గుడి అంటే నిజంగా పాడుపడ్డదేంకాదు. వాస్తవానికి అది ఏ మాత్రం శిధిలం కాలేదు. ఒక్క స్తంభం కూలలేదు. ఇసుమంత సున్నం రాలలేదు. ఏమంటె పూజ పునస్కారాలూ లేవు అంతే. ఇది శక్తి దేవాలయం. విగ్రహం చెక్కు చెదరకుండా ఉంది. ఒక చేయి మాత్రం విరిగిపోయింది. ఆ దేవాలయాన్ని చూస్తే హనుమకొండలోని వేయి స్తంభాల గుడి గుర్తుకు వస్తుంది. సరిగ్గా అదే నమూనా. కాని అంత పెద్దది కాదు. బహుశాః ఇది నిర్మించిం తర్వాత అది కట్టి ఉంటారు. కాకతీయుల కాలంలోనే ఇదీ కట్టబడి ఉండాలి. వందల సంవత్సరాలు గడిచినా అది చెక్కు చెదరలేదు. దాని కప్పు బద్దలు కొట్టడానికి వందలమంది ఎక్కారు. వందల సమ్మెటలు కప్పుమీద పడుతున్నాయి. గునపాలు మ్రోగుతున్నాయి. జనం చెమటలు కక్కుతున్నారు. అయినా ఉహుఁ అది పగులలేదు. అయినా ఆగలేదు జనం. ఊపిరి పీల్చుకో నివ్వలేదు గిర్దావరు కులశేఖరరావుగారు. సమ్మెటలు వందలు పడుతున్నాయి. వేల దెబ్బలు. అయినా ఒక్కరోజులో కదల్లేదు. ఒకరోజు, రెండురోజులు, మూడురోజులు, నాలుగువనాడు కప్పుమీద సున్నంపొర బద్దలైంది. సమ్మెటల దెబ్బలు, గునపాల పోట్లు గుడి ఒక భాగపు సున్నపు పొరను తీసివేశాయి. చమటను కక్కేజనం చింతచెట్ల క్రిందికి చేరారు.

 

    ఆ రాత్రేకాదు, కోయలు వచ్చిన్నాటినుంచి ప్రతి రాత్రీ వస్తున్నాడు నాగేశ్ కోయదొరల వద్దకు. తొలినాడు వారు అతణ్ణి నమ్మలేదు. మూడవనాటికల్లా వారికి విశ్వాసం కుదిరింది. అతడు చెప్పేది విన్నారు. అతణ్ణి తన వాడుగా భావించారు. ఆ రాత్రికి రావఁడు, భీముడు కూడా వచ్చారు. వారు కోయల్లో కోయలైపోయారు. వారికి కావలసిన సహాయాలన్నీ చేశారు. కోయలు తరతరాలుగా చూస్తున్నవీ, అనుభవిస్తున్నవే అయినా వీరు చెప్పే మాటల్లో ఏదో కొత్తదనం కనిపించింది. వారు చెప్పేదాంట్లో వాస్తవిక ఉందని మొట్టమొదట గ్రహించిన వాడు సింగన్న. సింగన్న తన తల్లి చావుకూ, పీరయ్య చావుకూ ఏదో సంబంధం ఉందనుకున్నాడు. పీరయ్యను తలుచుకుంటున్నట్లు తన తల్లిని ఎందుకు తలుచుకోరో అర్థంకాలేదు. వడ్డెర్లను ఆదర్శంగా తీసుకొని గుడి కూలగొట్టమని ఎక్కొట్టాలనుకున్నాడు. తన వారికి అనేక విధాల బోధించాడు. అతని బోధనలు అర్థం అవుతూనే ఉన్నాయి. కావడం ఏమిటి? ప్రత్యక్షంగా చూస్తుంటే! అయినా తాసిల్దారును ధిక్కరించే ధైర్యం చాలామందికి కలుగలేదు. మళ్ళీ అంతా గుడిమీదకు ఎక్కారు. గునపాలతో కప్పుమీద రాళ్ళను తొలగించసాగేరు. రాళ్ళు ఒక్కొక్కటే పెద్ద ధ్వని చేసి కూలుతున్నాయి. పదాలు, పాటలు, మొత్తం రాళ్ళు కూలేయి. కూలేరాళ్ళను చూసి ఆనందం ఉప్పొంగుతున్నారు జనం. గుడి కూలిందని కాదు. విముక్తి దినాలు దగ్గిర పడుతున్నాయని! అయినా అది వారి శ్రమ ఫలం! కూలడం అయితేనేం, కట్టడం అయితేనేం! వారు చేయాల్సిందే! వేల సంవత్సరాలుగా నిర్మించింది వారే. నేటి నుంచి కూలబోయేదీ, రేపు కూల్చబోయేదీ వారే! వారే శ్రామికులు!!

