"వాడు అర్భకుడు కాదు- అనితర సాధ్యుడు"

 

    "ఏడ్చాడు"

 

    "నేను చెప్పేది వినకపోతే మనం ఏడవాల్సి వస్తుంది"

 

    "ఎస్.ఐ. నరసింహానికి వాడు పాత కేసేనట. అతని ద్వారా ప్రొసీడ్ అవ్వు. ఎస్.ఐ. నరసింహం నరరూప రాక్షసుడు. అతని మాట వినని వాళ్ళుండరు... వెంటనే నరసింహాన్ని పట్టుకో, నేను చెప్పానని చెప్పు"

 

    "అతనెక్కడుంటాడు?"

 

    "ఎక్కడేమిటి? టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో"

 

    "ఆర్యూ ష్యూర్"

 

    "వాడ్డూయూ మీన్!"

 

    "వాటై మీన్ అన్నది తరువాత చెబుతాను! ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.ఆర్యూ ష్యూర్??..."

 

    "అవునక్కడే వుంటాడు."

 

    "పోలీస్ స్టేషన్ ఆఫీసు రూమ్ లోనా? లాకప్ లోనా?"

 

    "ఏమిటి మాట్లాడుతున్నావ్?" కోపంగా అడిగాడు అర్జున్ రావు.

 

    "తెలుసు. తెలిసే మాట్లాడుతున్నాను. అతనిప్పుడు అదే స్టేషన్లో రెండో నెంబర్ లాకప్ లో వున్నాడు"

 

    "వ్వాట్...?!" ఫోన్ కి ఆవేపు అదిరిపడుతూ అన్నాడు పెద్దగా.

 

    "అవును. మీరెంతో గొప్పగా చెప్పిన నరసింహాన్ని, మీరు చాలా తక్కువ చేసి చెప్పిన ఆ సామంతే లాకప్ లో పెట్టించాడు"

 

    షాక్ తిన్నాడు అర్జున్ రావు.

 

    "ఏ... ఎందుకని...?!" అర్జున్ రావు తడబడుతూ అన్నాడు.

 

    "నరసింహం దొంగతనం నేరం... అదీ 420 క్రింద లాకప్ లోకి నెట్టబడ్డాడు"

 

    "నరసింహం దొంగతనం చేసాడా?!"

 

    "చేయలేదు. సామంత్ చేయించాడు. ఆ తరువాత సింపుల్ గా ఆ విషయాన్ని డి.ఐ.జి.కి చేరవేసాడు"

 

    "మధ్యలో డి.ఐ.జి. ఎవరు?"

 

    "ఆయనింట్లోనే నరసింహం దొంగతనం చేసింది"

 

    "నాకేం అర్థం కావడంలేదు"

 

    "నాకూ వెంటనే అర్థం కాలేదు. మీకర్ధం కావడానికి కూడా కొంచెం టైమ్ పడుతుంది."

 

    "ఆఖరి నిమిషంలో ఏమిటిదంతా?"

 

    "ఏదైనా ఆఖరి నిమిషంలోనే గదా జరిగేది. ఇకిప్పుడు ఈ తరహా సంభాషణ కాలహరణాన్నే చేస్తుంది తప్ప కార్యాన్ని సాధించలేదు. మరో గంటలోగా పదిలక్షలు పంపించండి. ఆల్టర్నేటివ్ కేస్ కోసం ప్రయత్నించవద్దు ముందు పెళ్ళి ముఖ్యం. వాడు కావాలనే తను నాగమ్మగారికి, ఆ అమ్మాయికీ నచ్చేవరకు, ముహూర్తం పెట్టే వరకు ఆగాడు. అన్ని విషయాలు కన్ ఫర్మ్ అయ్యాయి గనుకే ఇప్పుడిలా హఠాత్తుగా అడ్డం తిరిగాడు. ముందు ఏ అడ్డంకు లేకుండా పెళ్ళి పూర్తవనివ్వండి. ఆ తరువాత వాడ్నేం చేయాలన్నది నేను చూసుకుంటాను. ఈ పదిలక్షలు కక్కిస్తాను. ప్రాణం కాపాడుకోవడానికి పరుగులు పెట్టిస్తాను. వెంటనే నమ్మకమైన మనిషికి సూట్ కేస్ ఇచ్చి పంపించండి" పీటర్ అర్జున్ రావు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు.


                                *    *    *    *


    సామంత్ డిమాండ్ చేసినట్టుగానే సరిగ్గా రాత్రి తొమ్మిదిగంటలకు సూట్ కేసుతో నాగమ్మ సెక్రటరీ బయలుదేరి కనకారావు దగ్గరకు వచ్చి, అతన్ని తోడు తీసుకుని కృష్ణా ఓబెరాయ్ కేసి బయలుదేరాడు.

