిష్వారిని వణికించిన గూఢచారి – సరస్వతి రాజమణి

 

స్వేచ్ఛ విలువ, బానిసత్వంలో మాత్రమే తెలుస్తుంది. స్వాతంత్ర్యం కోసం మనసు తపిస్తుంటే... ఆ బాధేమిటో పీడనలో ఉన్నవారికే అర్థమవుతుంది. అలాంటి బ్రిటిష్ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాలని సాహసించినవారు ఎందరో! ఇప్పుడు వాళ్లందరినీ మనం మర్చిపోయి ఉండవచ్చుగాక! కానీ మన స్వేచ్ఛ వారి భిక్ష అన్న విషయాన్ని చరిత్ర గుర్తుచేస్తూనే ఉంటుంది. అలాంటి ఓ గొప్ప యోధురాలే సరస్వతి రాజమణి.

రాజమణి కుటుంబంవారు బర్మాలో స్థిరపడిన తమిళురు. రాజమణి తండ్రికి ఓ బంగారు గని ఉండేది. కానీ అతని మనసు మాత్రం భారతదేశంలో అప్పుడు సాగుతున్న స్వాతంత్ర్య పోరాటం మీదే ఉండేది. 1927లో ఆ కుటుంబంలో పుట్టిన రాజమణి, ఊహ తెలిసినప్పటి నుంచే తండ్రి బాటే పట్టింది. భారత స్వాతంత్రానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా వారిద్దరూ వెళ్లేవారు. అలా ఓసారి బర్మాకు వచ్చిన గాంధీజీని కూడా కలిశారు. ‘నేను పెద్దయ్యాక కనీసం ఒక్క బ్రిటిషర్నైనా చంపుతాను,’ అని రాజమణి ఆయనతో అందట. అప్పుడు ఆమె వయసు పదేళ్లు! అహింసావాది అయిన గాంధీజీకి రాజమణి దృక్పథం నచ్చలేదు. రాజమణికేమో అహింస రుచించలేదు.

 

 

రాజమణికి 16 ఏళ్ల వయసుండగా నేతాజీ బర్మాకు వచ్చారు. అప్పటికే ఆయన Indian National Army (INA) అనే సంస్థను స్థాపించి సాయుధపోరుని మొదలుపెట్టారు. సహజంగానే ఆయన బాట రాజమణికి నచ్చింది. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను,’ అంటూ ఆయన అందించిన పిలుపూ నచ్చింది. వెంటనే తన ఒంటి మీద ఉన్న నగలన్నీ INAకు విరాళంగా ఇచ్చేసిందట. ఓ 16 ఏళ్ల పిల్ల తమకు నగలిచ్చిందని తెలుసుకున్న నేతాజీ వాటిని తిరిగి ఇచ్చేయడానికి రాజమణి ఇంటికి వెళ్లారట. అక్కడ ఆమె తన నగలను తిరిగి తీసుకోనంటే తీసుకోనని మొండికేసింది. ఆమె పట్టుదలకు మెచ్చిన నేతాజీ ‘లక్ష్మీదేవి (సంపద) నీ దగ్గర ఎప్పుడూ నిలకడగా ఉండకపోవచ్చు. కానీ నీలోని సరస్వతి (జ్ఞానం) మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే నీకు సరస్వతి అని పేరు పెడుతున్నాను,’ అని చెప్పారట. అప్పటి నుంచీ రాజమణి పేరు సరస్వతి రాజమణిగా మారింది.

నేతాజీతో పరిచయం అయిన ఆ రోజునే తాను INAలో చేరి తీరతానంటూ సరస్వతి పట్టుపట్టింది. దాంతో ఆమెను తన దగ్గర ఉన్న నలుగురు గూఢచారులలో ఒకరుగా నియమించారు నేతాజీ. బ్రిటిష్ అధికారుల ఇళ్లలో పనివారుగా పనిచేస్తూ అక్కడి రహస్యాలను చేరవేయడమే వీరి పని. ఆ పనిలో సరస్వతి ఆరితేరిపోయింది. విలువైన సమాచారాన్నెంతో నేతాజీకి అందచేసింది. అలాంటి ఓసారి తన తోటి గూఢచారిని కాపాడే ప్రయత్నంలో సరస్వతి కాలికి బుల్లెట్ గాయమయ్యింది. అంతటి గాయంతో కూడా మూడురోజుల పాటు బ్రిటిష్వారికి చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. సరస్వతి చూపిన ఈ తెగువకు ఆమెకు బ్రటిష్ చక్రవర్తి చేతుల మీదుగా పతకాన్ని ఇప్పించారు నేతాజీ!

 

INA పోరు ఉధృతంగా సాగుతుండగా నేతాజీ హఠాత్తుగా అదృశ్యం కావడం, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిపోయాయి. రాజమణి కుటుంబమంతా స్వతంత్ర దేశం మీద ఆశతో ఇండియాకు తిరిగివచ్చేశారు. తమ యావదాస్తినంతా భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. సహజంగానే ప్రభుత్వం వీరి సేవను పట్టించుకోలేదు. రాజమణి చెన్నైలో కటిక దరిద్రాన్ని అనుభవించింది. కానీ ఆమెలోని సేవాగుణానికి మాత్రం ఎలాంటి పేదరికమూ పట్టలేదు. ఎక్కడెక్కడో తిరిగి పాతబట్టలని సేకరించి, వాటిని అనాథ శరణాలయాలకు అందించేవారు. ప్రస్తుతం సరస్వతి రాజమణి ఏ పరిస్థితులలో ఉన్నారో దేశానికి తెలియదు. కానీ మనం ఇంత హాయిగా, స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దానికి సరస్వతివంటివారి త్యాగమే కారణం అన్న విషయాన్ని మాత్రం ఎవరూ విస్మరించలేరు.

- నిర్జర.