"తల కొరివి పెట్టేవాడికి వాటా!" అని వాదిస్తే "నేను నీళ్ళకుండని భుజానికెత్తు కుంటాను- కొరివి చేతబట్టి స్మశానానికి నడుస్తాను. కాలే కట్టెకు, మండే నిప్పుకి, మరుభూమికి లింగభేదం తెలీదుగదమ్మా... ఆడవారి స్మశానం మగ స్మశానం అని విడగొట్టలేదు గదమ్మా... నేనూ ఆ కర్మకాండను చేస్తాను- నాకు సమాన స్థాయిని కల్పిస్తావా అమ్మా?" అని అడిగితే తల్లి తన తలఎక్కడ దాచుకోవాలి? దాచుకోకపోతే ధర్మశాస్త్రాల్ని ప్రబోధిస్తుందా? ఎవరు రాసిన ధర్మశాస్త్రాల్ని? పురుషులు వ్రాసిన వాటినేగదా? "స్త్రీ ప్రమయం లేకుండా రాసిన ఆ శాస్త్రాల్ని స్త్రీలమయిన మనం గౌరవించాలా అమ్మా" అంటే ఏది దారి?

 

    "ముసలి వయస్సులో కొడుకేగదా పోషించేది" అని తల్లంటే "పోషించడానికి కావలసింది ప్రేమ, ఆప్యాయత, అభిమానం - అవి పురుష లింగాలా? ఈ ప్రపంచంలో వున్న కొడుకులందరూ ముసలివాళ్ళయినా తమ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నారని గ్యారంటీ ఇవ్వగలవమ్మా?" అంటే? "అల్లుడు మమ్మల్ని ఆదరించకపోవచ్చు" అని తల్లంటే... "కోడళ్ళు ఆదరిస్తారని గట్టిగా చెప్పగలవామ్మా?" అంటే... లేదు - సమాధానం లేదు.

 

    మరప్పుడా ఆడపిల్ల ఎవర్ని అడగాలి? కని పారేసి, రెండవ శ్రేణికి దిగజార్చిన తన తల్లిదండ్రులే తనకు సమాధానం ఇవ్వనప్పుడు ఇంకెవరు జవాబు ఇవ్వగలరు?

 

    ఇవ్వరు - తమ్ముళ్ళ అహంకారానికి, అన్నల నిర్లక్ష్యానికి ఆడపిల్ల బలి కావాల్సిందే!

 

    లేదా తల ఒగ్గి బ్రతకవలసిందే-

 

    రాజీపడి జీవించవలసిందే-

 

    ఆధారం లేకపోతే అంధకారంలోకి జారవలసిందే-

 

    అందుకే మధుమతి ఈ సమాజాన్ని నిలదీస్తుంది- ఈ సభ్య ప్రపంచాన్ని ప్రశ్నిస్తుంది- పురుష ప్రపంచాన్ని దుమ్మెత్తిపోస్తుంది.

 

    అప్పుడు పచ్చిగా అడుగుతుంది-

 

    "మగాడేం ఊడబొడిచాడు? ఆడదేం పొడవలేదు?"  

 

    అని. సిగ్గూ ఎగ్గూ లేని ఈ ప్రపంచం, తన రక్తాన్ని తనే గౌరవించుకోలేని తల్లిదండ్రులే స్త్రీ దౌర్భాగ్యపు స్థితికి కారణమని శపిస్తుంది- అప్పుడంటుంది. "నా వృత్తిని విమర్శించే హక్కు ఈ సమాజానికి లేద"ని! "నన్ను శిక్షించే హక్కు ఈ చట్టాలకు, ఈ న్యాయస్థానాలకు లే"దని!!

 

    "పెట్టేవాడికే కొట్టే హక్కు వుందని మనం అంగీకరిస్తే, మనస్సు పెట్టని తల్లిదండ్రులకు, సమాన స్థాయి కల్పించని తల్లిదండ్రులకు, దారి చూపించలేని న్యాయస్థానాలకు నన్ను దండించే హక్కు ఎవరిచ్చారని" గర్జిస్తుంది.

 

    ఆమె గర్జనకు ప్రతిగర్జన చేసే నైతిక స్థాయి నేటి తల్లిదండ్రులకుందా? నేటి చట్టాలకుందా? నేటి న్యాయస్థానాలకుందా?

 

    తన వృత్తి తప్పని తనను అరెస్ట్ చేసేందుకు వచ్చే పోలీసుని "ఈ ఉద్యోగం లేదంటే నువ్వు ఎలా మారేవాడివి..." అని ఆమె ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, సమస్యను విడగొట్టలేక అధికారాన్ని ప్రదర్శిస్తాడు ఆ పోలీసు.

 

    ఇది తప్పయితే... ఒప్పయిన దారి చూపించు- ఇది మానేస్తాను, అంటే పోలీసు, చట్టం, న్యాయశాస్త్రం దారి చూపిస్తాయా?

