అతడిని నిద్రలోకి నెట్టి ఆ రాత్రే పద్మనాభాన్ని కలవాలని ప్రయత్నిస్తూందామె. "ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?"
    
    "రాష్ట్ర సమస్యల్ని కాదు."
    
    "మరి?"
    
    "మా అమ్మాయి విషయాన్ని."
    
    "ప్రబంధకేమైంది?"
    
    "ఏదో జరిగిందని కాదు సౌదామినీ! నేను ఆలోచిస్తున్నది జరగాల్సిన దానిగురించి. మరోగంటలో 'రాయ్' నా దగ్గరకు వస్తున్నాడు."
    
    ఆశ్చర్యంగా చూసింది. పార్ధసారథిరావు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉత్తర భారతదేశంలో సెటిల్ కావడమేగాక కేంద్రప్రభుత్వంలో కూడా చాలా పలుకుబడి గలవాడు.
    
    అహ్మదాబాద్, బాంబేల్లో చాలా బట్టల మిల్లులుగల కె.పార్ధసారథి రావు ఆ తరువాత రావుని 'రాయ్'గా మార్చుకుని కె.పి. రాయ్ గా బాంబేలో స్థిరపడి పోయాడు. అతడు తెలుగువాడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.
    
    ప్రతి ఏడాదీ అధికార పార్టీకి వందల కోట్ల రూపాయల్ని పార్టీ ఫండ్ గా ఇస్తూ కేంద్ర రాజకీయాల్లో సైతం పటిష్టమయిన స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేశ ప్రధానిని సైతం అపాయింట్ మెంట్ అవసరం లేకుండా కలుసుకుని మాట్లాడగలిగే ప్రశసతి కలవాడంటారంతా.
    
    రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకే పార్టీ కావడంతో అతడిద్వారా కేంద్రానికి ఎదగటం ఒకటేకాదు వాసుదేవరావు కోరుకుంటున్నది.
    
    ఇండియన్ ఫారెన్ సర్వీసు పూర్తిచేసిన రాయ్ ఒక్కగానొక్క కొడుకుని అల్లుడ్ని చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు కూడా.
    
    "రాయ్ ఏదన్నా వ్యాపారరీత్యా హైద్రాబాద్ వస్తున్నారా?" అడిగింది సౌదామిని.
    
    పద్మనాభానికి మరింత చేరువకావాలీ అంటే ఇలాంటి ఇన్ ఫర్మేషన్ తెలుసుకోవడం తప్పనిసరి.
    
    "వస్తున్నది అందుకేగా సౌదీ!" చాలా ఉత్సాహంగా వుండేటప్పుడు సౌదామినిని 'సౌదీ' అని పిలుస్తూంటాడు వాసుదేవరావు. "రాయ్ హైద్రాబాద్ లో పెద్ద మందులకంపెనీ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. దానికి నా సహాయాన్ని కోరుతున్నాడు."
    
    "అదేం భాగ్యం! మీకు కావాల్సిన మనిషేగా? ఆ మాత్రం సాయం చేయలేరా?" ఆసక్తిని ప్రకటించింది.
    
    "ఇప్పటికే రెండువందల ఎకరాల భూమిని చవగ్గా అతడికి అమ్మే ఏర్పాట్లు చేశాను. రాష్ట్ర ప్రభుత్వం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కే కాక ఇతర రాష్ట్రాలకి చెందిన పారిశ్రామికవేత్తలకీ పరిశ్రమల స్థాపనలో సాయపడుతుందన్న థియరీని బట్టి అవసరానికి మించి సాయం చేస్తున్నాను. కాకపోతే ఓ విషయం..."
    
    "మీ అమ్మాయి ప్రబంధ గురించేగా?"
    
    "అవును! అమెరికాలోని భారత రాయబారి కార్యాలయంలో పని చేస్తున్న రాయ్ కొడుకు నాకు అల్లుడు కావటం నాకు గర్వకారణం. ఆ విషయం చూచాయగా ఓసారి ప్రస్తావించాను కూడా కానీ ఏదీ యింకా తేల్చడం లేదు"
    
    నవ్వేసింది. "మీకేకాదు ఓ ముఖ్యమంత్రి కూతురు కోడలు కావడము ఆయనకీ గర్వకారణమేగా?"
    
    "అలా అని అనుకునే స్థితిలో లేడాయన."
    
    "డబ్బు రీత్యా అంతేగా?"
    
    "నీకు తెలీదు సౌదీ! రాయ్ తలుచుకుంటే ప్రధానమంత్రితో నాకూ ఉద్వాసన చెప్పించగలడు."
    
    "మీ స్థానం అంత బలహీనంగా వుందని నేను భావించను."
    
    "అహఁ... మాట వరుసకి అంటున్నానంతే."
    
    "మరి వియ్యంకుడయితే ఆ సమస్యే వుండదుగా?"
    
    "ఇప్పుడు వియ్యంకుడు కావడమే సమస్యగా."
    
    "వాసుదేవరావు తలని సుతారంగా గుండెకు హత్తుకుంది..."ఆ సమస్యా మీరు పరిష్కరించగలరు."
    
    సాలోచనగా అన్నాడు వాసుదేవరావు-"నేను అనుకున్నది ఇంతవరకూ సాధించకుండా వదిలిపెట్టని మాట నిజమే అయినా, వ్యక్తిగత సమస్య కావడంతో కాస్త సంఘర్షణ తప్పనిసరి అవుతుంది."
    
    "మీరు నిబంధనలకి అతీతంగా వెళ్ళి యింత సాయం చేస్తుండగా రాయ్ మీ మాట కాదంటాడని ఎందుకనుకుంటున్నారు?"
    
    "ఇప్పుడు సమస్య రాయ్ అంగీకరించటం ఒక్కటే కాదు సౌదీ!"
    
    విస్మయంగా చూసింది-మరి?"
    
    "ప్రబంధ కూడా..."
    
    "అర్ధం కావడంలేదు."
    
    "ఆదినుంచీ ప్రబంధ చాలా మొండిగా పెరిగింది."
    
    "అయితే?"
    
    "ఏదన్నా తనే నిర్ణయించుకోవాలి తప్ప మరొకరి నిర్ణయాన్ని తాను అంగీకరించదు."
    
    "పెళ్ళి విషయంలో అలా మొండితనం ప్రదర్శించదనుకుంటున్నాను."
    
    "అది నా కూతురు."
    
    "కాబట్టే మీ ఇష్టాన్ని కాదనదు."
    
    "నమ్మకం లేదు."
    
    "ఎందుకలా అనిపించింది?"
    
    "నిర్ణయం ఒక్కటే కాదు సౌదీ! ముఖ్యంగా ఈ దేశం వదిలి, అంటే నాకు దూరంగా మరే దేశంలోనో వుండటం యిష్టపడదు."
    
    ఒక సమస్యకి మరో సమస్యని ముడివేసుకుంటూ వాసుదేవరావు ఆందోళనను ప్రకటిస్తుంటే వినోదంగా వుంది సౌదామినికి.
    
    పదవి కోసం చాలాచోట్ల తన అందాన్ని మెట్లుగా వుపయోగించి ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తి ఇక్కడ తనవరకూ వచ్చేసరికి సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నాడు.
    
    ఏదో ఒరగబెడతాడని ఏడేళ్ళక్రితం వాసుదేవరావుతో బంధాన్ని ఏర్పరచుకున్న సౌదామిని అతడికి వుపయోగపడిందే తప్ప అతడిని తన కనుకూలంగా మార్చుకోలేకపోయింది.