దానిమీదే అతడి భవిష్యత్తు ఆధారపడివుంటుందన్న ఆలోచన్ని ఇంటర్వ్యూలో ప్రకటించాడు రాజీవ్.

 

    రాజీవ్ కి, సవ్యసాచికి సంబంధమేమిటి? అడిగాడు టక్కున.

 

    రాజీవ్ ఎవరోకాదు, తండ్రిని మించిపోవాలని కలలుగంటున్న తనయుడు, సవ్యసాచికి కొడుకు.

 

    క్షణంపాటు నిర్విణ్నుడిలా చూసాడు శ్రీహర్ష.

 

    రాజీవ్ దృశ్యకి అన్నయ్య, మహేంద్రకి కాబోయే బావమరిది. ఏం చేయబోతున్నదీ చెప్పలేదు.

 

    "రాజీవ్ అనబడే ఈ వ్యక్తి చాలా ఘోరంగా దెబ్బతినబోతున్నాడు రేష్మీ. బహుశా యిక మళ్ళీ కోలుకోడు" బయటికి చెప్పలేదు.

 

    నిశ్శబ్దంగా బయటికి నడిచాడు శ్రీహర్ష.


                                    *  *  *


    పత్రికల్లోనేకాక దూరదర్శన్ లోనూ రాజీవ్ నిర్వహిస్తున్న ఆర్టు ఎగ్జిబిషన్ గురించి భారీగా పబ్లిసిటీ ఇవ్వబడింది.

 

    నగరం నడిబొడ్డునవున్న విశాలమైన ఓ భవంతిలో లక్షల కోట్ల రూపాయల ఖరీదు చేసే పెయింటింగ్స్ డిస్ ప్లే చేయబడ్డాయి.

 

    చాలా పటిష్టంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయబడింది.

 

    మొదటిరోజు నగరానికిచెందిన ప్రముఖులతోబాటు దేశంలో ప్రముఖ చిత్రకారులయిన హుస్సేన్, రాయ్, చెందూలాంటివారు హాజరయ్యారు.

 

    రెండవరోజు దేశ ఉపప్రధానితోబాటు కొందరు కేంద్రమంత్రులు విజిట్ చేశారు.

 

    మూడవరోజు అమెరికానుండి పదిమందిదాకా ఎగ్జిబిషన్ సందర్శించారు.

 

    నాలుగవరోజు అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ నుంచి ఆర్టు లవర్స్ ఓ వందమందిదాకా వచ్చారు.

 

    రాజీవ్ చాలా ఉత్సాహంగా అందర్నీ రిసీవ్ చేసుకున్నాడు. నగరంలోని ఆఖరిరోజు దాకా 'ది ప్లయిట్ యింటూ ఈజిఫ్టు అందర్నీ అమితంగా ఆకర్షించిన ఉత్తమ చిత్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది.

 

    ఆరోజు సాయంకాలం అయిదుగంటలకి.

 

    అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలకి చెందిన ఆర్టు లవర్స్ మధ్య ఆక్షన్ మొదలయింది.

 

    మూడు దేశాలకి చెందిన కోటీశ్వర్లు "ది ఫ్లయిట్ యింటూ ఈజిఫ్టు"ని ఎలాగయినా సాధించాలన్న ఆలోచనతో మొండిగా ధర పెంచుకుంటూ పోయారు.

 

    అరగంట వ్యవధిలో పూర్తయింది.

 

    ప్రపంచంలోని అత్యుత్తమ పెయింటింగ్ గా ఖ్యాతిపొందిన వేన్ రిజన్ "ది ఫ్లయిట్ యింటూ ఈజిఫ్టు" చివరికి అమెరికా దేశస్థుడికే నిర్ణయించింది.

 

    ఆక్షనులో ఏభయ్ రెండు లక్షల రూపాయలదాకా అంటే రాజీవ్ ఊహనిమించి రేటు నిర్ణయమైపోయింది.

 

    అతడి సంతోషానికి అవధుల్లేవు.

 

    పత్రికా విలేకర్లు, దూరదర్శన్ కేంద్రమూ అతడ్ని ఇంటర్వ్యూ చేస్తుండగా ఉన్నట్టుండి ఎగ్జిబిషన్ హాల్లో ఓ కేక వినిపించింది.

 

    అలా కేకపెట్టింది పెయింటింగ్ సొంతంచేసుకున్న అమెరికా దేశస్థుడు మిస్టర్ టెక్సాస్.

