పీటర్ పెట్టిన గడువు ఇంకా పాతిక నిమిషాలుంది.

 

    అప్పటికే కనకారావు సామంత్ పుట్టుమచ్చల వివరాలు తెలుసుకున్నాడు.

 

    ఇక మిగిలింది కేవలం పాస్ పోర్ట్ ఫోటోలు. సరిగ్గా పదిహేను నిమిషాలకి ఫోటోలు కనకారావు చేతికి వచ్చాయి.

 

    ఆ ఫోటోల్ని అందుకుంటూనే కనకారావు పీటర్ వుండే హోటల్ కి ఫోన్ చేశాడు.

 

    మరికొద్ది క్షణాలకి పీటర్ ఆవైపు లైన్ లోకి వచ్చాడు.

 

    "కొద్దిగా లేటయింది క్షమించాలి. మీరిప్పుడు బయలుదేరి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళండి. నేను సరాసరి ఎయిర్ పోర్టుకి వచ్చి మీరడిగిన వివరాల్ని, ఫోటోల్ని అందిస్తాను" అన్నాడు కనకారావు.

 

    లేటయిందని పీటర్ గాభరా పడలేదు. అతనికి తెలుసు... ఆఖరి నిమిషంలో నైనా కనకారావు వాటిని అందిస్తాడని. అందుకే తాపీగా "అలాగే" అంటూ ఫోన్ పెట్టేశాడు.

 

    అప్పటికి కనకారావు మనస్సు కుదుటపడింది. స్టూడియో బిల్ పే చేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సామంత్ కనిపించలేదు కనకారావుకి.

 

    అతని విషయం తర్వాత చూసుకోవచ్చని హడావిడిగా బయటకు వచ్చి రోడ్డుకి ఆవేపు ఆగి వున్న ఆటో దగ్గరికి వెళ్ళాడు వేగంగా.


                                 *    *    *    *


    సరీగ్గా అయిదు గంటలకు నరసింహం మోటార్ సైకిల్ స్టీఫెన్స్ స్ట్రీట్ లోకి ప్రవేశించింది.

 

    నరసింహం మోటార్ సైకిల్ వేగం తగ్గించి ఇంటి నంబర్లు చూస్తూ మెల్లగా వెళ్ళసాగాడు.

 

    16... 15... 14... వరుసగా నంబర్లు స్పష్టంగా కనిపిస్తుంటే విచిత్రమైన ఆనందోద్వేగానికి గురవుతున్నాడు నరసింహం.

 

    మధుమతి ఎలా ఉంటుంది? ఎంత వయస్సుంటుంది? ఏ కలర్ లో ఉంటుంది? ఇంట్లో ఒక్కతే ఉంటుందా?

 

    తనలో తానే రకరకాలుగా ప్రశ్నించుకుంటూ ఉద్వేగపు అంచులకు వెళుతున్నాడు.

 

    మరికొంతసేపటికి ఆరో నెంబర్ ఇల్లు కనిపించి ఆనందంతో కేక వేయబోయి బలవంతంమీద తనను తాను నిగ్రహించుకున్నాడు.

 

    మోటార్ సైకిల్ వేగం మరింత తగ్గించి ఆ ఇంటి గేటుముందాపి, నేమ్ ప్లేట్ చూశాడు. మధుమతి, కాటేజ్ నెంబర్ ఆరు అని చిన్న వుడెన్ ప్లేట్ మీద వైట్ పెయింట్ తో రాసుంది.

 

    "ఈమె పేరు మీదే ఇల్లు కట్టించారనుకుంటాను? బహుశా, ఆమె తల్లిదండ్రులకు ఈ కూతురంటే అమితమైన ప్రేమేమో? ఎంత లేదన్నా ఇల్లు ఖరీదు ఏడెనిమిది లక్షలు వుండి వుంటుంది. మధుమతి తల్లిదండ్రులు బాగా ఆస్తిపాస్తులున్న వాళ్ళే అయివుంటారు. అసలు ఒక్కతే కూతురేమో? ఇల్లే ఇంత చేస్తే మొత్తం మీద ఆస్తి ఓ పాతిక లక్షలు దాకా వుండి వుండవచ్చు.

 

    అమ్మాయి కూడా బాగా వుండి, ఒక్కతే కూతురయి వుంటే తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే."

 

    మోటర్ సైకిల్ ఇంజన్ ఆఫ్ చేసి, స్టాండ్ వేసి, గేటు తీసి, మోటార్ సైకిల్ ని తోసుకుంటూ లోపలికి తీసుకెళ్ళి పోర్టికో ముందు స్టాండ్ వేసి, ద్వారబంధం కేసి చూశాడు. తలుపులు దగ్గరగా వేసినట్లున్నాయి.

 

    త్వరత్వరగా వెనక్కి వెళ్ళి గేటు వేసి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. రెస్పాన్స్ లేదు. మరోసారి నొక్కబోతూ ఫోన్ లో విన్న మాటలు గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని చిన్నగా తలుపు నెట్టి చూశాడు.

