తర్వాత అతను పులిని మోసుకుని శాయి ఇంటివరకూ వచ్చాడు. సంగతివిని పిల్లా పాపా , ఇరుగూ పొరుగూ అంతా పరిగెత్తుకు వచ్చి చోద్యం చూస్తూ నిలబడ్డారు. వృద్ధులు శాయిని భుజంతట్టి అభినందించారు. రెండుమూడు గంటల వరకూ గ్రామంలోని ప్రజలంతా విడివిడిగా చూచి పోవటానికి వచ్చి పోతున్నారు. "ఏమో అనుకున్నాను. మీ ఆయన పెద్ద చదువులు చదివిన ఇంజనీరేకాదు, గొప్ప వీరుడుకూడా సుమా" అంది ప్రక్కింటి ముత్తయిదువ సీతను బుగ్గ పుణికి. కనిపించీ కనిపించకుండా సీత ముఖంమీద ఓ గర్వపు ఛాయ, లజ్జారేఖ అవతరించగా కిటికీలోంచి బయట జనాన్ని తిలకిస్తూ నిలబడింది ఆమె.

 

                                          * * *

 

    రోజులు నెమ్మది నెమ్మదిగా గడిచిపోతున్నాయి. శాయి సక్సేనాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. పొలాలను ఒకటొకటిగా అమ్మివేస్తున్నాడు.

 

    అతనికి గంగరాజు ఇప్పుడో కాలక్షేపమయ్యాడు. ఏమీ తోచనప్పుడూ, మనస్సు మరీ చికాకుగా ఉన్నప్పుడూ అతని దగ్గరకు వెళ్ళి అతని పాకలో కూర్చునేవాడు. మొదట్లో గంగరాజు "అదేమిటి దొరా! తమరేమిటి, ఇంతదూరం నడిచి, ఈ దిక్కుమాలిన చోటుకు రావడమేమిటి? కాకితో కబురుచేస్తే మీ ఇంటికి పరిగెత్తిరానా?" అని వారించబూనాడు గాని శాయి నిర్లక్ష్యంగా "నాకు అడ్డు చెప్పకు గంగరాజూ! నాకు ఇక్కడికి రావాలనిపించింది. వస్తున్నాను. దాన్ని గురించి చర్చ అనవసరం" అనేసరికి ఇహ మెదలకుండా ఊరుకున్నాడు.

 

    గంగరాజు ఆ ఊరి రాజకీయాల గురించీ, పలుకుబడిగల పెద్దల స్వభావాల గురించీ, మునసబు కరణాల తగాదాల గురించీ ఎడతెరిపి లేకుండా కబుర్లు చెబుతుంటే శాయి వింటూ కూర్చునేవాడు. ఒక్కొక్కప్పుడు యిద్దరూ పులిజూదంగానీ, దాడిగాని ఆడుతూ కూర్చునేవారు. లేకపోతే ఇద్దరూ తారతమ్యాలు మరిచి సీసాల మూతలు ఊడదీసి, గ్లాసుమీద గ్లాసు నింపుకుంటూ త్రాగేవారు. త్రాగిన మైకంలో గంగరాజు చెప్పే కబుర్లు మహ పసందుగా ఉండేవి. తనకు ఉన్న స్త్రీ సంబంధాలూ, తాను ఎంత మంది ఆడవాళ్ళని పాడుచేసినదీ, చేలల్లో, తోటల్లో, కొండల్లో, రాత్రుళ్ళు ఒంటిగా తన పాకలో చేసిన సాహస కృత్యాలూ, అనుభవాలూ కర్ణ పేయంగా వర్ణించి చెప్పేవాడు.   

 

    గంగరాజు శరీరం నలుపు. కండలు తిరిగిన దండలు, విశాలమైన ఎడద. ఎర్రటి కళ్ళు. కత్తి మీసాలూ.... మనిషి ఆకర్షణీయంగానే ఉంటాడు. అతనికి చీకటన్నా, విషజంతువులన్నా భయంలేదు. అప్పుడప్పుడూ తారసపడే విషసర్పాలను బాగా కర్ర ప్రక్కకి త్రోసివేయటంగాని, బుసకొట్ట బోతే నాలుగు దెబ్బలు తగిలించి చంపివేయటంగాని చేస్తుంటాడు.

 

                                         * * *

 

    ఒక రోజు రాత్రి శాయి సోఫాలో కూర్చుని మసక వెల్తురులో తన అలవాటు ప్రకారం త్రాగుతూండగా సీత లోపలకు వచ్చి గోడనున్న దీపం పెద్దది చేసింది.

