లిల్లీ కార్ డోర్ తీసి పట్టుకుని "అంతా సరిగ్గా మనం అనుకున్నట్లు జరిగిందా?" అంది.

 

    నేను ఆమె పక్కన కూర్చుంటూ "ఇంకా బాగా జరిగింది. ఈ దెబ్బతో రోడ్డుమీదకి వచ్చేస్తాడు. రేవతి మనం అనుకున్నదానికంటే ఎక్కువ గట్టిగా అనిపిస్తోంది. ఈడియట్...భయపడుతున్నానని ఏడిపించుకు తిందామనుకున్నాడు!" అన్నాను.

 

    "అప్పుడే అయిందా? రెండు రోజులు 'నా సంగతేం చేశావు? వచ్చేయనా? అని" ఫోన్ చేసి ఏడు. మగాడు దేనినైనా భరిస్తాడు కానీ ఏడుపు భరించలేడు! అరవైశాతం జంటలు భార్యల ఏడుపువల్లే దూరం అయ్యారని ఒక సర్వేలో తేలిందట!" అంది.

 

    "టైగర్! తనకి కడుపునిండినా ఇంకెవరూ తన ఎర జోలికిరాకుండా కాపుకాస్తూ అవసరం అయితే ఎంత నీచానికైనా ఒడిగడ్తాడు ఈ రకం మగాడు. సరిగ్గా క్లాసిఫై చేసావు లిల్లీ!" కసిగా అన్నాను.

 

    "మానసికంగా నువ్వు పడినంత నరకం పడాలి చూడు! నీ సంగతి సరే. స్వయంకృతాపరాధం. ఈ మాలా, గీతా, షీలా ఎవరో తన జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారో తెలీక మధనపడిపోవాలి" అంది.

 

    నిజమే! ప్రేమ అనుకుని ప్రలోభపడి సర్వస్వం అర్పించేందుకు కూడా సిద్దపడిన నా అమాయకత్వం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి!

 

    "ఆ సందీప్ సంగతి కూడా చూద్దామా?" అడిగింది.

 

    "ఒద్దులే, లయన్ కొంతనయం. కాదనుకున్నాక నా గురించి పట్టించుకోలేదుకదా!" అన్నాను.

 

    లయనెస్ లు ఉంటారని వాడికి తెలియాలి కదా...ఫోన్ నెంబరియ్యి" అంది.

 

    "ఒద్దు" స్థిరంగా అన్నాను.

 

    లిల్లీ పక్కన ఉంటే ఏ భయం ఉండదు! ఆడపిల్లలందరూ ఇంత ఆత్మస్థయిర్యంతో ఉంటే... అసలీ గొడవలే ఉండవు అనుకున్నాను.


                                  *  *  *


    చిత్ర చెప్పేదంతా విన్నాకా, రివర్స్ చేసి మేం ఆడిన ప్లే మంచి ఫలితాన్నిచ్చింది అని తేలింది.

 

    "రేవతి ప్రతిసారిలాగా ఈసారి బాబీని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోలేదు. సిద్దార్థనే ఇంట్లోంచి తరిమేసింది. కాళ్ళుపట్టుకున్నా కనికరించలేదు. దాంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఆ పాటికే రేవతి ద్వారా కథంతా తెలుసుకున్న వాళ్ళు తలుపు అవతలే నిలబెట్టి మాట్లాడారు. దయచేసి తన మాట వినమనీ, ఇంకోసారి వెధవ పనులు చెయ్యననీ గోడు గోడున ఏడిచాడు.

 

    అయ్యాగార్ని షాప్ ఛాయలకి రానివ్వద్దని రేవతి మేనేజర్లకి ఆర్డరేసింది. కారు లేక, హోదా లేక, ఉండటానికి ఇల్లు లేక నాలుగురోజుల్లోనే బుద్ధి తిరిగి వెళ్ళి రేవతి కాళ్ళమీద పడ్డాడు. తండ్రిని పిలిపించింది.

 

    అతను విధేయతతో ఎలా మెసలాలో అతని హక్కులు ఎంతవరకో రాతపూర్వకంగా చూపించి అందుకు సమ్మతించినట్లు సంతకాలు చేయించారు.

 

    "ప్రస్తుతం అతను రేవతికి పనివాడు మాత్రమే! ఇటు అతని తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేకపోవడంతో చచ్చినపాములా పడివున్నాడు. ఇంక జన్మలో ఏ ఆడపిల్ల జోలికీపోడు అనుకుంట!" అంది.

