మారుతున్నసీజన్ లో చిన్న పిల్లల కోసం ఇవి పాటించండి..!
.webp)
మారుతున్న సీజన్‌లో ముఖ్యంగా వేసవి నుంచి వర్షాకాలం, లేదా చలికాలం వైపు మారుతుంటే చిన్నపిల్లల ఆరోగ్యం చాలా త్వరగా ప్రభావితమవుతుంది. ఈ మార్పుల కారణంగా పిల్లలు సులభంగా జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, అలర్జీలు, స్కిన్ సమస్యలు వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
ఆహార సంబంధిత జాగ్రత్తలు..
తాజా, తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి . వీటి నుండి పిల్లలకు విటమిన్లు, మినిరల్స్ తగినన్ని లభిస్తాయి. పాలు, పండ్లు, జ్యూసులు మొదలైనవి వేడి గానో చల్లగానో కాకుండా గోరువెచ్చిగా ఇవ్వాలి. బాటిల్ జ్యూసులు, ఐస్ క్రీములు, కోల్డ్ డ్రింకులు తగ్గించాలి . ఇవి గొంతు సమస్యలకు కారణం అవుతాయి. పిల్లలకు ఇచ్చే నీటి విషయంలో జాగ్రత్తలు అవసరం. శుద్ధి చేసిన, మరిగిన నీరు మాత్రమే ఇవ్వాలి.
దుస్తులు & శుభ్రత..
వాతావరణానికి తగ్గ దుస్తులు పిల్లలకు వేయాలి. వేసవిలో కాటన్, చలికాలంలో వెచ్చని దుస్తులు వేయాలి. పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో కాసింత వసుపు వేసి ఆ పసుపు నీటితో స్నానం చేయించడం మంచిది. ఇది శరీరంపై బ్యాక్టీరియా ఉండకుండా చేస్తుంది. చేతులు తరచుగా కడిగే అలవాటు పిల్లలలో ఉండేలా చూడాలి. ముఖ్యంగా ఆహారం తినే ముందు, బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ అలవాటు ఉండేలా చూడాలి.
సీజన్ సమస్యలు.. నివారణ..
జలుబు, దగ్గు వచ్చిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి . వేడి నీటి ఆవిరి, తులసి-అల్లం కషాయం తీసుకోవడం ముఖ్యం. ఇమ్మ్యూనిటీ బూస్టర్స్ అయిన తులసి, అల్లం, పసుపు, మిరియాలు వంటి వాటితో కషాయాలు ఇవ్వవచ్చు. సీజనల్ వ్యాధుల గురించి ముందే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయడం మంచిది . టీకాలు కావాలా అన్నది డాక్టర్లే చెబుతారు. పొడి దగ్గు, జలుబుతో పాటుగా ముక్కులు పొడిబారడం, పొడి గాలి లేదా పొడి దగ్గుతో బాధపడితే, గోరువెచ్చని నూనెతో మర్దన చేయవచ్చు.
ఇంటి వాతావరణం..
గది తడి లేకుండా ఉంచాలి . వర్షాకాలంలో ఫంగస్, బాక్టీరియా పెరగకుండా చూడాలి. వెంటిలేషన్ బాగా ఉండేలా చూడాలి . గదిలో తడి లేదా చెత్త గాలి ఉండకూడదు. నిద్ర తగినంతగా ఉండేలా చూసుకోవాలి . మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. ఇది పిల్లలలో మానసిక స్థైర్యం పెంచుతుంది.
డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి..
జ్వరం మూడు రోజులకు మించితే డాక్టర్ ను కలవాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు డాక్టర్ ను కలవాలి.
విరేచనాలు, వాంతులు ఎక్కువయ్యితే నిర్లక్ష్యం చేయకూడదు. సొంత వైద్యం అస్సలు ప్రయత్నించకూడదు.
నీరసంగా ఉండటం, తినడం తగ్గిపోతే మందుల మీద ఆధారపడకూడదు. వైద్యుడిని కలవాలి.
ఇవి పాటించడం వల్ల మారుతున్న వాతావరణంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరు.
*రూపశ్రీ


.webp)
