మహిళా క్రికెట్లో స్టార్... హర్మన్‌ప్రీత్ కౌర్

 

 

క్రికెట్‌ని కూడా ఒక మతంగా భావించే మన దేశంలో... ఆడవారి క్రికెట్‌ని పట్టించుకునేవారే కనిపించరు. తమ అభిమాన క్రికెటర్ల రికార్డులన్నీ పొల్లుపోకుండా చెప్పే జనం, మిథాలీ రాజ్ అన్న పేరు తప్ప మరో మహిళా క్రికెటర్ గురించే విని ఉండరు. అలాంటిది దేశం యావత్తూ తలతిప్పి తనవంక చూసేలా చేశారు ‘హర్మన్‌ప్రీత్ కౌర్’. ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలో విజయపు అంచులదాకా తీసుకువెళ్లారు. హర్మన్కౌర్ గురించి మరిన్ని విశేషాలు...

1989లో పంజాబులోని మోగా అనే చిన్న పట్నంలో జన్మించారు హర్మన్. ఆమె తండ్రి బాస్కెట్‌బాల్‌లో గొప్ప క్రీడాకారుడు. దాంతో సహజంగానే హర్మన్‌కు ఆటలంటే ఇష్టం ఏర్పడింది. వీధుల్లో క్రికెట్ ఆడుతూ చెలరేగిపోయేది. అలా ఓసారి కమల్దీష్ సింగ్ అనే కోచ్ కంట్లో పడింది. హర్మన్లోని ప్రతిభను గమనించిని కమల్దీష్, ఆమె క్రికెట్ నేర్చుకునేందుకు కావల్సిన సదుపాయాలన్నీ కల్పించాడు.
తనకి దక్కిన అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకున్నారు హర్మన్. అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో జాతీయ జట్టుకి ఎంపికయ్యారు. అక్కడి నుంచి ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. వన్డే అయినా, టెస్ట్ అయినా T20 అయినా బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ తన ప్రతిభ కనబరిచారు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు తీసుకున్నా, 2016లో 31 బంతులలో 46 పరుగులు చేసి ఆస్ట్రేలియా మీద T20 సిరీస్ గెల్చుకున్నా... మన మహిళా క్రికెట్ సాధించిన అనేక విజయాల వెనుక హర్మీన్ అండ ఉంది. అందుకే 2012లో ఆమెను T20 జట్టుకు కేప్టెన్‌గా నియమించారు. మన దేశం నుంచి విదేశీ క్రికెట్ క్లబ్బుకు ఎంపికైన తొలి వ్యక్తిగా కూడా హర్మన్ రికార్డు సృష్టించారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే మొన్నటికి మొన్న జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో హర్మన్ సాధించిన స్కోర్ ఓ అద్భుతం. ఆ రోజు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ్‌కప్ నెగ్గిన ఆస్ట్రేలియాకు భారత్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదని అనుకున్నారు. దానికి తోడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. ఆ సమయంలో వచ్చిన హర్మన్ కౌర్ స్టేడియం నలుమూలలకీ తన బ్యాట్‌ను ఝుళిపించారు. తన అభిమాన క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్‌నే మైమరపించేలా, 115 బంతులలో 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు. ఆ రోజు మన దేశం గెలిచిందని వేరే చెప్పాలా!

ప్రపంచ కప్ ఫైనల్స్‌లో కూడా హర్మన్ 51 పరుగులతో చెలరేగారు. కానీ దురదృష్టం! కేవలం 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవలసి వచ్చింది. ఏది ఏమైనా ఈసారి ప్రపంచకప్‌లో హర్మన్ ప్రదర్శన పుణ్యమా అని దేశం అంతా మహిళల క్రికెట్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. తప్పదు కదా! ఆడవారే కదా అని సమాజం వీలైనంతవరకూ పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఏదో ఒక రోజు, తల తిప్పి నోళ్లు వెళ్లబెట్టి పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

- నిర్జర.