ఇవి తింటే బరువు పెరగరు!

 

ఏవి తింటే బరువు పెరుగుతారు అంటే టకటకా చెప్పేస్తారు. కానీ ఏవి తింటే బరువు పెరగరు అంటే ఆలోచనలో పడతారు. అవి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇవి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మిగిలినవాటి సంగతేమో తెలీదు కానీ... ఓ ఆరు రకాల ఆహారాల వల్ల బరువు పెరగరన్నది మాత్రం కచ్చితం. అవేంటంటే...

* కోడిగుడ్లలో ఉండే ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందదట. అయితే ఉడికించిన కోడిగుడ్డు మాత్రమే తినాలి అంటున్నారు డాక్టర్స్. పైగా ఉడికించిన కోడిగుడ్డు తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించి, కడుపు నిండినట్లుగా అనిపిస్తుందట. దానివల్ల ఇక ఎక్కువ ఆహారం తీసుకోలేమట. అందుకే ఉడికించిన కోడిగుడ్డుకు ఓటేయమంటున్నారు.
* దానిమ్మ గింజలో ఉండే పీచు వల్ల కొన్ని తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుందట. అందుకే ఎక్కువ తిన్నా బరువు పెరుగుతామేమోనన్న భయం ఉండదు.
* ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొల్రెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే లేదు.
* చేపల్లో కొవ్వు అన్నదే ఉండదు. అందుకే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి మాంసాల జోలికి పోకుండా వీలైనంత ఎక్కువగా చేపలు తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగూ ఉంటుంది, బరువూ పెరగరు. కాకపోతే కూర వండుకుని తినాలి తప్ప ఫ్రై చేసుకోకూడదు.
* పచ్చని కాయగూరలు, ఆకుకూరల్లో నీళ్లు శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుందట. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు.
* వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనం ముందు వాటిని తాగితే కడుపు నిండినట్టు అనిపించి ఎక్కువ తినం. కాబట్టి వెజిటబుల్ సూప్స్ తాగడం మంచిదనేది విదేశీ యూనివర్శిటీ పరిశోధనలు తేల్చిన విషయం.

Sameera