ఆ వ్యక్తి ఆందోళనగా చుట్టుప్రక్కలకు చూసి- "త్వరగా లోపలకు రండి. కారు మీదే అనుకుంటా. దాన్ని తీసుకెళ్ళి వేరేచోట పార్క్ చేయమని మీ మనిషికి చెప్పండి" అన్నాడు తను అడ్డు తొలుగుతూ.
    
    అప్పటికే ఆ వ్యక్తి మాటలు విన్న ఖలీల్ కారుని స్టార్టు చేసి ముందుకు తీసుకెళ్ళిపోయాడు.
    
    జోహ్రా లోపలకు రాగానే ఆ వ్యక్తి తలుపుల్ని మూసి లోపల నుంచి గడియపెట్టి జోహ్రాకి కుర్చీ చూపించాడు.
    
    "చెప్పండి. మీకేం కావాలి?" అన్నాడా వ్యక్తి.
    
    ఆ వ్యక్తికి అరవై ఐదేండ్లుంటాయి. సన్నగా స్కెల్ టెన్ లా ఉన్నాడు. కళ్ళు లోతుకుపోయి బలహీనంగా ఉన్నాడు.
    
    "ఫోన్ లో చెప్పినట్లుగా నాకో రైఫిల్ కావాలి."
    
    అన్నాడు జోహ్రా ఆ గదిని పరిశీలనగా చూస్తూ.
    
    "నా దగ్గర కొన్ని గన్స్ రెడీగా వున్నాయి. వాటిని పరిశీలించి మీక్కావలసినదాన్ని సెలెక్టు చేసుకుంటారా?" ఆ వ్యక్తి జోహ్రా చేతిలో వున్న బ్రీఫ్ కేసి ఆశగా చూస్తూ అన్నాడు.
    
    జోహ్రా లేచాడు.
    
    ఆ వ్యక్తి జోహ్రాని తన వెనకే రమ్మని సైగచేస్తూ, ఆ గది మధ్యకు వెళ్ళి ఫ్లోర్ మీద పరచివున్న కార్పెట్ ని తొలగించాడు. అక్కడ కనిపించిన చెక్కను ఓ ప్రత్యేక పద్దతిలో లేపాడు.
    
    అప్పుడు కనిపించాయి క్రిందకు దారితీసే చెక్కమెట్లు.
    
    ఇద్దరూ ఆ చెక్కమెట్ల ద్వారా సెల్లార్ లోకి ప్రవేశించారు.
    
    పైన ఎంత గదివుందో దానికి డబుల్ సైజులో ఉందా గది.
    
    ఆ గది గోడలకు మేకులు కొట్టి ఆ మేకులకు రకరకాల గన్స్, రైఫిల్స్, పిస్టల్ హేంగ్ చేసున్నాయి.
    
    గదిమధ్యలో లేత్ మిషన్ ఒకటుంది. దానికి కొద్దిదూరంలో చెక్కల్ని కట్ చేసి మెరుగుపెట్టే మినీసామిల్ ఒకటుంది. ఫైర్ ఆర్మ్ తయారుచేసే వర్కుషాప్ అది.
    
    జోహ్రా గోడదగ్గరకు వెళ్ళి చకచకా తనకు కావలసిన గన్ కోసం వెతుకుతున్నాడు. ఫలితం లేకపోవటంతో ఆ వ్యక్తికేసి చూసి పెదవి విరిచాడు.
    
    "ఇవేమీ నీకు నచ్చలేదా మిస్టర్ జె" ఆ వ్యక్తి నెమ్మదిగా అడిగాడు.
    
    "లేదు నాకు నచ్చటం నచ్చకపోవటం ముఖ్యం కాదు మిస్టర్ త్యాగరాజన్.... అత్యంత పటిష్టమయిన భద్రతా ఏర్లాట్లమధ్య ఉండే బిలియనీర్ ని, మోస్ట్ పవర్ ఫుల్ పర్సనాలిటీని అసాసినేట్ చేయవల్సి వుంది. అందుకు ఈ రడీమేడ్ ఆయుధాలు నాకు సహకరించవు..."
    
    "మరెలా?"
    
    "నా అవసరాల్ని, పరిధుల్ని గుర్తెరిగి మీరే నాకోసం ప్రత్యేకంగా ఓ గన్ ని తయారుచేయాలి."
    
    "ప్రత్యేకంగానా? బట్...." త్యాగరాజన్ గొణిగాడు. వెంటనే జోహ్రా బ్రీఫ్ ని ఓపెన్ చేసి యాభైవేళా రూపాయల కేష్ ని వారి ముందున్న లేత్ మిషన్ మీద పెట్టాడు.
        
