మరో రెండు నిమిషాల తర్వాత, కిటికీలోంచి బయటికి దూకి, కారడార్లోంచి తన రూమ్ వేపు నడవడం ప్రారంభించాడు ఆ వ్యక్తి.
    
                                                 *    *    *    *    *
    
    భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ కి సరిగ్గా ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
    
    హోటల్ కళింగా అశోక-
    
    రూమ్ నెం 114లో, గాఢ నిద్రలో ఉన్న సూర్యవంశీకి సడన్ గా మెలుకు వొచ్చింది.
    
    గోడ గడియారం వేపు చూసాడు.
    
    పది గంటలు దాటింది.
    
    బద్దకంగా లేచి, కాలింగ్ బజర్ నొక్కి, డ్రాయింగ్ రూమ్ లోకి నడిచాడు.... బాయ్ రావడం, కాఫీ తేవడం, కాఫీతో పాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ అందివ్వడం జరిగిపోయాయి.
    
    తాపీగా కాఫీ సిప్ చేస్తూ, హెడ్ లైన్స్ తిరగేస్తున్న సూర్యవంశీ కళ్ళు....
    
    'MID NIGHT MURDER' అన్న హెడ్డింగు దగ్గర ఆగిపోయాయి... గబ, గబా ఆ వార్తను చదివాడు. ఆ వెంటనే సడన్ గా భూకంపంలో చిక్కుకుపోయిన వాడిలా అయిపోయాడతను.......
    
    హైదరాబాద్ కు చెందిన నగల వ్యాపారి సురేష్ మరియు మిసెస్ సురేష్....దారుణమైన మర్డర్ కు గురయ్యారు- హంతకుడు ఇద్దర్ని భయంకరంగా చంపడమే కాకుండా, అయిదు లక్షల కాష్ తో పరారైపోయాడు - డబ్బు కోసం జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కేసుని ఇన్స్ పెక్టర్ నర్సింహ మహంతి పరిశోధిస్తున్నారు..... ఆత్రంగా వార్త చదివాక ఫోటో వేపు చూసాడు సూర్యవంశీ.
    
    నగ్నంగా సల్మా, ఆ పక్కన సురేష్...
    
    నో.... దిసీజ్.... నాట్ ఏ మర్డర్.... నాట్ ఏ మర్డర్... అయిదు నిమిషాల సేపు మనిషి కాలేకపోయాడు సూర్యవంశీ.
    
    అతని బ్రెయిన్ నిండా గజి, బిజిగా ఆలోచన్లు.....
    
    మరో క్షణంలో టెలీఫోన్ వేపు పరిగెత్తి, పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి, జనపధ్ ఏరియా పోలీస్ స్టేషన్ నెంబర్ తీసుకున్నాడు....
    
    వెంటనే జనపధ్ ఏరియా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసాడు.
    
    "ఇన్స్ పెక్టర్ నర్సింహ మహంతి, స్టేషన్లో లేడు.... మరో అరగంటకు స్టేషన్ కి వస్తాడు." ఇన్ ఫర్ మేషన్ తీసుకుని.
    
    తనే స్వయంగా మహంతిని కలవడానికి రూమ్ లోంచి బయటపడ్డాడు సూర్యవంశీ.
    
                                               *    *    *    *    *
    
    తనెవరో, ఏమిటో, హైద్రాబాద్ నుంచి తనెందుకొచ్చాడో చెప్పాడు సూర్యవంశీ.
    
    "అంటే.... ఇది.... మనీ కోసం జరిగిన మర్డర్ కాదన్న మాట.... ఆ అమ్మాయి సురేష్ భార్యకాదా.... కాల్ గర్లా..." మహంతి ఆశ్చర్యపోతూ అన్నాడు.....
    
    "దిసీజ్ ఎ పక్కా పొలిటికల్ మర్డర్..... సో.... ఐ నీడ్ యువర్ కోపరేషన్...." అభ్యర్ధించాడు సూర్యవంశీ.
    
    "టెల్ మీ.... ఇన్ విచ్ వే ఉయ్ హేవ్ టు డీల్...." అడిగాడు మహంతి.
    
    "ఫస్ట్ ఫ్ ఆల్.... ఉయ్ హేవ్ టు గెట్..... ఫోరెన్సిక్ రిపోర్ట్.... దట్ మే హెల్ప్ ఫుల్ టు అజ్..."
    
    అలా అంటున్న సూర్యవంశీ వేపు ప్రశంసగా చూసాడు మహంతి.
    
    "పోలీసుల్ని మించిన తెలివి తేటలు మీకున్నాయి...." రిసీవర్ని అందుకుంటూ అన్నాడు మహంతి.
    
    "నో సర్! మర్డర్స్ ని మించిన తెలివితేటలున్నాయి...." నవ్వాడు సూర్యవంశీ.
    