 

    తన సోషల్ స్టేటస్, సుఖం తగ్గకుండా నన్ను ఉంచుకోవాలనుకున్నాడు. అది కాస్తా ఎదురు తిరిగేసరికి ఖంగుతినుంటాడు. ఈ రకం మగవాడ్ని వంచడం ఎంత ఈజీ? ఇది తెలీక ఆడపిల్లలు బ్లాక్ మెయిలింగ్ లకి లొంగిపోయి భయపడి చస్తుంటారు.

 

    నిజానికి ఆడపిల్లకి ఉన్నంత తెగువ మగాడికి ఉండదు! ఏ విషయంలో అయినా మనసుకు నచ్చాలే కానీ ఆడది మొదటి అడుగు వేస్తుంది!

 

    చిత్ర నా చెయ్యిపట్టుకుని "ఇదంతా నావల్లే జరిగింది. అనాలోచితంగా నేను ఆరోజు వాడిని మిమ్మల్ని డ్రాప్ చెయ్యమనడంతో ఈ పీడ మిమ్మల్ని చుట్టుకుంది. నన్ను క్షమించు!" అంది అపాజిటిక్ గా.

 

    "నీ వల్లే జరగలేదు. తప్పు నాదికూడా వుంది. అతనిభావం, తీరూ అర్థమవగానే నీ దగ్గరకొచ్చి విషయం చెప్పి అతని గురించి తెలుసుకొని వుంటే ఇంతదాకా వచ్చేదికాదుగా!" అన్నాను.

 

    ప్రేమించడం అనే టెండెన్సీ నాలో చిన్నప్పటినుంచీ ఉంది. ఆ తీగ కాస్త ఆసరా దొరకగానే పైకి పాకాలని అనుకుంటుంది. బాగా పాటలు పాడ్తాడని ఒకడ్నీ, ఆడ్తాడని ఒకడ్నీ, రాస్తాడని ఒకడ్నీ...ఇలా కన్నెపిల్ల తన హృదయాన్ని పదిలంగా అరిటాకులో పెట్టి అందిస్తూ వుంటే ఎవడైనా వదుల్తాడా? మనసు ఒకడికే అర్పించే నైవేద్యం...అందరికీ పంచే ప్రసాదం కాదు!

 

    నిజంగా సిద్దార్థ మాటలకి ఏ ఆడపిల్ల అయినా భ్రమసి వెళ్ళిపోయి వుంటే...రహస్యంగా ఉన్నంతకాలం హాయిగా సుఖపడి, పెళ్ళానికి తెలియగానే ఆమెని నట్టేట్లో ముంచి చక్కాపోయేవాడు!

 

    ఆ సాయంత్రం లిల్లీతో ఈ మాటే అన్నాను.

 

    లిల్లీ దీర్ఘంగా నిట్టూర్చి "సృష్టిలోనే వుంది పక్షపాతం, ఆడామగా అసమానతా!" అంది.

 

    "ఎలా?" అడిగాను. ఏ విషయమైనా ఒక టీచర్ లా ఆమె విడమర్చి చెప్పే తీరు నాకు నచ్చుతుంది.

 

    "చూడు ముక్తా...ఏ స్త్రీ అయినా తనకు ముప్పై ఐదూ, ముప్పై ఆరూ వచ్చేవరకే శృంగారపరంగా ఏక్టివ్ గా ఉండగలుగుతోంది. కానీ మగవాడు అలాకాదు! యాభైఏళ్ళు దాటాకా కూడా ఉత్సాహంగా అన్నీ అనుభవించగలుగుతున్నాడు.

 

    అలాంటప్పుడు స్త్రీ విషయంలో అతనికి ఛాయిస్ ఎక్కువ. ముసలాడు కూడా కన్నెపిల్లనీ, పరువంలో ఉన్న స్త్రీనే కోరుకుంటాడు కానీ ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉందనో, వయసులో ఉన్నప్పుడు ఆనందాన్నిచ్చిందనో ఓ యాభైఏళ్ళ స్త్రీని దగ్గరకి తీయడు.

 

    పెళ్ళి అనే వ్యవస్థ స్త్రీ సెక్యూరిటీ కోసమే ఏర్పడింది. అదే లేకపోతే ప్రతివాడూ తనకి అవసరం ఉన్నంతవరకే ఆమెని పోషించి, ఆ తర్వాత మరో పాతికేళ్ళలోపు అమ్మాయిని చూసుకునేవాడు.