    కరెన్సీని చూసి త్యాగరాజన్ కళ్ళు మెరిశాయి. వాటిని అతఃరంగా అందుకుంటూ "మీకెలాంటి గన్ కావాలో చెప్పండి" అన్నాడు.
    
    "గన్ లా పనిచేయాలి బట్ గన్ లా ఉండకూడదు."
    
    "అర్ధం కాలేదు. కాస్త వివరంగా చెబుతారా?"
    
    జోహ్రా చెప్పటం ప్రారంభించాడు.
    
    షుట్ కోపర్ వెస్టు నుంచి సైన్ కి వెళ్ళే రహదారిలో ఉన్న విజయాక్లాత్ స్టోర్సు  ప్రక్కన కారుని పార్కుచేసి నిమిషాలు లెక్కపెడుతూ జోహ్రా కోసం ఎదురుచూడసాగాడు ఖలీల్.
    
    క్షణంలో నిమిషాలు గడిచిపోతున్నాయి.
    
    అయినా జోహ్రా జాడలేదు. సరిగ్గా అదే సమయంలో కొలాబా పార్సీ బంగ్లాలో ఉన్న మిల్లర్ జోహ్రా గురించి, జోహ్రా వేయబోయే ఎత్తుల గురించి ఆలోచిస్తున్నాడు.
    
    మృత్యుఘడియల కౌంట్ డౌన్ ప్రారంభమయింది ఆ మృత్యువు ఎవర్ని ఎక్కడ ఎలా కబళిస్తుందో ఎవరికీ అర్ధంకానంత అనూహ్య స్థితిలో ఉంది.
    
                                                 *    *    *    *    *
    
    స్థలం : జుహు పోలీస్ స్టేషన్.
    
    సమయం : రాత్రి 9.30 గంటలు.
    
    బొంబాయి నగర పోలీసు కమీషనరు కారు పోలీస్ స్టేషన్ ముందు ఆగి ఉంది.
    
    లోపల....
    
    ఆ స్టేషన్ సర్కిల్ రూమ్ లో పోలీసు కమీషనర్ సిద్దేశ్వర్ ఓబరాయ్ నెమ్మదిగా పచార్లు చేస్తున్నాడు. ఎదురుగా ఆ స్టేషన్ సర్కిల్, ఎస్.ఐ. మరి నలుగురు కానిస్టేబుల్స్ వినయంగా నించుని ఉన్నారు.
    
    ఆ గదిలో ఓ మూలగా దేవానంద్ ఇంటి వాచ్ మెన్ భయం భయంగా దిక్కులు చూస్తూ చేతులు కట్టుకొని నించుని ఉన్నాడు.
    
    ఆ గది నాలుగు గోడల మధ్య పేరుకున్న నిశ్శబ్ధాన్ని చీలుస్తూ "ఇంటరాగేషన్ ప్రారంభించండి" అన్నాడు కమీషనర్ సిద్దేశ్వర్ ఓబరాయ్.
    
    సర్కిల్ సైగతో ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ వాచ్ మెన్ ని గది మధ్యకు తీసుకొచ్చారు.
    
    అతను బాగా భయపడటాన్ని, ఆ సందర్భంలో నర్వెస్ గా ఫీలవటాన్ని కమీషనర్ గుర్తించాడు.
    
    "చూడు.... నీకొచ్చిన భయమేమి లేదు. నిన్నేమి చేయం మేం అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చి, అన్నీ నిజాలే చెప్పి మాకు సహకరిస్తే నీమీద కేసు పుటప్ చేయం లేదంటే ఇబ్బందుల పాలవుతావ్" అని వాచ్ మెన్ తో అనునయంగా చెప్పి సర్కిల్ వేపు తిరిగి సంజ్ఞ చేశాడు కమీషనర్.
    
    "నీ పేరేమిటి?" సర్కిల్ సాఫ్టుగానే అడిగాడు.
    
    అతనింకా భయపడుతూనే వున్నాడు.
    
    "నీకు హామీ ఇచ్చాను. నీకేం జరగదు. నిన్నేం చేయం మాకు ఇన్ ఫర్మేషన్ ఇచ్చి నువ్వు నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు. నిన్ను మేం కేచ్ చేసినట్లుగాని, పోలీస్ స్టేషన్ కి రప్పించినట్లుగాని, నిన్ను ఇంటరాగేట్ చేసినట్లుగాని ఎవరికీ తెలియనివ్వం. నువ్వు కూడా ఏమీ తెలీనట్లుగానే ఉండాలి. ఇవేమీ పోలీసు రికార్డులోకి ఎక్కవు. అంతా రహస్యంగానే జరిగిపోవాలి- జరిగిపోతుంది. కమాన్ చెప్పు" కమీషనర్ మరోసారి వాచ్ మెన్ కి ధైర్యం చెప్పాడు.