    ఆ వెంటనే ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కి ఫోన్ చేసి మాట్లాడాడు మహంతి.
    
    ఫోన్ పెట్టేస్తూ-
    
    "మిస్టర్ సూర్యవంశీ.... ఇంకో మూడు గంటల తర్వాత మనకు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది..." చెప్పాడు మహంతి.
    
                                                  *    *    *    *    *
    
    ఫోరెన్సిక్ ప్రొఫెసర్ సుందరనాథ్, సూర్యవంశీ వేపు సూటిగా చూసి చెప్పడం ప్రారంభించాడు.
    
    "ఎస్.... దిసీజ్ ఎ బ్రూటల్ మర్డర్..... బట్ మర్డర్ ఈజ్ ఎ క్లెవరో, అండ్ జీనియస్.... ఎందుకంటే, ఫోరెన్సిక్ సైన్స్ లో నైఫింగ్స్ (కత్తిపోట్లు)కి ప్రత్యేక స్థానముంది-కత్తిపోట్లు, గాయాలలోతు, వైశాల్యం, కత్తి పదును వీటన్నిటి ద్వారా హంతకుడ్ని గుర్తుపట్టే అవకాశం ఉంది-
    
    ఇది కత్తి ద్వారా జరిగిన హత్య అయినా, మర్డర్ కి కత్తిని ఎంత మేరకు ఉపయోగిస్తే మనిషి చనిపోతాడో తెలుసు.... హియర్... మర్డర్ పర్ ఫెక్టలీ నోస్ ఎబౌట్ నైఫ్ యూసేజ్... దాంతో పాటు, కత్తిమీద గానీ, బాడీ మీద కానీ ఎక్కడా వేలిముద్రలు పడకుండా, హత్య చేసాడంటే, డెఫ్ నెట్లీ హి ఈజ్ ఏ ప్రొఫెషనల్ కిల్లర్....
    
    బట్-ఎంత తెలివైన హంతకుడైనా, ఎంతోకొంత, ఎక్కడో ఒక దగ్గర క్లూ ఇవ్వక పోడు.... ఇక్కడా అలాగే జరిగింది..."
    
    ఆ మాట అంటున్న సుందర్ నాధ్ ముఖంలోకి ఆశగా చూసాడు సూర్యవంశీ.
    
    "ఎస్.... మిస్టర్ సూర్యవంశీ.... తన వేలి ముద్రలు ఎక్కడా లేకుండా మర్దరర్ జాగ్రత్త పడినా, అతను వంటి మీద పడిన హతురాలి గోళ్ళే... మనకు సమాచారాన్నిస్తాయని అతను ఊహించలేకపోయాడు...." నవ్వుతూ చెప్పి, తన ముందు టైప్ చేసున్న మూడు పేజీల మేటర్ని సూర్యవంశీకి అందించాడు సుందర్ నాధ్.
    
    ఆ రిపోర్టును చదవడానికి ఉపక్రమించాడు సూర్యవంశీ.
    
    "తనను చంపడానికి మీద పడిన మర్డరర్ ని ప్రతిఘటించడానికి హతురాలు తీవ్ర ప్రయత్నం చేసింది- ఆ ప్రయత్నంలో హతురాలు తన బలమైన గోళ్ళతో హంతకుడిని రక్కడం జరిగింది. దాని కారణంగా హతురాలి కుడిచేతి గోళ్ళు చిట్లడం-ఆ విరిగిన గోళ్ళలో హంతకుడికి చెందిన రక్తపు బిందువులతో పాటు, రెండే రెండు వెంట్రుకలు చిక్కుపడడం జరిగింది.
    
    ప్రస్తుతం దారుణమైన హత్యకు గురైన ఈ మహిళ కేసులో, మహిళ గోళ్ళు, హంతకుడి వెంట్రుకలు ప్రధానమైన సాక్ష్యులు.
    
    ఇందులో మొదటి సాక్ష్యమైన హతురాలి గోళ్ళను విశ్లేషించగా, ఆసక్తి కరమైన అంశాలు తెలిసాయి.
    
    ఇందులో మొదటి పాయింట్ :
    
    ప్రతి వ్యక్తీ ఆడా, మగా శరీర భాగాలన్నింటిలాగానే, చేతివేళ్ళ గోళ్ళు కూడా 'ఫోరెన్సిక్ సైన్స్'లో ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. చేతి, లేదా కాలి గోళ్ళు కొంతమందికి బలంగా, వాడిగా ఉంటే, మరికొంత మందికి తేలికగా అల్పంగా ఉంటాయి - అందరికీ గోళ్ళున్నా, ప్రతివ్యక్తి గోళ్ళు, ఇంకో వ్యక్తి గోళ్ళకు భిన్నంగానే ఉంటాయి తప్ప - ఎక్కడా సరిసమానంగా మాత్రం ఉండవు.