అక్కడి వ్యాపారులంతా ఆడవారే!

 


ఆకాశంలో ఎగరాలన్నా, వీధిలో నిలబడి వ్యాపారం చేయాలన్నా అది మగవాడికే సాధ్యం అని ఇంకా నమ్ముతున్న రోజులివి. ఆడవాళ్లంటే డైలీ సీరియల్స్‌ చూసేవారేననీ, ఆ డైలీ సీరియల్స్‌లో పాత్రలలాగానే వారి మనస్తత్వాలూ ఉంటాయని హేళన చేస్తున్న సందర్భం ఇది. ఇలాంటి సందర్భంలో ఓ ఐదువందల సంవత్సరాలుగా ఆడవారే వ్యాపారస్తులుగా సాగుతున్న ఓ వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకోక తప్పదు.

 

తల్లుల వ్యాపారం

అది మణిపూర్‌ రాజధాని ఇంఫాల్. అక్కడికి వెళ్లి ఊళ్లో ‘ఇమా కేతెల్‌’ ఎక్కడ అంటే ఎవరైనా చెబుతారు. అంతా మహిళా వ్యాపారస్తులే కనిపించే ఒక బజారే ఈ ఇమా కేతెల్‌! ‘ఇమా’ అంటే మణిపురి భాషలో తల్లి అనీ, ‘కేతెల్’ అంటే బజారు అనీ అర్థం. అలాగని ఇక్కడ పదిమందో వందమందో మహిళా వ్యాపారస్తులు కనిపిస్తారనుకుంటే పొరపాటే! ఇక్కడ ఏకంగా 4000 మందికి పైగా మహిళలు రోజూ వ్యాపారాన్ని సాగిస్తుంటారు.

 

వందల ఏళ్ల చరిత్ర

ఇమా కేతిల్‌ స్త్రీలను ప్రోత్సహించేందుకు ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బజారు కాదు. మణిపురి స్త్రీలంతా వందల ఏళ్లుగా ఒక చోట గుమికూడి చేసుకుంటున్న కూడలి. ఈ బజారు గురించి దాదాపు ఐదువందల సంవత్సరాల క్రితమే మణిపురి సాహిత్యంలో ప్రస్తావనలు కనిపిస్తాయి. 1786లోని బ్రిటిషర్ల గెజెట్‌లో అయితే ఇంఫాల్‌ మధ్యలోంచి ప్రవహించే నంబుల్‌ నదీతీరంలో ఆడవారే వ్యాపారస్తులుగా సాగే లావాదేవీల గురించి వివరణ ఉంది.

 

 

వ్యాపారానికి పునాది

500 ఏళ్ల క్రితం మణిపురి సమాజం భిన్నంగా ఉండేది. చాలామంది మగవారు పొలం పనుల పేరుతోనో, సైన్యంలో పనిచేసేందుకో... పొట్ట చేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు. మరి ఆ సమయంలో ఇంట్లో మిగిలిన కుటుంబసభ్యులు బతికేదెలా! అందుకే ఆడవారు నిదానంగా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించే బాధ్యతని మహిళలే తీసుకున్నారు. బొమ్మలు చేయడం, బట్టలు అల్లడం, ఆభరణాలు రూపొందించడం... ఇలా తమకు నైపుణ్యం ఉన్న పనిలో వస్తువులని రూపొందించి వాటిని అమ్మేవారు. రానురానూ ఇలా ఒక చోటకి చేరిన ఆడవారితో ‘ఇమా కేతెల్‌’ రూపుదిద్దుకొంది.

 

 

కష్టాలను తట్టుకొని

21వ శతాబ్దంలోనే ఆడవారంటే చులకన ఉన్నప్పుడు ఇక వందల ఏళ్ల క్రితం సంగతి చెప్పేదేముంది! స్థానిక వ్యాపారస్తులంతా ఎప్పుడెప్పుడు వీరిని తరిమికొడదామా అని ఎదురుచూసేవారు. ఇక బ్రిటిషర్ల కాలంలో అయితే వీరిని ఖాళీ చేయించేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ తన చోటుని వదిలుకొనేందుకు స్త్రీలు ఇష్టపడలేదు. నల్లదొరలైనా, తెల్లదొరలైనా... తమ జోలికి ఎవరు వచ్చినా తలవంచలేదు. వ్యాపారాన్ని అంగుళం కూడా వదులుకోలేదు. ఇప్పటికీ ఇక్కడి ఆడవారిలో అదే సామరస్యం కొనసాగుతోంది. పైగా వీరంతా కలసి కష్టాలలో ఉన్న మహిళలకు రుణాలను అందించేందుకు ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

 

 

ప్రపంచంలోనే అతి పెద్దది

కేవలం మహిళలలే కనిపించే బజార్లలో ‘ఇమా కేతెల్‌’ అతి పెద్దది అని ఓ అంచనా. ఈ కూడలి ప్రత్యేకతను గ్రహించిన మణిపుర్‌ ప్రభుత్వం వారు వ్యాపారం చేసుకునేందుకు పక్కా భవనాలను నిర్మించి ఇచ్చింది. నెలకి ఓ నలభై రూపాయలు చెల్లిస్తే చాలు మహిళలు ఇక్కడ నిరాటంకంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఎండుచేపల దగ్గర్నుంచీ బట్టల దాకా ఇక్కడ లభించని వస్తువంటూ ఉండదు. పైగా ఇక్కడ వ్యాపారం సాగించే ఆడవారు కూడా చాలా చైతన్యంగా ఉంటారని చెబుతారు. వారు ఇంటింటి రామాయణాల గురించి కాకుండా సామాజిక అంశాల గురించీ, సమకాలీన రాజకీయాల గురించీ చర్చించుకునేందుకే ఎక్కువ ఇష్టపడతారట.
 

 

- నిర్జర.