బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా

 


‘నేను పుష్టిగా భోజనం చేసినా మా బాబుకి పాలు సరిపోవట్లేదు’ అని కొత్తగా తల్లయిన వాళ్ళు అనటం మనం వింటూనే ఉంటాం. అన్నం ఎక్కువగా తినేస్తే పాలు సమృద్దిగా పడతాయి అనుకోవటం పొరపాటే. మనం తీసుకునే ఆహారంలో పాలను ఉత్పత్తి చేసే పదార్థాలు అదిక శాతం ఉండేలా చూసుకోవాలి. మనకి అందుబాటులో ఉండే కొన్ని రకాల కూరగాయల్లో, మెంతులు, వెల్లుల్లి, తులసి, వాము, కాకరకాయి, బొప్పాయి మొదలైన వాటిలో పాలను ఉత్పత్తి చేసే గుణం అధికంగా ఉంటుంది. వీటిని మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు ఇక ఏ దిగులు ఉండదు.

మెంతులు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం. బాలింతకు ఎక్కువగా మెంతిపొడి, మెంతికూర మొదలైనవి పెట్టాలి. నార్త్ ఇండియన్స్ అయితే మెంతులతో చేసిన హల్వా తినిపిస్తూ ఉంటారు. మెంతులను నేతిలో వేయించి, పోసి చేసి వంతులు గోధుమ పిండిని కలిపి వాటిలో పంచదారపొడి వేసి హల్వా లా తయారు చేస్తారు.

 

 

సోంఫు కూడా బాలింతలకు మంచిది. పాలు తాగే పిల్లలకి కడుపులో నొప్పి లేదా గ్యాస్ కు సంబందించిన సమస్యలు దీని వల్ల బాగా తగ్గుముఖం పడతాయి. తల్లి ఈ సోంఫుని ఎంత తింటే పిల్లలకి అంత మంచిది. దీనిని పొడిగా చేసుకుని కూరల్లో తినచ్చు లేదా నీళ్ళల్లో వేసి కాచుకుని కషాయంలా కూడా తీసుకోవచ్చు.

వెల్లుల్లి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకే కాదు పాలకు మంచి రుచిని కూడా తెచ్చిపెడుతుందని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. వెల్లుల్లి తిన్న తల్లుల పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ పాలు తాగారట. ఈ వెల్లుల్లిని బాలింత తినే అన్ని వంటకాల్లో కలుపుకోవచ్చు.

అలాగే వాము కూడా పాలు పడటంలో ఎక్కువ సహాయం చేస్తుంది. వాము పొడిలో కాని కషాయంలో కాని తేనె కలిపి తినిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.యుటరస్ కి సంబంధించి  ఏదైనా సమస్య ఉన్నా అది కూడా తగ్గుతుంది.

అన్నింటికన్నా ముఖ్యమైనడి బొప్పాయి పండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దీన్ని అస్సలు తినకూడదని చెప్తారు అదే పండు డెలివరీ అయ్యాకా మాత్రం ఎక్కువగా తినాలి. ఇందులో తగినన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉండటమే కాకుండా పాలు సమృద్దిగా తయారుకావటానికి దోహదం చేస్తాయి. బాలింతలు దీన్ని ఎంత తింటే అంత మంచిది.

ఓట్స్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా విటమిన్ బి ఎక్కువగా ఉండటంవల్ల దీనిని తీసుకుంటే డిప్రెషన్ కూడా తగ్గుతుందిట. కొత్తగా తల్లి అయిన వాళ్ళలో తెలియని భయం ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ ఓట్స్ తినటం వల్ల పోతాయని తేల్చి చెప్పాయి కొన్ని అధ్యయనాలు.

వీటితో పాటు బ్రెడ్ తింటే కూడా మంచిది. తల్లులు తీసుకునే ఆహారంలోనే ఏది పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో తెలుసుకుని తీసుకుంటే చాలు, పిల్లలకి పోత పాలు పట్టాల్సిన పని ఉండదు.


..కళ్యాణి