"మిల్లర్ వ్యూహమేమిటి?" ఎల్ అడిగాడు సాలోచనగా విక్రోలి మాస్టర్ ఎస్టేట్ లో మూలగా ఉన్న క్వార్టర్స్ లో- ఒకదానిలో సమావేశమైన సెక్యూరిటీ కమెండోస్ రాత్రి పదిగంటల వేళ నిద్రపట్టక ఓచోట కూర్చుని కబుర్లలో పడ్డారు.
    
    "అదే అర్ధమవటం లేదు. మామూలుగానే వయా అంధేరి- జుహు ఇస్కాన్ కి, వెళ్ళిపొమ్మని సూచనలిచ్చాడు. అది బాగా పాపులర్ రూట్ విక్రోలి నుంచి ఎవరు ఇస్కాన్ కి వెళ్ళాలన్నా ఆ రూట్ నే ఎన్నుకుంటారు. దాన్నే మిల్లర్ కూడా ఎన్నుకున్నాడు. నలుగురు ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏ క్షణాన్నైనా, ఏదో విధంగా మాస్టర్ ని అసాసినేట్ చేసేందుకు వేటకుక్కలా కాపు కాసారని మనకి ఇన్ ఫర్మేషన్ వచ్చింది. మరిలాంటి పరిస్థితుల్లో...." 'ఆర్' మిల్లర్ స్టేజీ అర్ధంకాక కన్ ఫ్యూజ్ అవుతూ అన్నాడు.
    
    ఒకింతసేపు ఆ నలుగురి మధ్య నిశ్శబ్దం అలుముకుంది.
    
    మాస్టర్ ని కాపాడేందుకు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా భావించే విశ్వాసపాత్రులు ఆ నలుగురు.
    
    వాళ్ళెంత నిజాయితీ పరులంటే-ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఆఫర్ చేసి మీ మాస్టర్ ని అసాసినేట్ చేసేందుకు సహకరించమని ఒకసారి ఓ ఆగంతకుడు ఫోన్ చేస్తే, రేట్ ఇంకొంచెం పెంచితే అలాగే సహకరిస్తామని ఆ ఆగంతకుడ్ని ఆహ్వానించి, అతను ఎదురుపడగానే అర నిమిషంలో అతడ్ని నిర్దాక్షిణ్యంగా అంగవైకల్యానికి గురి చేశారు.
    
    ప్రతిక్షణం వారి దృష్టి తమ మాస్టర్ ని ఎలా కాపాడుకోవాలన్న దానిమీదే కేంద్రీకరించబడి ఉంటుంది.
    
    ఎస్టేట్ అంతా నిశ్శబ్దంలో మునగ దీసుకొని ఉంది. అప్పుడప్పుడు మాస్టర్ కమెండోస్ పాస్ చేస్తున్న సెక్యూరిటీ సిగ్నల్స్ వినిపిస్తున్నాయి ఆ నిశీధిలో.
    
    మాస్టర్ బంగ్లాకి నాలుగువేపులా బురుజులపై అరేంజ్ చేసున్న ఫ్లడ్ లైట్స్ ఆఫ్ సర్కిల్ లో నెమ్మదిగా తిరుగుతున్నాయి.
    
    డాబర్ మేన్, అల్సేషియన్, జర్మనీ షెప్పర్డ్ లాంటి అతి భయంకరమైన జాగిలాలు యధేచ్చగా బంగ్లా చుట్టూ తిరుగుతున్నాయి. శత్రువాసనను పసిగట్టేందుకు అప్రమత్తంగా పహారా కాస్తున్నాయి.
    
    అమావాస్య దగ్గరపడటంతో పరిసరాలన్నీ నిశీ నిశ్శబ్దంలో మరుగున పడున్నాయి.
    
    మెయిన్ గేట్ ప్రక్కనే లోపల వేపున్న కంప్యూటర్ ఛాంబర్ లో, ఓ కంప్యూటర్ ముందున్న ఇంజనీర్ తెరవేపే చూస్తున్నాడు అప్రమత్తంగా.
    
    తెరమీద ప్రతి పదిక్షణాలకి సేఫ్.... సేఫ్ అన్న ఇంగ్లీషు అక్షరాలు లెఫ్ట్ నుంచి రైట్ కి కదిలిపోతున్నాయి.
    
    ఎప్పుడో రాత్రి పదికల్లా షాంపైన్ మూడు పెగ్గులు తీసుకొని నిద్రలోకి జారుకునే మాస్టర్ రూమ్ లోని లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది.
    
    అధాటున ఎవరన్నా ఆ బంగ్లా కాంపౌండ్ లోకి తొంగిచూస్తే (అది అసాధ్యం) ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఆ బంగ్లాలో విడిది చేసాడేమో అని భ్రమ పడటం ఖాయం.
    
