వేళ్లకి పండ్లు కాస్తున్నాయ్!

 

 

చెట్లకి పండ్లు కాయడం మామూలే. కానీ ఇప్పుడు వేళ్లకి కూడా కాస్తున్నాయ్. ఫ్రూట్ ఫిల్డ్ మానిక్యూర్ పుణ్యమా అని. ఒకప్పుడు చేతులకి, వేళ్లకి, గోళ్లకి గోరింటాకు పెట్టి ఆ రంగుకే మురిసిపోయేవారు. ఆ తరువాత నెయిల్ పాలిష్ లు వచ్చాయ్. వాటిని వేసుకుని భలే ఉన్నాయే అని సంబరపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నెయిల్ పాలిష్ ను మామూలుగా వేసుకోవడం లేదు. రకరకాల డిజైన్లను వేసుకుంటున్నారు. వాటిలో అత్యంత పాపులర్ అయిపోయింది ఫ్రూట్ ఫిల్డ్ మానిక్యూర్.

 

 

ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది. అందుకే ఇప్పుడు ఆహారంలో ప్రథమ పాత్ర పండ్లే పోషిస్తున్నాయ్. చివరికి నెయిల్ ఆర్ట్ లో కూడా అవి దూరిపోయాయ్. కావాలంటే ఈ ఫొటోలు చూడండి మీకే తెలుస్తుంది. స్ట్రాబెర్రీస్, యాపిల్స్, ఆరెంజెస్, అవకాడో, పీచ్, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, వాటర్ మిలన్... ఒక్కటేమిటి, వేళ్లకు కాయని పండంటూ లేదు.

 

 

ఈ రకమైన నెయిల్ ఆర్ట్ లో రకరకాలుగా డిజైన్స్ వేస్తున్నారు బ్యూటీషియన్లు. గోళ్లపై పండ్ల ఆకారాలను అద్దడం ఒక రకమైతే... పండ్ల ముక్కల్ని గోళ్లమీద అతికించారా అన్నట్టుగా వేసే డిజైన్లు మరో రకం. మరో రకం కూడా ఉంది. పండ్ల ఆకారంలో గోటిని వదిలేసి మిగతా భాగమంతా పెయింట్ చేస్తుంటారు. అదనపు ఆకర్షణ కోసం స్టోన్స్, కుందన్స్ అతకడం కూడా జరుగుతోంది. చక్కని రంగులు, అద్భుతమైన డిజైన్లతో నఖ సౌందర్యం రెట్టింపవుతోంది. సిటీస్ లో అయితే ఆల్రెడీ పెయింట్ చేసిన ఆర్టిఫీషియల్ నెయిల్స్ కూడా దొరుకుతున్నాయి. వీటిని కొనుక్కుని జస్ట్ అలా గోళ్లకు అతికించేసుకోవడమే. స్కిక్కర్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి.

 

 

బట్టలు, హెయిర్, శాండిల్స్, జ్యూయెలరీ అంటూ రోజుకో రకం స్టయిల్ ని ఫాలో అవుతోన్న యూత్ కి ఈ ఫ్రూట్ నెయిల్స్ భలే నచ్చేస్తున్నాయి. దాంతో తమ వేళ్లకి రోజుకో రకం పండ్లని కాయిస్తున్నారు. మీరు కూడా మొదలుపెట్టేయండి మరి!

- Sameera