 

    ఏభై రెండు లక్షల రూపాయల విలువగల చెక్ ని రాజీవ్ కి ప్రజెంట్ చేసేముందు అతడి 'ఎక్స్ పర్టు కమిటీ' "ది ఫ్లయిట్ ఇంటూ ఈజిఫ్టు"ని పరీక్షించింది జాగ్రత్తగా.

 

    ఏడు నిమిషాల వ్యవధిలో తేలిపోయింది.

 

    అది వేన్ రిజన్ పెయింటింగ్ కాదు.

 

    "ఇట్స్ ఫేక్ మాన్యుమెంట్" అరిచాడు అమెరికాకి చెందిన మిష్టర్ టెక్సాస్ "యూ ఆరే ఛీట్"

 

    "నో" రాజీవ్ అదిరిపడుతూ టెక్సాస్ని చేరుకున్నాడు "సరిగ్గా చెక్ చేయండి."

 

    "ఆర్టు లవర్ గా కోట్లఖరీదుచేసే కళాఖండాన్ని సేకరించిన నాకు నువ్వు యిక సలహా ఇవ్వనక్కర్లేదు."

 

    "ప్లీజ్."

 

    అమెరికాదేశానికి చెందినవాళ్ళేకాదు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాల వ్యక్తులూ పరిశీలించారు.

 

    అందరూ ముక్తకంఠంతో తేల్చింది ఒక్కటే "ఇది వేన్ రిజన్ పెయింటింగ్ కాదు".

 

    ప్రపంచ ప్రఖ్యాతిచెందిన లియోనార్డు పెయిటింగ్ "మొనాలిసా"కి నకిలీగా రూపొందించబడిన చాలా చాలా పెయింటింగ్స్ లా ఇప్పుడు వేన్ రిజన్ "ది ఫ్లయిట్ యింటూ ఈజిఫ్టు" వెలవెలబోతుంటే విదేశీ టూరిస్టులంతా వెళ్ళిపోయారు.

 

    ఉన్మాదిగా మారిపోయిన రాజీవ్ పిచ్చివాడిలా తలబాదుకుంటున్నాడు.

 

    నెలలతరబడి పెంచుకున్న ఆశలు కూలిపోగా గుండెలవిసేలా పొలికేకలు పెడుతున్నాడు.

 

    ఎప్పుడో పదిలక్షల రూపాయల్ని వెచ్చించి కొన్న పెయింటింగ్ అది.

 

    సుమారు నలభయ్ లక్షల లాభాన్ని పొందబోయాడు.

 

    చిత్రలేఖనం తెలిసిన నిపుణులు దాని నాణ్యతని ఆనాడు నిర్ధేశిస్తే యిప్పుడు అది 'అసలు' కాదు 'నకిలీ' అంటూ మూడుదేశాలకి చెందిన వ్యక్తులు తేల్చి మరీ వెళ్ళిపోయారు.

 

    అంటే... తను మోసపోయాడు.

 

    ఇక దాని ఖరీదు లక్షలూ వేలూ కాదు వందల్లోకి దిగజారిపోతూంది.

 

    "డేమిట్!"

 

    మతి భ్రమించినట్లు గోడకున్న పెయింటింగ్ ని చేతులతో పెరికేసాడు.

 

    కసిగా, రోషంగా ముక్కలుచేస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. దూరంనుంచి యిదంతా గమనిస్తున్న శ్రీహర్ష నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.

 

    "ఇది... ఇదెలా జరిగింది?" రాణా విస్మయంగా అడిగాడు.

 

    "రాజీవ్ మోసపోయాడు" మృదువుగా అన్నాడు శ్రీహర్ష.

 

    "అవును. పదిలక్షలు ఖర్చుచేసి నకిలిదీ కొన్నాడు."

 

    "అది నకిలీది కాదు రాణా! ఒరిజినల్ పెయింటింగే."

 

    "వాట్?" అదిరిపడ్డాడు రాణా.

 

    "ఎస్! రాజీవ్ యిప్పుడు నాశనం చేసింది నూరుశాతం వేన్ రిజన్ ది ఫ్లయిట్ యింటూ ఈజిఫ్ట్."

 

    ధృడంగా అన్నాడు శ్రీహర్ష.

 

    అక్కడ గాలి గడ్డకట్టుకుపోయింది.

 

    "ఎస్పి శ్యాంసుందర్ తో మొదలయిన ఈ వేట యిలా కొనసాగుతూనే ఉంటుంది మిస్టర్ రాణా!"