అమృతానికి బ్రదర్.. వెనిగర్
బట్టల మీద మరకలా ?
కిటికీ అద్దాలు, తలుపులు మెరిసేలా చేయాలా ?
మొక్కల మొదలులో చీమలు ఎక్కువగా ఉన్నాయా ?
కూరలు త్వరగా వుడకాలా ?
ఇలాంటి ఎన్నో ఇబ్బందులకి విరుగుడు వెనిగర్. దీనిలో వుండే ఆమ్లగుణం వల్ల ఇది దానికదే ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది. పైగా ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలేంటో చూద్దాం.
1. బట్టల మీద కాఫీ, టీ మరకలు పోవాలంటే కొంచెం వెనిగర్, కొంచెం ఉప్పు సమపాళ్ళలో తీసుకుని ఆ మరకలు పడ్డ చోట రుద్దితే మరకలు పోతాయి.
2. కొత్త బట్టలు మొదటిసారి ఉతికేటప్పుడు ఆ నీటిలో చిన్న కప్పు వెనిగర్ వేసి చూడండి . అవి రంగులు పోకుండా వుంటాయి.
3. కిటికీ అద్దాలు, తలుపులు మెరవాలంటే పొడి బట్ట మీద కాస్త వెనిగర్ వేసి తుడిస్తే చాలు.
4. వంట పాత్రలని , ఓవెన్‌ని, వెనిగర్‌తో శుభ్రం చేస్తే మరకలు పోయి, ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా వుంటాయి.
5. ఇక మొక్కల మొదట్లో వెనిగర్‌ని స్ప్రే చేస్తే పురుగు పట్టకుండా వుంటుంది. అలాగే చీమలు వంటివి కూడా చేరవు.
6. కొన్ని కూరలు త్వరగా ఉడకవు. అలాంటప్పుడు కొంచం వెనిగర్ వేస్తే... అవి త్వరగా వుడుకుతాయి .
7. ఇంట్లో చేసే పచ్చళ్ళు బూజు పట్టకుండా వుండాలంటే వాటిలో కొంచెంవెనిగర్ వేసి చూడండి.
8. కోడి గుడ్లు ఉడికించే టప్పుడు ఒక టీ స్పూన్ వెనిగర్ వేస్తే తెల్ల సొన బయటకు రాకుండా వుంటుంది.
9. చికెన్ , మటన్ మెత్తగా ఉడకాలంటే కాస్త వెనిగర్ వేస్తే చాలు.
10. వెనిగర్‌తో చేతులు రుద్దుకుంటే, మృదువుగా వుంటాయి.
- రమ
