ముచ్చటైన సంసారాల్లో మూడు ఆరోపణలు
భార్యలందరి ఆరోపణలలో కామన్‌గా వినిపించే ఓ ఆరోపణ ఏంటి? ఓ యూనివర్సిటీలో భార్యాభర్తల సంబంధాలపై అధ్యయనం చేస్తు్న్న బృందానికి ఈ డౌట్ వచ్చంది. సందేహం వచ్చిందే తడవుగా ఆ బృందం సభ్యులు భార్యాభర్తలని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒకటి అని మొదలుపెట్టిన వీరికి ఒకటి కాదు, రెండు కాదు, పదుల్లో కామన్‌గా చెప్పుకోదగ్గ ఆరోపణలు కనిపించాయిట. దాంతో అందరి ఆడవారి ఆలోచనా విధానం ఒక్కలా వుందా? లేక మగవారి అందరి ప్రవర్తన ఒక్కలా వుందా? అన్న మరో సందేహం కలిగిందిట వారికి. సరే, ఇలా ఒక సందేహం నుంచి మరో సందేహం రావటంతో దానిపై కూడా పనిలోపనిగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు.
ఈ ఆరోపణలలో మొదటి స్థానంలో నిలిచిన ఆరోపణ ఏంటో తెలుసా? ‘మెచ్చుకోవటం’. భార్యలందరూ మా భర్తలు మమ్మల్ని ఎంతమాత్రం మెచ్చుకోరు అంటూ చెబితే, భర్తలు మాత్రం మా భార్యలని ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదంటూ వాపోయారట. కప్పు కాఫీ నుంచి మెచ్చుకోవాలంటే ఎలా? అని అడిగే భర్తలకి సమాధానంగా భార్యలు ‘‘కమ్మగా తాగిన కాఫీ బావుంది అని చెప్పడం కష్టమా?’’ అంటూ నిలదీసారుట. ఇలా ‘‘మెచ్చుకోవటం’’ అన్న విషయంపై వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయట. ఎవరు గెలిచారు? అన్న అనుమానం రావటం అనవసరం. పరిష్కారం వున్నా అమలుకాని సమస్యలా మిగిలిపోతోంది అంటూ అధ్యయనం చేస్తున్నవారు సైతం చేతులెత్తేశారంటే ‘‘మెచ్చుకోలు’’ పవరేంటో అర్థంచేసుకోవాల్సిందే.
భార్యలు భర్తల మీద వినిపించే ఆరోపణలో రెండో స్థానం దక్కించుకున్న ఆరోపణ ఏంటో తెలుసా? ‘సారీ’. ‘మెచ్చుకోవటం’ ఎలాగూ రాదు.. కనీసం సారీ అన్నా చెప్పొచ్చు కదా అన్నది ఆడవారి మరో ఆరోపణ అయితే, అసలు ఏ విషయానికి ‘సారీ’ చెప్పాలన్నది మాకెలా తెలుస్తుందన్నది మగవారి సమాధానం. అదేంటి.. ఇది, అది అని ఏముంది.. ఎన్ని సారీలు చెప్పినా పోయేదేముంది అంటూ భార్యలు అన్నదానికి ‘‘అదేమరి.. ఇగోని దాటి ‘సారీ’ బయటకి రావడం అంత సులువా? అన్నది భర్తల సమాధానం. చూశారా నాణానికి రెండు వైపుల్లా, కత్తికి రెండు వైపులా పదునులా ఎవరి బలమైన వాదనలు వారికి వున్నాయి.
ఇక మూడో స్థానంలో నిలిచిన ఆరోపణ.. ‘బహుమతులు ఇవ్వకపోవడం’. తీసుకోవడంలో మహా ఉత్సాహం చూపించే శ్రీవార్లు ఇవ్వటంలో ఎందుకంత వెనుకబడి వుంటారు? అంటూ శ్రీమతులు ఆరోపిస్తే, మొత్తం పర్సు చేతిలో పెడతాం. కావల్సింది కొనుక్కోక ఈ ఇవ్వలేదన్న గోలేంటి? అన్నది శ్రీవార్ల సమాధానం. బావుంది. బహుమతి ఇవ్వడం, తీసుకోవటంలోని సరదా ఎందుకు అర్థంకాదు? కావల్సింది కొనుక్కోలేక బహుమతులు అడుగుతామా? అంటూ కోపంగా భార్యలు ప్రశ్నిస్తే, వారిచ్చిన సమాధానం విని ప్రశ్నలు అడిగినవారు సైతం తెల్లబోయారుట. ఆ సమాధానం ఏమిటంటే, మీకు నచ్చిన బహుమతి ఏంటో తెలుసుకోవటం మా వల్లకాదుకానీ, అదేదో మీరు కొని తెచ్చుకుంటే సర్ ప్రైజ్‌గా మీకు ఇస్తాం కదా అన్నది భర్తల సమాధానం.
మొత్తానికి యూనివర్సల్‌గా శ్రీవార్లపై శ్రీమతుల చిర్రుబుర్రులకి కారణమయ్యే ఆరోపణలు ఇంచుమించు ఒక్కటే అని తేలిందిట. కారణాలే ఏమైతేనేం తాము మారం అని భీష్మించుకు కూర్చునే శ్రీవార్లతో ఎందుకులెమ్మని ఎవరికివారు మని తాము మెచ్చుకోవడం, సారీ చెప్పకపోయినా చెప్పినట్టే అనుకోవడం, బహుమతులు ఇవ్వకపోతేనేం తీసుకోవడం తెల్సింది కదా చాల్లే అని సర్దుకుపోవడం. ఇలా ప్రతీ విషయానికి నచ్చచెప్పుకుని ముందుకు సాగిపోతున్న మహిళకి ‘జై’ అన్నారు ఆ అధ్యయనకర్తలు.
-రమ ఇరగవరపు