    ఆ బంగ్లాని రక్షించే కమెండోస్ కి కునికిపాతుకి అర్ధం తెలీదు నిట్టనిలువునా ప్రాణాల్ని తోడేయగల నరహంతకులయినా ఆ వేపుకి వచ్చేందుకి ఒకింత జంకుతారు.
    
    "ఆఖరి నిమిషంలో, ఆఖరి క్షణంలో మిల్లర్ వ్యూహంలో మార్పు చేసే అవకాశం వుంది. ఇంతకు ముందలా ఎన్నిసార్లు జరగలేదు?" 'ఎఫ్' తెరచి వున్న ద్వారం నుంచి మాస్టర్ కమెండోస్ పెట్రోలింగ్ ని చూస్తూ అన్నాడు.
    
    "ఒక్కోసారి మనల్ని కూడా నమ్మనట్లుగా కనిపిస్తాడు మిల్లర్. అలా మన విశ్వాసాన్ని, నీతి నిజాయితీల్ని పరీక్షించటం నాకు బాధనిపిస్తుంది అప్పుడప్పుడు...." 'బి' చిన్నగా అన్నాడు. అందుకు 'ఎల్' నవ్వాడు.
    
    "అందుకు మనం సంతోషించాలి. ఎందుకంటే మిల్లర్ మాస్టర్ రక్షణ కోసం ఎంత శ్రద్ద తీసుకుంటున్నాడన్నది- మనకి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. ఎవరి ధ్యేయమైనా ఒక్కటే- మాస్టర్ రక్షణ అదెవరు చేసినా మనం హర్షించాలి. అభినందించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని సీరియస్ గా తీసుకొని మన ఏకాగ్రతను పాడు చేసుకోవటం మంచిది కాదు." 'ఎల్' నవ్వుతూ అన్నా అతని మాటల వెనుక మందలింపు కనిపించింది.
    
    'బి' సిగ్గుతో తలవంచుకున్నాడు.
    
    నలుగురు ఒక్కసారే అనుకున్నట్లుగా లేచి బయటకు వచ్చారు.
    
    అప్పుడప్పుడు రాత్రిళ్ళు బంగ్లా చుట్టూ ఒక రౌండ్ వేయటం వాళ్ళకు అలవాటే. అది డ్యూటీలో భాగం కాకపోయినా మాస్టర్ రక్షణ వాళ్ళకో అబ్సెషన్ అయిపోయింది.
    
    మద్రాసుకి రెండువేల మైళ్ళ దూరంలో ఉన్న థాయ్ లాండ్ లోని అతి చిన్న సముద్రపు ఒడ్డు విలేజ్ లో ఉన్న బీచ్ రిసార్ట్ లో ఇద్దరు వ్యక్తులు పోర్టబుల్ సాఫ్ట్ వేర్ కంప్యూటర్ ఎదురుగా కూర్చుని ఎకౌంట్లతో కుస్తీ పడుతున్నారు.
    
    ఇద్దరూ అన్నదమ్ములు.
    
    ఛిండూ హాన్...
    
    లిండా హాన్...
    
    ఛిండూ హాన్ కి యాభై యేండ్ల వయస్సుంటే లిండాహాన్ కి నలభై ఎనిమిదేండ్లు కాని, నలభై తొమ్మిది కాని లేవు. అతనికీ యాభై యేండ్ల వయస్సుంది. ఇద్దరి మధ్య వయస్సులో తేడా కేవలం నిమిషాలు మాత్రమే.
    
    ఐడెంటికల్ ట్విన్స్...
    
    ఒకే రూపు, రంగు, పోలికలున్న కవలలు.
    
    వాళ్ళిద్దరూ రెండు దశాబ్దాలుగా స్టెన్ ల్లీ రామన్ హో పార్టనర్స్. ఆయన అసాసినేట్ అయ్యాక ఆ ఇద్దరూ మాస్టర్ కి పార్టనర్స్ అయ్యారు.
    
    స్టేన్ లీ రామన్ హో కొన్ని దశాబ్దాల క్రితం చైనీస్ ప్రాచీన సాంప్రదాయపు ఆటలైన కొన్నిటిని తన వ్యాపారానికి ఆధారం చేసుకొని గేంబ్లింగ్ బిజినెస్ ని కేసినోస్ రూపంలో ఆరంభించినప్పుడు రౌడీలు, గూండాలు, డ్రగ్ పెడ్లర్స్, రూత్ లెస్ యూత్ గేంబ్లింగ్ ఆడేందుకు రామన్ హో కేసినోస్ కి వచ్చి, డబ్బు పోగొట్టుకొని, ఆ ఉక్రోషంలో అల్లర్లు సృష్టించేవారు.