 

    ఆ రాత్రికి రఘు వచ్చాడు. అతడు చెప్పింది ముందు వారికి అర్థంకాలేదు. క్రమక్రమంగా అర్థం కాసాగింది. సింగన్న తికమక పడ్డాడు. ఎవరు చెప్పింది నిజం? ఏది మార్గం? అతనిలో ఆవేదన బయలుదేరింది. ఆలోచన రేగింది. రఘు ఇంటికి రాకపోకలు సాగించాడు. జానకితో పరిచయం ఏర్పడింది. వారు పుస్తకాలను గురించి చర్చించుకుంటుంటే శ్రద్ధగా విన్నాడు. వాటిలో ఏవేవో గొప్ప గొప్ప విషయాలుంటాయని గ్రహించాడు. తాను చదవలేక పోయినందుకు విచారపడ్డాడు. అయినా అతనికి ఏదో వెలుగు కనిపించింది. ఆ వెలుగు అందరికీ చూపాలనుకున్నాడు. ఏదో చేయాలనే తహతాహ బయల్దేరింది.

 

    పై కప్పు కూలింది. రాళ్ళు విరిగిపడ్డాయి. అయినా స్తంభాలు నిశ్చలంగా నిలిచేవున్నాయి. వాటిని కూల్చాలి. అవి చెక్కు చెదరరాదు. పగ్గాలు కట్టి వందలమంది లాగారు. పగ్గాలు తెగాయి కాని స్తంభం కదలలేదు. గొలుసులు కట్టారు. వందల వేలమంది లాగారు. శిల్పసంపద కూలింది. ఒరిగింది. నేల కరిచింది. ఒకటి, రెండు, మూడు, అనేకం. ఆ కూలడాన్ని చూడాలనుకున్నాడు తాసిల్దారు. బండి కట్టుకొని వచ్చాడు. స్తంభాలు కూలుతుంటే అతని ఆనందానికి అంతులేదు. అవును, ఆ స్తంభాలే అతని భవనానికి అలంకారాలు.

 

    కావలసినన్ని స్తంభాలు కూలాయి. వాటిని ఊళ్ళోకి చేర్చాలి. ఊళ్ళో బండ్లన్నీ వచ్చాయి. స్తంభాన్ని ఎత్తడమే కష్టం. ఎత్తి బండిమీద వేస్తే బండ్లు కూలాయి, విరిగాయి. ఎన్ని బండ్లు కూలాయో, ఎన్ని విరిగాయో, కొంత దూరం మోసుకొని పోయిన బండ్లు కూలడమేగాక ఎడ్లు చచ్చాయి. స్తంభాల కిందపడి చితికారు కొందరు. అప్పుడు ఆలోచన వచ్చింది తాసిల్దారుకు. చిన్న చక్రాల బండ్లు చేయించాడు. వాటికి స్తంభాలను ఎత్తారు. ఆ బండ్లకు అనేక జతల ఎడ్లను కట్టారు. స్తంభాలు ఊళ్ళోకి చేరాయి. ఇక కోయదొరలు వెళ్ళిపోవచ్చు. కాని వాటిని ఎక్కించి పొమ్మన్నాడు తాసిల్దారు. తాసిల్దారు భవనానికి రెండు స్తంభాలు నిలిచాయి. నల్లని రాతి స్తంభాలు. అద్దంవలె తళతళ మెరిసే స్తంభాలు. ఆ అందం, ఆ చందం ఉబ్బిపోయాడు తాసిల్దారు. ఆనాడు అందరికీ అన్నదానాలు చేయించాడు. తరిద్దామని పాపం! గుడి స్తంభాలు తేవడం తప్పని ఎక్కడో ఒక మూల బాధిస్తూనే వుంది. రాత్రికి రక్తం వాంతి చేసుకున్నాడు. ఒకటి, రెండు, మూడుసార్లు. డీలాపడిపోయాడు. స్తంభాల వల్లనే తనకీ బాధ వచ్చిందనుకొన్నాడు. స్తంభాలు పీకి వేయవలసిందని ఆజ్ఞాపించాడు. ఇండ్లకు ప్రయాణం అవుతున్న కోయలు ఆగిపోయారు. స్తంభాలు కదిలాయి. సాగేయి. తురకవానికి తగినశాస్తి అయిందనుకున్నారు కులశేఖరరావుగారు.

 

    కోయలు విముక్తులయినారు. తమ గూడాలకు బయలుదేరారు. ఆ రాత్రి రఘు సహితంగా అంతా కోయలతోనే గడిపారు. కోయలు వారిని తమ గూడాలకు రావలసిందని ఆహ్వానించారు. బాగా రాత్రి వుండగానే బయలుదేరారు కోయలు. కొంత దూరం వారితో వెళ్ళి తిరిగి వచ్చారు నాగేశ్ మున్నగువారు.

