గవర్నర్ నుంచి స్పెషల్ మెసెంజర్ వచ్చాడు భూ కబ్జా జనార్ధన్ ఠాగూర్ దగ్గరకు.
    
    "పార్టీ లెజస్లేచర్ లీడర్ గా మెజార్టీ ఎమ్మెల్యేలు మీ నాయకత్వం కోరుతున్నందున, మరో పన్నెండు గంటల లోపల మీరు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసుకోడానికి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిదిగా మీకు అనుమతిస్తున్నాను...."    
    
    ఆ మెసేజ్ ను చూడగానే ఎగిరి గంతేసాడు జనార్ధన్ ఠాగూర్ మెసెంజర్ వెళ్ళిపోయాక బబ్లూవేపు తిరిగి అన్నాడు జనార్ధన్ ఠాగూర్.
    
    "డోన్ట్ గో..... బ్లయిండ్.... బీ.... కాషన్...."
    
    "డోన్ట్ అండర్ ఎస్టీమేట్ మీ జనార్ధన్ సాబ్...." నవ్వుతూ ఆ రూమ్ లోంచి బయటికొచ్చాడు కాషాయాంబర ధారి, కిల్లర్ బబ్లూ.
    
                                                      *    *    *    *    *
    
    ప్రమాణోత్సవం జరగడానికి ఇంకో మూడు గంటల సమయం ఉంది.
    
    నిజాం కాలేజీ వేదికను అత్యద్భుతంగా అలంకరించారు....
    
    తను సి.ఎమ్ గా ప్రమాణం చేసిన వెంటనే మంత్రివర్గ సభ్యుల్ని కూడా ప్రకటిస్తానని జనార్ధన్ ప్రెస్ మీటింగ్ లో ఎనౌన్స్ చేసాడు....
    
    ఒక పక్క సిటీలో రాజకీయ సందది....
    
    మరొక పక్క రెడ్ అలర్ట్....
    
    మోహరించిన సి.ఆర్.పి. దళాలు.... ఎటు చూస్తే అటు.... బబ్లూ కోసం సాగుతున్న వేట....
    
    ఒక పక్క తలవని తలంపుగా భోరున వర్షం....
    
    ఆ వర్షం కారణంగా ఫ్లయిట్ సర్వీసులన్నీ బందయ్యాయి.
    
    రాన్రానూ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది.
    
    నిజాం గ్రౌండ్స్, ఆహుతులతోనూ, అతిధులతోనూ నిండిపోతోంది.....
    
    ట్విన్ సిటీస్ లో .... అనుమానం వచ్చిన ప్రతిచోటా.... చేతిలో ఫోటోల్తో, సి.ఆర్.పి. దళాల వెతుకులాట..... బబ్లూ.... బబ్లూ..... బబ్లూ....
    
    ఎక్కడ ఏ నోట విన్నా....బబ్లూ....
    
    "బబ్లూ దొరికిపోతే...." జనార్ధన్ కి, బబ్లూకి మధ్య ఉన్న లింక్ విషయం తెల్సిన జనార్ధన్ ఠాగూర్ సన్నిహితులు - ఊహ ఆగమ్యగోచరంగా ఉంది.
    
    ఈ సిట్యువేషన్ లో.... బబ్లూని అండర్ గ్రౌండ్ కి పంపించేస్తే బాగుండేది....బబ్లూ మొండి మనిషి.... ఎవరి మాటా వినడు....
    
    టెన్షన్....
    
    ఒక పక్క రాజకీయ మంతనాలు, మినిస్టర్స్ లిస్ట్....వచ్చీపోయే గెస్టులు.....అంతా బాగానే ఉన్నా-
    
    కాబోయే సి.ఎం.....జనార్ధన్ మనసులో ఎక్కడో, ఏదో మూల ఏదో డౌటు - వెంటనే దుబాయ్ వెళ్ళకుండా బబ్లూని ఆగిపొమ్మన్నందుకు తాను తొలిసారి తనను తాను తిట్టుకున్నాడు జనార్ధన్ ఠాగూర్.
    
    వీడు దొరికిపోతే....
    
    దానిక్కూడా పరిష్కారం ఆలోచించాడు జనార్ధన్ ఠాగూర్.
    
    వెంటనే ఏం చెయ్యాలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ భాస్కరెడ్డికి చెప్పాడు..... అలాగే ఇంకొంతమంది ఇన్స్ పెక్టర్స్ కి చెప్పాడు.....
    
