మిల్లర్ కమ్యూనికేషన్ ఛానల్ ని ఎక్కడికక్కడే నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తాడు. ఎవరికి ఏ పని అప్పగిస్తాడో ఎవరికీ తెలీదు. అప్పగించబడిన వ్యక్తి తన పనిని పూర్తిచేసి, ఆ అనుభవాన్ని, ఆపరేషన్ ని తనలోనే సమాధి చేసుకుంటాడు.
    
    మాస్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగే ప్రతిసారి మిల్లర్ పథకం ఒకేలా ఉండదు. ఎప్పుడెలా మారుతుందో, ఎలా మారుస్తాడో ఎవరికీ తెలీదు.
    
    పాతికవేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన మాస్టర్....గోల్డెన్ స్పూన్ తో పుట్టిన మాస్టర్ ఇస్కాన్ టెంపుల్ లో పూజలు ముగించుకొని, వెనుకవేపు నుంచి బయటపడి, పాతికవేలు రూపాయలు ఖరీదు కూడా చేయని ఒక డొక్కు ఫియట్ టాక్సీలో నిర్దేశించిన స్థలానికి బయలుదేరాడంటే విధి లీలని అనుకోవాలా? లేక మిల్లర్ మేధస్సులో ఊపిరిపోసుకున్న వ్యూహా ఫలితమనుకోవాలా?
    
    జోహ్రా పని ముగించుకొని ఖలీల్ తో తప్పించుకు పోతున్న జీప్ కి అభిముఖంగానే మాస్టర్ ఎక్కిన ఫియట్ టాక్సీ దూసుకుపోయింది!
    
    మాస్టర్ లాంటి అసాధారణ వ్యక్తి ఒక మామూలు బొంబాయి నగరపు టాక్సీలో రహస్యంగా జారుకోగలడని జోహ్రా ఊహకే అందని అద్భుతం.
    
    మాస్టర్ ని చూడాలని ఎంతగానో పరితపించే మృదుల- ఆ మాస్టర్ తన కారులోనే ఇస్కాన్ టెంపుల్ కి చేరుకుంటాడని ఊహించగలిగిందా...?
    
    తన తల్లి, తన మేనకోడలు ఎలా ఇస్కాన్ టెంపుల్ చేరుకున్నారు? సరిగ్గా తాను టెంపులులోకి ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తుండగానే, వెనుకవేపు నుంచి తన తల్లి, సోహ్ని వస్తూ తనకు ఎదురయ్యారు. పూజలు పూర్తయ్యాక తిరిగి ఆ యిద్దరూ బంగ్లాకి ఎలా చేరుకున్నారు? ఈ ప్రశ్నలకు మాస్టర్ వద్ద సమాధానాలు లేవు.
    
    తన కొడుకు గుడికి ఎలా వచ్చాడు....! తిరిగి బంగ్లాకి ఎలా చేరుకున్నాడు....! ఈ అనుమానాలకు యశోధర దగ్గర నివృత్తి లేదు.
    
    అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరు ఎక్కడ దిగిపోయారు? తిరిగి ఎలా ప్రయాణించారు? ఎలా సేఫ్ గా చేరుకోగలిగారనే పరిపూర్ణమైన పధకం గురించి తెలిసిన వారు ఒక్కరే....
    
    అది జాన్ మిల్లర్.... అందుకే మిల్లర్ మేధస్సుకి ప్రతి ఒక్కరు అబ్బురపడతారు. గగుర్పాటుకి లోనవుతారు. అపూర్వమైన అతని తెలివి తేటలకు అడ్మైర్ అవుతారు. ఆపైన భయపడతారు.
    
                                                     *    *    *    *    *

    "ఏమిటి నాన్న ఇదంతా? నాకు ఆందోళనగా ఉంది. నాకు మిగిలింది నువ్వు మనకు మిగిలింది పసిపిల్ల సోహ్ని. ఎన్నాళ్ళిలా కత్తుల వంతెన మీద నడుస్తాం..." యశోధర కొడుక్కి చికెన్ సూప్ అందిస్తూ అంది బాధగా.
    
    "వారసత్వమమ్మా... తప్పుతుందా మరి...?" మాస్టర్ సూప్ తీసుకుంటూ అన్నాడు.
    
    "తప్పించుకోవాలంటే తప్పదా?"
    
    తల్లి అంత సూటిగా అడిగేసరికి మాస్టర్ ఓ క్షణం కలవరపడ్డాడు.
    
    "ఏది ఏమైనా ఈరోజు కృష్ణభగవానుడికి యాభైలక్షలు ఇవ్వనిచ్చి నందుకు నీకు నా కృతజ్ఞతలు" భక్తి పారవశ్యంతో అంది యశోధర తడిచేరిన కళ్ళను అద్దుకుంటూ.
    
    మాస్టర్ చటుక్కున తలెత్తి తల్లికేసి చూసి- "నాకా ఔదార్యం లేదమ్మ నీకోర్కె మేరకు యాభైలక్షలు వదులుకున్నాను. ఇన్ అదర్ వే. అది కూడా నాకు లాభమే. ఇప్పుడు ఇస్కాన్ భక్తులంతా నా ప్రాణరక్షణకు అండగా నిలుస్తారు" అన్నాడు నేప్ కిన్ తో పెదాల్ని అద్దుకుంటూ.
    