 

    అది కొద్దిగా తెరుచుకుంది. ఓసారి అటూ ఇటూ చూసి ఎవరూ తనను చూడడం లేదని నిర్ధారించుకుని తలుపులు గట్టిగా నెట్టాడు.

 

    ఈసారి పూర్తిగా తెరుచుకున్నాయి. ఎదురుగా పెద్ద హాలు... నిశ్శబ్దంగా వుంది. ఖరీదైన ఫర్నీచర్ ఆ హాలంతా పరుచుకుని వుంది. ఆ హాలు మధ్య నుంచే మొదటి అంతస్తుకి దారి తీసే మెట్లు కనిపించాయి.

 

    ఎలా? ఇప్పుడేం చేయాలి? ధైర్యం చేసి మెట్లెక్కి పైకెళ్ళాలా? అక్కడే ఆగి పిలవాలా? ఎంతో ధైర్యమున్న ఎస్.ఐ. నరసింహం కూడా ఒకింత జంకాడు.

 

    అది ఒక విషవలయం అని కాని, తనపై బిగుసుకునే ఉచ్చు అక్కడ సిద్ధమవుతోందనిగాని అతనే మాత్రం అనుమానపడలేదు. ఉంటే గింటే ఆ అనుమానం కానిస్టేబుల్ సత్యాని కొక్కడికే వుంది.   

 

    "లోపలికి రావడానికి ధైర్యం చాలడం లేదా!"

 

    మాటలు వినిపించి ఉలిక్కిపడ్డాడు నరసింహం.

 

    ఆ మాటలు ఏ వేపు నుంచి వినిపించాయో అర్థంకాక తికమక పడ్డాడు. ఓ అడుగు ముందుకు వేసి హాలంతటిని పరికించి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు.

 

    "ఎక్కడ? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావ్?" నరసింహం కంఠంలో తొంగి చూసిన ఆరాటాన్ని పసిగట్టిందామె.

 

    తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ "వున్న పళాన నేను బయటకు వస్తే మీ రక్తం సలసలా మరిగిపోతుంది. నేనెక్కడున్నానన్నది ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశపడుతున్నాను" అంది మార్దవంగా.

 

    మాటలు దగ్గరి నుంచే వినిపిస్తున్నట్లున్నాయి. సరీగ్గా ఎక్కడ నుంచి అన్నది ఊహించలేకపోయాడు.

 

    క్షణక్షణానికి అతనిలో టెన్షన్ పెరిగిపోసాగింది.

 

    కవ్వింపంటే అదే... దానికే నరసింహాన్ని గురి చేయాలనుకుందామె.

 

    మరో రెండడుగులు వేసి హాలు మధ్యకు వచ్చి మరోసారి పరికించి చూశాడు నరసింహం. అయినా ఆమె జాడ అతనికి తెలీలేదు.

 

    అతనికి పిచ్చెక్కిపోతున్నట్లుగా వుంది. "ప్లీజ్... నన్నినా చంపొద్దు. త్వరగా బయటకు వచ్చేయ్" అన్నాడు నరసింహం బ్రతిమాలుతున్న ధోరణిలో.

 

    "అమ్మా... ఆశ" అంటూ ఆమె చిన్నగా నవ్వింది.

 

    "నువ్వు రమ్మంటేనే వచ్చాను. నా అంతట నేను ఆశపడలేదుగా? తీరా రప్పించి యిలా నన్ను సస్పెన్స్ లో పెట్టి ఏడిపించడం భావ్యమా?" నరసింహం ఆ సస్పెన్స్ ని తట్టుకోలేకపోతూ అన్నాడు.

 

    "ఆశ కాదా...? బాత్ రూమ్ లో వున్న ఆడపిల్లని, అందునా వయస్సులో వున్న ఆడపిల్లని, అందంగా వున్న ఆడపిల్లని, మీదుమిక్కిలి పెళ్ళి కాని ఆడపిల్లని వున్న పళాన బాత్ రూమ్ లోంచి బయటికు రమ్మనడం ఆశ కాదా?"

 

    ఆమె కంఠంలో తొణికిసలాడిన లాలనను, ఆమె ప్రస్తుతం వున్న చోటుని తలుచుకోగానే అతని రక్తం నిజంగానే పరుగులెత్తింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి, గొంతు తడారిపోయింది.

 

    "నా ఆశ తీర్చకూడదా?" ఇప్పుడతని కంఠంలో కాంక్ష స్పష్టంగా తొంగి చూసింది.

 

    "తీర్చబోతున్నాను సిద్ధంగా వుండు" అందామె.

 

    అప్పుడు గమనించాడు నరసింహం బాత్ రూమ్ ఎక్కడున్నదీ!

 

    అతను ప్రాణాలు బిగబట్టి, రెప్పవేయడం మర్చిపోయి బాత్ రూమ్ కేసే ఆశగా, ఆర్తిగా, కాంక్షగా చూడసాగాడు.


                                 *    *    *    *


    పీటర్ బోర్డింగ్ పాస్ తీసుకుని ఫ్లయిట్ కి ఇంకా టైముందని తెలీడంతో కెఫెటేరియా కేసి సాగిపోయాడు.