 

    "ఎవరూ? సీతా!" అన్నాడు శాయి కళ్ళు వెడల్పు చేసి ఆమె వైపు చూస్తూ.

 

    ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి చేతిలోని గ్లాసును మృదువుగా లాక్కుని ప్రక్కన బల్లమీద పెడుతూ "మీ పాదాలు పట్టుకుంటానుగాని ఇవాల్టికి ఇహ ఆపివేయండి. మీకు పుణ్యముంటుంది" అంది రుద్ధ కంఠంతో.

 

    అతను ఆశ్చర్యంగా ఆమెవైపు చూస్తూ "సీతా! ఏమిటిది? ఎప్పుడూ లేనిది ఎందుకిలా అర్థిస్తున్నావు నన్ను?" అన్నాడు తడబడుతూ.

 

    "ఇక్కడికి వచ్చాక ఈ కొద్దికాలంలోనూ మీరెంత క్షీణించిపోయారో, మీరెంత నీరసంగా కన్పిస్తున్నారో ఒక్కసారి అడ్దం ముందు నిలబడి చూచుకోండి. మీకే బోధపడుతుంది" అంది సీత దీనవదనంతో.

 

    "చిక్కిపోయానా? చిత్రమేనే. నేను ఫారిన్ లో ఉన్నప్పుడూ ఇలానే త్రాగుతూ ఉండేవాడ్ని. అప్పుడు చిక్కిపోనిది ఇప్పుడెలా జరిగిందంటావు సీతా! నువ్వే చెప్పు."

 

    "మీరువచ్చిన కొత్తలో ఎప్పుడూ ఇంత త్రాగేవారుకాదు. అందుకనినేనెప్పుడూ అడ్డుచెప్పలేదు. కాని ఈ మధ్య విపరీతంగా త్రాగుతున్నారు. సరిగ్గా భోజనం చేయటం లేదు. అందుచేత క్షీణించిపోతున్నారు." సీత అతనికి బాగా దగ్గరగా జరిగింది. ఆ సమయంలో అతనంటే యెనలేని జాలి కలిగి, అతని జుట్టులోకి వ్రేళ్ళు పోనిచ్చి దువ్వాలన్న కోరికను బలవంతంగా ఆపుకుంది.

 

    "ఓ! ఎక్కువచేశానా? యు ఆర్ బ్రిలియంట్! నువ్వు అసలు విషయాన్ని కనిపెట్టావు సీతా! ఆ గ్లాసు ఇలా ఇవ్వు."

 

    "ఇవ్వను. ఈ రోజుకు మీరింక మానివేయక తప్పదు."

 

    "ఏమిటి? యెప్పుడూ లేనిది నీకింత ధైర్యం ఎలా వచ్చింది?"

 

    "అది ధైర్యంకాదు. నా స్వార్థం - నా ధర్మం. నా భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోవటం నా విద్యుక్త ధర్మం."

 

    "ఇప్పుడు నా ఆరోగ్యానికేమి లోటొచ్చింది.?"

 

    "రాలేదా? శారీరకంగానూ, మానసికంగాను మీరెంత కృశించి పోయారు?"

 

    "మానసికంగానా? అదేమిటి!"

 

    "నన్ను మభ్యపరచటానికి ప్రయత్నించకండి. యేమీ లేదా? ఇలా చూడండి నా ముఖంలోకి."

 

    అతను తలయెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. దీపం వెలుతురులో నిష్కల్మషమైన ఆమె ముఖం, సజలనయనాలు, చెదిరి పాలభాగం మీదకు పడుతోన్న ముంగురులు అతని కళ్ళకి మసక మసగ్గా గోచరించాయి.

 

    "చూశాను ఏం? చూడలేననుకున్నావా?"

 

    "మీరు చూడగలరు. నాకు తెలుసు. మీరు పాపాన్ని కూడా నిర్భయంగా చెయ్యగలరు. అదే మీలోని హుందా."

 

    "ఏమిటీ సోద? ఆ చెప్పేదేదో స్పష్టంగా చెప్పరాదూ?"

 

    "అడుగుతున్నాను. వేదితను గురించి మీ కిలాంటి పాపిష్టి భావాలు ఎలా కలిగాయి.

 

    ప్రశ్న తూణీరంలా, విద్యుత్ తరంగంలాగ వచ్చింది. బాణం గుండెలో దిగబడినట్లు విద్యుద్ఘాతం తగిలినట్లు అదిరిపడ్డాడు. అతని మత్తువీడిపోయి నిషా దిగిపోయింది. "ఏమిటీ నువ్వు మాట్లాడేది? ఎవరు చెప్పారు నీకు?" అని అరిచాడు వెర్రివాడిలా.