ఆ ఫైల్లో వున్నయువకుడు ఆమెకి ఖచ్చితంగా నచ్చుతాడని అతనికి బాగా నమ్మకం వుంది.

 

    నాగమ్మ ఫైల్ ఓపెన్ చేసింది.

 

    ఎల్.రవికాంత్. ఎం.ఎ.

 

    అని టైప్ చేసుంది మొదటి పేజీలో.

 

    "ఎల్.రవికాంత్. ఎం.ఏ చేశాడు ఆంధ్రా యూనివర్శిటీలో. ఎం.ఏ. గోల్డ్ మెడల్ వచ్చింది. అందగాడు - ఆరడుగుల ఆజానుబాహుడు. ఏ చెడు అలవాట్లూ లేవు. అన్నిటికి మంచి సెంట్రల్ మినిష్టర్ కొడుకు. మంత్రిగారికి ఇతనొక్కడే కొడుకు. ఆడపిల్లలు కూడా లేరు. కోట్లకు కోట్లు ఆస్తి వుంది" సెక్రటరీ కంఠంలో ఈసారి గర్వం తొణికిసలాడింది.

 

    అది గొప్ప సంబంధమని అతను భావిస్తున్నాడు గనుకే అతని కంఠంలో గర్వం తొంగిచూసింది.

 

    నాగమ్మ సోఫాలోంచి లేచి నించుంది.

 

    "ప్రపంచం మొత్తం మీద పూర్తిగా భ్రష్టుపడిన రాజకీయ వ్యవస్థ ఎక్కడుందో తెలుసా? ఇండియాలో. ప్రజల్ని, దేశాన్ని గాలికొదిలేసి స్వలాభం కోసం, అధికారంలో వుండడం కోసం ఉచ్ఛనీచాలు మరచేది ఎక్కడో తెలుసా? ఇండియాలో. ప్రజా సమస్యలని పరిష్కరించాల్సిన ప్రజా సభల్లో కొట్లాటకు దిగే దౌర్భాగ్య స్థితి ఏ దేశంలో వుందో తెలుసా? ఇండియాలో. ప్రజల దయా దాక్షిణ్యాలతో గెలిచి అధికారంలోకి వచ్చాక ఆప్రజలనే ఏడిపించేందుకు మూర్ఖపు చట్టాల్ని తయారుచేసేది ఎక్కడో తెలుసా? ఇండియాలో.

 

    ప్రజలకేం చేయాలని ఆలోచించకుండా "నువ్వు దొంగవంటే" "నువ్వంత కంటే పెద్ద దొంగవని' దిగజారిపోయి తిట్టుకొనేదీ, అలాంటి దౌర్భాగ్యుల్ని సిగ్గు లేకుండా ఎన్నుకొనేదీ, వాళ్ళేం చేసినా నిలదీయందీ, ఇక్కడే- ఇండియాలోనే.

 

    ఒక రాజకీయ నాయకుడికి, లేక అతని కుటుంబ సభ్యులకు పిల్లనిచ్చి పెళ్ళి చేసేది కన్నబిడ్డల్ని అమ్ముకొనే కసాయి తల్లిదండ్రులే"

 

    సెక్రటరీ నాగమ్మలో తొంగిచూసిన ఆవేశానికి, ఆగ్రహానికి విస్తుబోయాడు.

 

    "ఆ పార్టీ మంచిదని- ఈ పార్టీ చెడ్డదని ఏమీ చెప్పవద్దు నాకు. ఇండియాలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు చేసింది ఏమీలేదు.

 

    వాటికి వారసులైన రాజకీయ నాయకులు ఎంత దిగజారి వ్యవహరిస్తున్నారో నాకు తెలుసు. తెల్లారి పేపర్ చూస్తే ఒకర్ని ఒకరు తిట్టుకోవటం, చీకటి పడగానే టీవీ ఆన్ చేస్తే తమని తాము సమర్ధించుకోవడం. ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని చూశామా? వాటిని పరిష్కరించడాన్ని చూస్తున్నామా? సిగ్గులేని ఈ దేశ రాజకీయ వ్యవస్థకి రేపు ఇతనూ వారసుడవుతాడు. కొన్నాళ్ళకు "మీ అమ్మాయిని రాజకీయ నాయకుడి కొడుక్కిచ్చి చేశావా?" అని సభ్య సమాజం వెలివేస్తుంది. అలాంటి దుర్గతి అపప్రధ నా మనమరాలికి అంటగట్టలేను. ఒక రౌడీకయినా నామనవరాల్ని ఇచ్చి చేస్తాను కాని... ఒక రాజకీయ నాయకుడితో వియ్యమందలేను. మరికొన్ని మంచి సంబంధాలు చూడండి అదీ త్వరగా..." ఆవేశంగా అంటూ లోపలకు వెళ్ళిపోయింది నాగమ్మ.

 

    ఆమెలో ప్రజ్వరిల్లిన కోపానికి సెక్రటరీ బిత్తరపోయాడు.

 

    కొద్దిక్షణాలు అలాగే బిగుసుకుపోయాడు.

 

    "ఒక రౌడీకయినా నా మనుమరాల్ని ఇచ్చి చేస్తాను... అని అంది కదూ?"

 

    సెక్రటరీ మాటలు వినిపించిన వేపుకు గిరుక్కున తల తిప్పి చూశాడు.