 

    "నా వాటా నాకిస్తే ఇక నేను కట్నమెందుకివ్వాలి? కట్నాలు పోవాలని అరిచే ప్రభుత్వాలకు ఈ లాజిక్ బోధపడలేదా? ఈ సూక్ష్మ సూత్రం తట్టలేదా?" అంటూ మధుమతి తన తల్లిదండ్రుల్ని, ప్రభుత్వాల్ని ప్రశ్నించి విసిగి వేసారిపోయింది.

 

    "ఆస్తీ ఇవ్వు, అప్పులూ ఇవ్వు, బాధ్యతల్నీ పంచు, ప్రేమాభిమానాల్నీ అందించు" అని తన తండ్రి నడిగినందుకు ఆమె దెబ్బలు తిన్నది.

 

    "నువ్వూ ఆడదానివే- నేను ఆడదాన్నే- నీకు జరిగిపోయిన అన్యాయానికి నన్నెందుకు వారసురాలిని చేస్తావని, తల్లి నడిగితే- వెంటనే "పదివేలు పారేసి నిన్ను ఒకడి చేతిలో పెడితే మా గుండెల మీద బరువు తగ్గుతుందని, నీది పిదప కాలం- పిదప బుద్ధులని" కన్నబిడ్డ అని కూడా చూడకుండా శపించింది ఆమె మాతృమూర్తి.

 

    అందుకే... ఆరోజే ఆ తల్లిదండ్రుల్ని వదిలేసింది.

 

    అది విపరీతమన్నారు.

 

    తన దగ్గరున్నది అమ్ముకుని బతుకుతుంటే అది తప్పన్నారు.

 

    అందుకే ఆమె తిరగబడింది.

 

    సమాజపు దృష్టిని తనవైపు తిప్పుకుంది. అలాంటి మధుమతి- ఆడ పులయిన ఆ మధుమతి తన శరీరంమీద ఆచ్చాదనగా ఓచిన్న టవలును చుట్టబెట్టుకుని బాత్ రూంలోంచి బయటికి వచ్చింది.

 

    మధుమతి ఓ అద్భుతమయిన స్త్రీమూర్తి అని నరసింహానికి తెలీదు. తన జీవితాన్ని విచిత్రమయిన మలుపు తిప్పగల అసాధారణ యువతి అని సామంత్ కీ తెలీదు.

 

    అతని నరాలు జివ్వున లాగుతున్నాయి. ఆమెలో కలిసిపోవాలనే కోరిక అతని రక్తాన్ని పిచ్చిగా పరుగులెత్తిస్తోంది.

 

    హిమాలయాల మృదుత్వం ఆమెను ఆవహించిందా? నయాగరా దుడుకుదనం ఆమె గుండెల్లోకి జొరబడిందా?

 

    ద్రాక్షాసారా తన రూపాన్ని మార్చుకుని ఆమె కనురెప్పల కింద దాగివుందా?

 

    మెరుపులు ఆకాశాన్ని వదిలి ఆమె పెదవుల్ని ఆశ్రయించాయా?

 

    అవునేమో అనిపించింది నరసింహానికి.

 

    ఆమె క్రమంగా అతనికి దగ్గరగా రాసాగింది.

 

    మృదువుగా, ఆరోగ్యంగా, దృఢంగా వున్న ఆమె శరీరం నుంచి యార్డ్ లీ సువాసన గాల్లో ప్రయాణిస్తూ అతన్ని తాకింది. ఒక్కసారి గాలి వదిలి దీర్ఘశ్వాస తీసుకుని ఆ పరిమళాన్ని ఆఘ్రాణించాడు నరసింహం.

 

    అతని కళ్ళు క్షణకాలం అరమోడ్పులయ్యాయి.

 

    ఆమె మరికొంచెం ముందుకు వచ్చింది. అతను తేరుకొని ఆమెకేసి లాలసతో చూస్తూ "అందానికి ఈ అడ్డేమిటి? ఉన్న పళాన రమ్మన్నాగా? అలాగే వస్తానన్నావుగా? మరి..." తడారిన గొంతుని లాలాజలంతో తడుపుకుంటూ అన్నాడు.

 

    ఆమె నవ్వింది.

 

    ముత్యాల్లాంటి ఆమె పలువరుస తళుక్కున మెరిసింది. "మీరు అనడం లేటయిపోయింది. ఈలోపు ఈ టర్కిష్ టవలు మీలాగే నా శరీరాన్ని అంటుకు పోవాలని ఆరాటపడింది.'నీ ఒంటి ముత్యాల్ని అద్దే భాగ్యాన్ని కలిగించవా అంటూ నన్ను ప్రశ్నించింది ఆశగా. ఏం చెయ్యను మరి?" ఆమె గోముగా అంది ఓరకంట ఎస్.ఐ. నరసింహాన్ని చూస్తూ.

 

    "ఆ టవల్ మీద నాకు అసూయగా వుంది" గుటకలు మింగుతూ అన్నాడు.

 

    "మిమ్మల్ని చూసి ఈ టవల్ అసూయపడే రోజు కూడా వస్తుందిలెండి!"