    మరో నలభై అయిదు నిమిషాలు మాత్రమే ఉంది.
    
    సి.ఎం. పదవీ ప్రమాణోత్సవానికి, ఏదో రకంగా బబ్లూ వస్తాడని అతని సిక్స్త్ సెన్స్ చెప్తోంది....
    
    ఎలా....ఎలా.... హౌ టు కేచ్ హిమ్...?
    
    సిటీలో వైర్ లెస్ సెట్లు రెస్ట్ లెస్ గా మోగుతున్నాయి.
    
    ఎక్కడ, ఏమాత్రం అనుమానం కలిగినా... ఆ వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకుంటున్నారు.
    
    హోటల్స్, టెంపుల్స్, ఓల్డు బిల్డింగ్స్.... గల్లీస్.... అన్నిటా నిఘా.... ఎవరయినా అనుమానస్పదమైన వ్యక్తి కన్పిస్తే.... వెంటనే ఫోన్ చెయ్యమని పోలీసులు పాంపెలెట్స్ పంచారు.
    
    స్పీకర్సు ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నారు..... సిటి మహాగ్నిగుండంలా ప్రజ్వరిల్లుతోంది.
    
                                               *    *    *    *    *
    
    కానీ బబ్లూ ఏమాత్రం కంగారు పడడంలేదు.
    
    సేమ్ ఓల్డ్ రెడ్ మారుతీ కారు - మధ్యాహ్నం వరకూ ఎక్కడున్నాడో తెలీదు-
    
    ప్రమాణోత్సవం అరవై నిమిషాలుందనగా-
    
    బయలుదేరాడు.... అదే డ్రెస్సు..... బౌద్దభిక్షువు డ్రెస్.
    
    ఎవరయినా తనని ఐడింటిఫై చేస్తే.....ఏవేం జాగ్రత్తలు తీసుకోవాలో, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు......
    
    ఎడం చేతిలో త్రిబుల్ ఫైవ్ సిగరెట్.... కుడిచేతిలో స్టీరింగ్....
    
    క్లోజ్ చేసిన విండోడోర్స్.....
    
    వర్షం కారణంగా, అన్ని కార్ల విండోలు దాదాపు క్లోజ్ చేసే వున్నాయి.....సరిగ్గా లిబర్టీ చౌరస్తా దగ్గర, బషీర్ బాగ్ రోడ్ వైపు కారుని మలుపు తిప్పాడు. కారు రివ్వున ముందుకెళ్ళి సడన్ గా ఆగింది-దానికి కారణం ట్రాఫిక్ జామ్....
    
                                            *    *    *    *    *
    
    ఆ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర ఫుట్ పాత్ మీద, వర్షానికి తడవకుండా నుంచుందో అమ్మాయి..... నిన్న రాత్రి, తను నగరం నుంచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోదామని నిశ్చయించుకున్న ఆ అమ్మాయి-
    
    బబ్లూని పట్టుకోవడం కోసం గవర్నర్ స్పెషల్ ఆర్దర్సు జారీ చేసిన విషయం తెల్సుకుని ఆగిపోయింది.
    
    ఆ అమ్మాయి అర్పణ..... బబ్లూ దుర్మార్గానికి బలైపోయిన అమ్మాయి.....ఆ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర తలదించుకుని అంతవరకూ నుంచున్న అర్పణ ఒక్కసారి ఎందుకో తల పైకెత్తింది.
    
    ఎదురుగా అయిదడుగుల దూరంలో ఆగిన రెడ్ మారుతీ కార్లో..... విచిత్రమైన డ్రెస్ లో బబ్లూ-
    
    సరిగ్గా అదే సమయంలో బబ్లూ తల పక్కకు తిప్పి చూసాడు కేజువల్ గా ఆ కళ్ళను, ఆ కళ్ళలోని, నెత్తురు జీరలను, స్పష్టంగా గుర్తుపట్టింది అర్పణ. ఎన్ని మారువేషాలు వేసినా బబ్లూను గుర్తుపట్టగలిగే ఏకైక వ్యక్తి అర్పణ....
    
    సరిగ్గా అదే సమయంలో కారు ముందుకు దూసుకుపోయింది.....
    
    వరుసగా.... కార్లు వరదప్రవాహంలా-