"అదేరోజు నిన్ను మళ్ళీ కలుసుకుంటాను."

 

    "ఎందుకు."

 

    "నువ్వు నాభార్యలా ప్రవర్తించకపోయినా కొన్ని నిముషాలపాటు నీకు నేను భర్తగా మారటానికి."

 

    "వాట్ డూయూ మీన్."

 

    "ఐ మీన్ ది సేమ్ మిస్ దృశ్యా... నీ సామ్రాజ్యంలో నువ్వో యువరాణివని తెలిసిన నేను నీచేత శమంత్ ని రక్షింపచేసి నీ వ్యక్తిత్వానికి నిజాయితీగా తలవంచాలనుకున్నాను. దానికి నువ్వు అంగీకరించడంలేదు కాబట్టి నీ ద్వారా నీకు ప్రియమయిన యిద్దరు వ్యక్తులూ అదే నీ తండ్రి, నీ కాబోయే భర్త మహేంద్రల్ని సాధించాలనుకుంటున్నాను. నిజం దృశ్యా... నువ్వు నేను చెప్పింది చేయకపోతే నీ పుట్టినరోజునాడు నిన్ను కలుసుకుంటున్నాను. నీ పడక గదిలో నిన్ను అనుభవించి... నీకూ, నీ వాళ్ళకి ఓ తిరుగులేని గుణపాఠం చెప్పబోతున్నాను."

 

    "నీ... నీ తలలో జేజమ్మ దిగిరావాలి."

 

    "జేజమ్మకోసం యెదురుచూడకు... ముందు మీ బామ్మ నడుగు."

 

    "యేమిటి."

 

    "మొదటి అనుభవంలోని మాధుర్యం గురించి."

 

    ఫోన్ క్రెడిల్ చేసిన దృశ్య ఉద్విగ్నంగా వెనక్కి తిరగబోతూ టక్కున ఆగిపోయింది.

 

    ఎప్పుడు వచ్చిందో యేమిటో నానమ్మ రెప్పలార్పకుండా చూస్తూంది సమీపంలో నిలబడి.

 

    "అతనేనా... ..."

 

    ఉడకుమోత్తనంగా అరిచింది దృశ్య "అతనే అంటే"

 

    "అదేనే... అర్థరాత్రి అంబులెన్స్ వేన్ లో మూడు నిముషాలు నీతో..."

 

    "గ్రాండ్ మా... ..." కేకపెట్టింది "మాటిమాటికి ఆ మూడు నిముషాల సంగతి మాటాడకు."

 

    "నీకు తెలిదే పిచ్చి మొద్దూ... ఆడదాని మూన్నాళ్ళ బ్రతుకునీ మట్టి గలిపేది ఆ మూడు నిముషాలే."

 

    "ఏం కాలేదు గ్రాండ్ మా..." నచ్చచెప్పబోయింది.

 

    "ఎలా నమ్మమంటావ్? ప్రాణం పోయిందనుకున్న నువ్వు టక్కున లేచి కూర్చున్నావూ అంటే ఆ మూడు నిముషాల్లో ఏదో అద్భుతం జరగలేదూ అంటే నన్నెలా నమ్మమంటావ్."

 

    "ఖర్మ" తలపట్టుకుంది దృశ్య.

 

    "అవును. బంగారంలాంటి కొంపలో జరగాల్సిన ముచ్చట అక్కడ జరగడం, అదే పెళ్ళికాకుండా జరగటం ఖర్మ కాక మరేమిటి?"

 

    "నానమ్మా... నీకు దణ్ణం పెడతానే. ఆ మూడు నిముషాల్లో అతను పట్టుకెళ్ళింది నా బ్రాసరీయే తప్ప మరేం ముట్టుకోలేదు."

 

    "ఆ మగతలో నువ్వు గ్రహించి వుండవుగాని ముమ్మాటికీ మరేదో చేసుంటాడు. పైగా... అందుబాటులో బంగారం వుండగా, వదిలి పక్కనున్న వెండి గరిటెని ఏ దొంగయినా పట్టుకెళతాడటే. ఇంకా చెప్పాలీ అంటే ఆ బంగారాన్ని దోచుకున్నాకనే వెండి ముట్టుకుంటాడు."

 

    బామ్మగారు తన అనుభవసారాన్ని క్రోడీకరిస్తుంటే అనుమానంగా చతికిలబడిపోయింది దృశ్య.