    యశోధర కొడుక్కి మెటీరియలిజానికి ఒక క్షణం బాధపడింది.
    
    అంతలో టక్.... టక్... మన్న శబ్దం వినిపించి తల్లి కొడుకులిద్దరూ తలలు తిప్పి చూసారు.
    
    అక్కడ సోహ్ని నడవలేక... నడిచే అవకాశాన్ని ఊతం ద్వారా పొందుతూ వస్తోంది. కుంటుతూ, ప్రయాసపడుతూ, ఎంత డబ్బయినా, సంపదయినా, మరెంతటి వైద్య పరిజ్ఞానమైనా సమాధానం చెప్పలేని అంగవైకల్యాన్ని మోస్తూ, ఈడుస్తూ తమకేసి వస్తోంది.
    
    మాస్టర్ కి గొంతుకేదో అడ్డుపడ్డట్లనిపించింది.
    
    వెంటనే టేబుల్ ముందునుంచి లేచి తన మేనకోడలుకి ఎదురెళ్ళి వాత్సల్యంతో ఎత్తుకున్నాడు.
    
    "డామ్ ది మెడికల్ సైన్స్ డామ్ ది డాక్టర్స్ నా చిట్టితల్లి అంగవైకల్యాన్ని దూరం చేయలేని సైన్స్ డాక్టర్స్ బుల్ షిట్" ఉక్రోషంగా అంటూ ఆ పాపను తన గుండెలకు హత్తుకున్నాడు మాస్టర్.
    
    యశోధర కళ్ళు ఆ దృశ్యాన్ని చూసి వర్షించాయి.
    
                                                        *    *    *    *    *
    
    జోహ్రా తన కిరాయి హంతక వృత్తిలో తొలిసారి ఓడిపోయాడు. ఘోరంగా విఫలమయ్యాడు. అతనా అవమాన భారాన్ని మోస్తూ, మరో ప్రక్క చిత్తుగా తాగుతున్నాడు.
    
    ఖలీల్ తలవాల్చుకొని యోచిస్తున్నాడు.
    
    "ఏ మొఖం పెట్టుకుని కంట్రీక్లబ్ కి వెళ్ళాలి? వెపన్స్ అద్దెకిచ్చే వ్యక్తి అప్పుడే హెచ్చరించాడు మాస్టర్ చేపకాదు తిమింగలం ఆ తిమింగలం వెనుక వున్నది కాకలు తీరిన యోధుడు. కఠినాత్ముడు జాగ్రత్త అని" జోహ్రా కసిగా తాగుతూ అన్నాడు. జోహ్రా మానసిక స్థితిని సరిగ్గా అంచనా వేశాడు ఖలీల్.
    
    "ఇక్కడ నీగురి తప్పలేదు జోహ్రాభాయ్. టార్గెట్ తప్పుకుంది రిలాక్స్....రిలాక్సయి తిరిగి మరో తిరుగులేని పథకాన్ని ఆలోచించు" ఖలీల్ అనునయంగా అన్నాడు.
    
    "నో... నేను ఘోరంగా ఓడిపోయాను. ఆత్మవంచన వద్దు. మిల్లర్ కి మన పథకం ముందే తెలిసిపోయింది. ఇన్ ఫర్మేషన్ లీకయింది. ఆఖరికి నేను కాల్చింది డమ్మీని. మాస్టర్ రూపంలో వున్న ఫేక్ ఐడెంటిటీని నా పదిహేనేళ్ళ సర్వీసులో నేను మొదటిసారి దెబ్బతిన్నాను. ఈ అవమానాన్ని తీర్చుకోందే విశ్రమించను. ఇక నుంచి ప్రతిక్షణం కంటి మీద కునుకు లేకుండా మాస్టర్ మూమెంట్సుని కనిపెడతాను. మిల్లర్ వ్యూహాల్ని ఛేదిస్తాను ఇది నా తిరుగులేని నిర్ణయం" జోహ్రా పెద్దగా అరుస్తూ అన్నాడు.
    
    "హాన్ సోదరులు నీవు చేస్తానంటున్న మరో ప్రయత్నానికి పారితోషికం ఇస్తారా? అది కన్ ఫర్మ్ చేసుకున్నావా?" ఖలీల్ ఖాళీ అయిన బాటిల్ ని తీసి ప్రక్కన పెడుతూ అన్నాడు.
    
    "మొదటిది ప్రతిఫలం ఆశించి ప్రయత్నించి ఓడిపోయాను. ఈసారి నేను ఆశించే ప్రతిఫలం హాన్ సోదరుల సొమ్ముకాదు. జరిగిన అవమానానికి ప్రతీకారం నా తెలివితేటలమీద, నా గురిమీద ఓటమిద్వారా నేను పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ప్రోది చేసుకోవాలి. నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసుకోవాలి. రెండవసారి నేను మాస్టర్ మీద చేయబోయే అసాసినేషన్ కి పెట్టుబడి నా స్వంత సొమ్మే పద వెళ్దాం... అద్దెకు తీసుకున్న వస్తువుల్ని తిరిగి ఇచ్చేయాలి..." అన్నాడు తూలిపోతూ లేచి నించుని.
    
                                                    *    *    *    *    *