 

    దారి పొడుగూనా కోయలు నాగేశ్ చెప్పిందాన్ని గురించీ, రఘు చెప్పిందాని గురించీ చర్చించుకున్నారు. "దౌర్జన్యం" "దోపిడి" "అధికారం" పీడితులు" ఇలాంటి పదాలు వారికి వచ్చేశాయి, అర్థంకాసాగేయి.

 

    కోయగూడెం చూచి వారికి ప్రాణాలు లేచివచ్చాయి. అంతా అడవి మీద పడ్డారు. వాటి వేటలో ఏనాడు లేనంత ఆనందం అనుభవించారు, వారు. ఆ రాత్రి అందరూ కోయలు గూడెంలోనే ఉండిపోయారు. సంబరాలు, విందులు, ఆటలు, పాటలు.

 

    తెల్లవారి కిందిగూడెం వారితో బయలుదేరాడు సింగన్న.


                                       6


    1918లో ఉర్దూ బోధనా భాషగా ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. అంతకుముందు నిజాం రాష్ట్రం మొత్తానికి ఒకే ఒక కాలేజీ-నిజాం కాలేజీ ఉండేది. అది మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల.

 

    చదువంటే బెదురు నిజాం నవాబుకు. అందువలన కనీసం గుమాస్తాలుగా తయారుచేసే చదువుకు సహితం అవకాశం కలిగించలేదు. అందుకు తోడు బహద్దుర్ యార్ జంగ్ స్థాపించిన ఇత్తెహాదుల్ ముసల్మీన్, రాజ్యం ముసల్మానులదనే నినాదం లేవదీసింది. అయినా కనీసం రాజ్యంలోని ముసల్మానులకు ఉద్యోగాలు దొరకలేదు. యు.పి., పంజాబు ప్రాంతాల నుంచి వచ్చినవారే ప్రధానమైన ఉద్యోగాల్లో నియమించబడేవారు.

 

    1935 ప్రాంతంలో నైజామ్ సబ్జక్ట్సు లీగ్ అనే ఒక సంస్థను స్తాంపిమ్చి ముల్కీలు-దేశీయులు-మాత్రమే ప్రభుత్వోద్యోగాల్లో నియమింపబడాలనే ఉద్యమం కొనసాగింది. తత్ఫలితంగా ప్రభుత్వం ముల్కీ నిబంధనలు ఏర్పాటు చేసింది.

 

    ఖాజా అసదుల్లాబేగ్ అన్సారీ పంజాబ్ యూనివర్శిటీలో న్యాయశాస్త్ర పట్టాపొంది ఉద్యోగంకోసం వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చాడు. కాని ముల్కీ నిబంధనల వలన అతనికి నిరాశ ఎదురైంది. అతడు ఉద్యోగాన్వేషణలో జాగీర్దారును ఆశ్రయించాడు. నజరానా సమర్పించుకున్నాడు. అతనిని మున్సిఫ్ మేజిస్ట్రేటుగా నెలకు నూరు రూపాయిల జీతం మీద నియమించినట్లు ఉత్తర్వులు జారీచేశాడు జాగీర్దారు. న్యాయశాఖను, పరిపాలనా శాఖ నుంచి విడదీసిన గౌరవం నిజాం నవాబుకే దక్కాలి.అందువలన తాసిల్దారు ఉన్నప్పటికీ జాగీరుకు మేజిస్ట్రేటు అవసరం అయ్యాడు. తన జాగీరులో తాసిల్దారే కాక మేజిస్ట్రేటు కూడా ఉన్నాడనే ఘనత దక్కించుకోవడం జాగీర్దారు ప్రథమ ఉద్దేశం. అంతకుమించి ఏమీలేదు.

 

    మేజిస్ట్రేటును కలుసుకోవలసిందని ప్రోత్సహించారు నాగేశ్ రఘును. అందువలన ప్రయోజనం ఉంటుందని భావించలేదు రఘు. అయినా అంగీకరించాడు. ఇద్దరూ అన్సారీ వద్దకు వెళ్ళారు. అన్సారీ పొడవైనవాడు. కాని పంజాబీలకు ఉండే శరీర సౌష్టవం లేదతనికి. బక్కపల్చగా ఉంటాడు. చెంపలు లొట్టలు, ముక్కు బాగా పొడవు. కొనదేరి ఉంటుంది. కంటికి అద్దాలు వచ్చే వయసు కాకున్నా కళ్ళద్దాలు వచ్చేశాయి. సిగరెట్లు విపరీతంగా కాలుస్తాడు. చాయ్ ఎన్నిసార్లు తాగుతాడో లెక్కలేదు.