 

    దృశ్యకిప్పుడు మరో పదిహేనురోజుల్లో భారీ ఎత్తున జరగబోయే తన బర్త్ డేపార్టీ గుర్తుకొస్తూంది.


                                   *  *  *


    రాత్రి ఎనిమిదిగంటల సమయంలో...

 

    ఇంట్లో అడుగుపెట్టిన శ్రీహర్ష గాయాన్ని చూస్తూ ఆందోళనగా సమీపించింది రేష్మి.

 

    "ఏమైంది? ఈ రక్తమేమిటి" అతడి జవాబుకోసం ఎదురుచూడకుండా ఆత్మీయురాలిగా సపర్యలు చేస్తూ భుజానికి బేండేజ్ చుట్టింది. "డాక్టర్ ను పిలుస్తాను.

 

    "అవసరంలేదు రేష్మి. ఇదో పెద్ద గాయంకాదు" వారించాడు శ్రీహర్ష. ఆ క్షణంలో నిజానికి శ్రీహర్ష ఆలోచిస్తున్నది శమంత్ గురించి.

 

    దృశ్య ద్వారా శమంత్ ని రక్షించాలనుకున్న ఆలోచన విఫలమైపోయింది.

 

    జూలీ గురించి అడగాలన్న తొందరపాటు లేదిప్పుడు. శమంత్ ని కాపాడాలి.

 

    అతను అదృశ్యమై సుమారు ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా ప్రభుత్వపరంగాగాని, డిపార్టుమెంట్ పరంగాగాని అతడ్ని దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపించకపోవడంతో మనసెందుకో ఆందోళన పడుతూంది.

 

    "మీకు ముందే చెప్పాను దృశ్యని తక్కువగా అంచనా వేయొద్దని" ఈ స్వల్ప వ్యవధిలో శ్రీహర్షపై ఆమె ఎంతటి అనుబంధాన్ని పెంచుకున్నదీ ఆమె ప్రవర్తనే తెలియచెబుతుంది. "మీకు తెలీదు శ్రీహర్ష... దృశ్య ఆడపిల్లే అయినా ఓ బలమయిన నేరవ్యవస్థకి చెందిన అమ్మాయి. అసలు మీకు సహకరిస్తుందని ఎలా అనుకున్నారు."

 

    సాలోచనగా చూసాడు "పొరపాటు పడ్డాను రేష్మి."

 

    "ఇంతటితో ముగిసిపోలేదు శ్రీహర్ష. మీమీద దాడి మరింత ఉధృతమౌతుంది. జరిగింది దృశ్య ద్వారాగాని, డేవిడ్ మూలంగాగాని తెలుసుకున్న ఆ వ్యక్తులు మిమ్మల్ని అంత సులభంగా వదిలిపెట్టరు."

 

    రేష్మి చెబుతున్నది పూర్తికాకముందే లోపలికి దూసుకొచ్చాడు రాణా.

 

    దేనివిషయంలోనో చాలా ఉద్విగ్నంగా కంపిస్తున్నాడు "మీరోసారి రావాలి"

 

    "ఏమైంది?" అడిగింది రేష్మి.

 

    రాణా చెప్పలేదు. రొప్పుతున్నాడు.

 

    "ప్లీజ్. బయలుదేరండి."

 

    కదలబోతున్న రాణా భుజం పట్టుకున్నాడు శ్రీహర్ష "చెప్పురాణా ఏం జరిగింది?"

 

    అప్పుడు కనిపించాయి రాణా కళ్ళలో రెండు నీటిబొట్లు.

 

    "రాణా..." శ్రీహర్షలో సన్నని గగుర్పాటు. "నాకు జవాబు కావాలి."

 

    "సర్" రాణా గొంతుకేదో అడ్డంపడినట్టు ఆగిపోయాడు. "చట్టాన్ని చుట్టపీకలా తగలేసి మసిచేయగల నేరవ్యవస్థ పరాకాష్టని మీరు చూడాలీ అంటే వెంటనే నాతో బయలుదేరాలి. నన్నేం అడగొద్దు. కమాన్."

 

    ఇక రెట్టించలేదు శ్రీహర్ష.

 

    ఏది జరిగినా కానీ ఏదో జరగకూడనిదే జరిగిందని అర్థంకావడంతో బయటికి నడిచాడు.

 

    "నేనూ వస్తున్నా" కారుదగ్గరికి నడిచింది రేష్మి.

 

    ఆమె ఆయింటి గడపదాటి చాలా రోజులయింది.