 

    వాళ్ళు ఎక్కిన కారు రాత్రి తొమ్మిది ఇరవయికి కృష్ణ ఓబెరాయ్ గేటులోంచి ఆవరణలోకి వెళుతుండగానే సామంత్ ప్రక్కనుంచి హఠాత్తుగా కారుకి ఎదురొచ్చాడు.

 

    సడన్ బ్రేకుతో కారాగింది.

 

    "తెచ్చారా?" సామంత్ కారు దగ్గరకు వచ్చి, తలని లోపలకు వంచి అడిగాడు.

 

    తెచ్చామన్నట్లు ఇద్దరూ తలూపారు.

 

    "అయితే ఇలా ఇచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోండి" అన్నాడు డోర్ హేండిల్ మీద చేయివేసి.

 

    అన్ని విధాలా జాగ్రత్తలు పడుతున్నాడని కనకారావు గ్రహించి పళ్ళు పటపటా కొరుకుతూ కాళ్ళ దగ్గరున్న సూట్ కేస్ ని తీస్తుండగా సామంత్ చటుక్కున డోర్ తెరిచి కారులోకి ఎక్కి సూట్ కేస్ ని అందుకుని దాన్ని తెరిచి చూసాడు.

 

    నిండా, వరుసగా పేర్చిన వందరూపాయల నోట్ల కట్టలు, అప్పటి వరకు దాన్ని సెక్రటరీ, కనకారావులు తెరిచి చూడలేదు. అందుకే కళ్ళు జిగేల్ మన్నాయి.

 

    ఓ క్షణం సామంత్ కేసి అసూయగా చూసారు. సామంత్ సూట్ కేస్ ని మూసి, చటుక్కున కారులోంచి దిగి వేగంగా హోటల్ బయటకు వెళ్ళి ఆటో ఎక్కాడు.

 

    కారు రివర్సయి ఆవరణ దాటి రోడ్ మీదకు వచ్చేసరికే సామంత్ ఆ ప్రాంతం నుంచి అదృశ్యమయిపోయాడు.


                                *    *    *    *


    మూడోరోజు పెట్టుకున్న ముహూర్తం ప్రకారమే సామంత్ నాయకిల పెళ్ళి కనుల పండువుగా జరిగిపోయింది. ఆ రోజంతా, ముఖ్యంగా పెళ్ళి సందర్భంలో అర్జున్ రావు, పీటర్ ఎంతో టెన్షన్ గా ఫీలయ్యారు.

 

    గతంలో సామంత్ ని ఎరిగిన వారెవరన్నా వస్తే తమ పథకం తల్లక్రిందులయి పోతుందని తెగ వర్రీ అయిపోయారు.

 

    నాగమ్మ ఆరోజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కన్న కొడుకు చనిపోయినా, ఇంటికి దీపమై నిలిచిన కోడలు పోయినా, బంధువులంతా తనను వెలివేసినా, తానే అన్నీ అయి, ఆస్తుల్ని కాపాడుకుంటూ, అమ్మా నాన్న లేని నాయకిని పెంచుకుంటూ వచ్చిన నాగమ్మ కళ్ళలో ఆనందభాష్పాలు నిలిచాయి.

 

    పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులు ఒక్కొక్కరే నాగమ్మకి చెప్పి వెళ్ళిపోతున్నారు.

 

    "దశాబ్దాలుగా నాలో రేగుతున్న పగ, ప్రతీకారం ఈరోజుతో తీరి పోయింది. సామంత్ ఎవరో తెల్సిన క్షణం నుంచి తను తన మనుమరాలికి ఎంత అన్యాయం చేసిందో తలచుకుని కుళ్ళి కుళ్ళిపోతుంది నాగమ్మ. ఆటో మొబైల్ కంపెనీ తీరని నష్టాలతో ఇన్ సాల్వెన్సీ పిటీషన్ ని కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధంగా వుంది. ఇప్పుడు ఆస్తులకన్నా అప్పులే ఎక్కువగా వున్నాయి. అమెరికన్ క్రిస్ లర్ కంపెనీకి ఒకప్పుడు పట్టిన దుస్థితే ఇప్పుడు ఎన్.ఎన్.ఆటోమొబైల్ కంపెనీకి పట్టబోతోంది" ఆనందంగా అన్నాడు అర్జునరావు నాగమ్మకు కనబడేలా ఏదో హడావిడి చేస్తూ.

 

    "చాలారోజుల నుంచి చూస్తున్నాను ఎప్పుడూ నాగమ్మగారిని, ఆమె మనుమరాలిని నమిలి మ్రింగేద్దామన్నంత ద్వేషంతో రగిలిపోతుంటారు. అసలేమయింది? ఎందుకంత పగ మీకు" పీటర్ తన పిల్లిగడ్డాన్ని నిమురుకుంటూ అడిగాడు.