 

    అక్కడ అర్జునరావు నవ్వుతూ నిలబడి వున్నాడు.

 

    అర్జునరావుని చూస్తే సెక్రటరీకి చెమటలు పట్టేస్తుంటాయి.

 

    "చెప్పు. నాగమ్మగారు ఏమన్నది?"

 

    అర్జునరావు మాటల్లో వెటకారం తొంగిచూసింది. మౌనంగా అవునన్నట్లు తలూపాడు సెక్రటరీ.

 

    "ఆమె కోరికను తీరిస్తేపోలా?" అర్జున్ రావు నవ్వుతూ అన్నాడు.

 

    "నాకు అర్థం కావడంలేదు" సెక్రటరీ అయోమయంగా చూస్తూ అన్నాడు.

 

    "అర్థమయ్యేలా నేను చెబుతాను. అర్థం పరమార్థం వుండేలా చెబుతాను. అక్కడికి నీకు అర్థం కాలేదనుకో - ఇంకెప్పటికీ నీకు ఏదీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వుండవు గనుక"

 

    అర్జున్ రావు మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా చివరి హెచ్చరిక మాత్రం అర్థమయింది. భయం అరికాళ్ళలోంచి వెన్నులోకి జరా జరా పాకింది.


                                                      *    *    *    *


    కనకారావు మొదటిసారి భయపడ్డాడు.

 

    పీటర్ దగ్గర చేరిన తర్వాత తొలిసారి భయపడ్డది కూడా అప్పుడే.

 

    తాను అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే కోపంతో పీటర్ ఎలా రెచ్చిపోతాడో, రెచ్చిపోతే ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తాడో కూడా కనకారావుకి బాగా తెలుసు.

 

    అందుకే పిచ్చెక్కిన వాడిలా తెగ తిరిగేస్తున్నాడు సామంత్ కోసం.

 

    సాధారణంగా సామంత్ తిరిగే వీధులు, కాలక్షేపం చేసే హోటల్స్ అన్నీ గాలించాడు. ఫలితం లేకపోయింది. వాచీ వేపు ఓసారి చూసుకున్నాడు- సాయంత్రం నాలుగున్నర.

 

    కనకారావులో ఒక్కసారి బీపీ పెరిగింది.

 

    గుండెదడ హెచ్చింది.

 

    మొఖంలోకి ప్రేతకళ వచ్చింది.

 

    "సాయంత్రం ఆరున్నరలోపు సామంత్ పాస్ పోర్ట్ ఫోటోస్, పుట్టుమచ్చల వివరాలు కావాలి. ఏడున్నరకి నేను ఎయిర్ పోర్టుకి బయలుదేరతాను" అని పీటర్ చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది.

 

    బయటకు వెళ్ళనివ్వకపోతే సామంత్ ఊరుకోడు. అలా సామంత్ ని వెళ్ళనిస్తే పీటర్ ఊరుకోడు. టెన్షన్ తో అతడి నుదుటి నరాలు ఉబ్బిపోయి, శరీరమంతా చెమటతో తడిసిపోయింది. అంతలోనే కర్తవ్యం గుర్తుకొచ్చి హిబ్రూదాదా షెడ్ కి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. పావుగంటకు అక్కడకుచేరుకుంది ఆటో. కానీ ఫలితం లేకపోయింది. సామంత్ అక్కడకు రాక వారమైనట్టు తెలియడంతో కనకారావు తిరిగి ఆటో ఎక్కాడు.

 

    అలా ఆటోలో ఒక గంటపాటు పిచ్చిగా తిరుగుతూనే వున్నాడు వీధులన్నీ.

 

    మానసిక ప్రశాంతత లేని వ్యక్తి త్వరగా అలసిపోతాడనడానికి నిదర్శనంగా కనకారావు ఓ హోటల్ దగ్గర ఆటోని ఆపించి, అందులోంచి దిగి హోటల్ లోకి వెళ్ళి నిస్త్రాణగా ఓ బెంచ్ మీద కూలబడిపోయాడు.

 

    భయంతో కొట్టుకుంటున్న అతని గుండె శబ్దం అతనికి స్పష్టంగా వినిపిస్తోంది.

 

    టీకి ఆర్డరిచ్చి "ఏం చేయాలా" అని ఆలోచిస్తుండిపోయాడు.

 

    పొగలు గ్రక్కుతూ టీ వచ్చింది.

 

    అయినా దాన్ని తాగాలన్న ఇచ్చే లేదతనికి. మరో ఐదునిమిషాలు గడిచాయి. ఈలోపు ఆలోచనల్నుంచి తేరుకున్న కనకారావు టీ కప్పుని అందుకునే ప్రయత్నం చేస్తూ ఆశ్చర్యపోయాడు.

 

    కప్పు ఖాళీగా వుంది.

 

    కోపంగా తలెత్తి సర్వర్ ని కేకవేయబోతూ, ఎదురుగా కూర్చుని తాపీగా తనకేసే చూస్తున్న సామంత్ ని చూసి, కొద్ది క్షణాలు మాటలు రాక బిగుసుకుపోయి, ఆ తరువాత తేరుకున్నాడు.

 

    అప్పటివరకు గుండెల మీద కొన్ని మెగాటన్నుల బరువున్నట్టు ఫీలయిన కనకారావు ఒక్కసారిగా తేలిగ్గా, ఆనందంగా ఫీలయ్యాడు.