"మరో లార్జ్ పెగ్ మాత్రమే డార్లింగ్" అన్నాడు అతను తడబడుతున్న గొంతుతో బ్రతిమాలుతున్నట్లుగా. తాగి చాలా రోజులయింది. హేవర్డ్స్ రుచి చూశాను, బీరూ, బ్రాందీ పుచ్చుకున్నాను. కాస్త రమ్మూ, జిన్నూ కలిపి నాలిక తడిపితే......"

    "కానీ బిల్లు సంగతి ఆలోచించావా? ఈపాటికి జీవితంలో నాలుగోవంతుకు సరిపడి వుంటుంది" అన్నదామె దిగులుగా.

    అతను లాలింపుగా ఆమె భుజంమీద తట్టాడు. "ఇవాళ డబ్బుగురించి ఆలోచించకు డార్లింగ్. మన మేరేజ్ డే ఈరోజు. సరిగ్గా నాలుగు సంవత్సరాలు. సరదాగా, ఖుషీగా ఇవాలంతా మళ్ళీ...మళ్ళీ....సంవత్సరం దాకా తాగితే అడుగు."

    ఈ సంభాషణ వింటూన్న జ్ఞానసుందరి ముఖంలో ఎలాంటి హావభావాలు ప్రదర్శితమౌతాయో అని ఆతృతగా చూశాడు మురళి. కానీ నిశ్చలంగా, నిర్మలంగా వుంది ఆమె ముఖం.

    "ఇలాంటి చోటుకి తీసుకువచ్చానని విసుక్కుంటున్నావా?" అని కొంచెం ఆగి అడిగాడు.

    "ఉహు" అని ఆమె తల త్రిప్పింది.

    "ఈ వాతావరణం చూసి నీకు ఆశ్చర్యంగా వుందా?"

    "లేదు."

    'పోనీ, ఇక్కడ కూర్చుంటే నీకెలా వుంది అనుభూతి?"

    "ఇంట్లో వున్నట్లుగానే వుంది.

    ఆమె జవాబు అతనిలో నిస్పృహను రేకెత్తించింది. ఆమె అచంచల హృదయ గాంభీర్యంగల వ్యక్తి అని తెలుసుగానీ ఆ గాంభీర్యం అవధులు దాటని మహా శక్తి అని ఇప్పుడే తెలుసుకున్నాడు. ఇంతటి నిశ్చల నిగ్రహాలు ఏ స్త్రీలోనూ అతనింతవరకూ చూడలేదు. ఇంకా తరచి చూద్ధామనిపించింది.

    'నేను విస్కీ తీసుకోనా?" అని అడిగాడు.

    అతనివంక తల త్రిప్పయినా చూడలేదు "తీసుకోండి" అంది.

    "నేను త్రాగితే నీకు కోపంరాదా?"

    "రాదు."

    ఎక్కడా కలవరపాటు లేదు. ఏమయినా వుంటే అది అతని వంతయింది."పారిస్ షేం పెయిన్, ఎలా వుంది సినిమా?" అని అడిగాడు ఆమె ముఖంలోకి చూస్తూ.

    "నచ్చింది నాకు."

    "అందులో కొన్ని దృశ్యాలలో మెరుపు మెరిసే వ్యవధిలో నగ్నంగా చూపించాడు. అలాంటి సినిమా నీకసహ్యం కలిగించలేదూ?"

    "కొన్నివేలమంది మేను మరచి ఆనందిస్తూన్న దృశ్యం నా ఒక్కదానికే అసహ్యమెందుకు కలిగించాలి?"

    "నువ్వు అతీతురాలివి కావచ్చుగా?"

    "ఇలాంటి స్వల్పమైన అంశాలను ఆధారం చేసుకుని అంటగట్టడం అన్యాయం" అంది జ్ఞానసుందరి కొంచెం నవ్వి.

    అతనికేమనదానికీ తోచలేదు. వ్రేళ్ళు బల్లమీద పెట్టి ఆడిస్తూండగా బేరర్ పదార్ధాలు తీసుకొచ్చి ప్లేట్లలో నింపాడు.

    మరో అరగంతవరకూ ఇద్దరూ ఆ హోటల్లో గడిపారు. ఈ లోపుగా మరో జంట లేచివెళ్ళి కాసేపు నాట్యం చేసింది. తర్వాత కొంతసేపు ఆర్కెస్ట్రా పాశ్చాత్య సంగీతాన్ని వినిపించింది. బిల్ చెల్లించాక మురళి, జ్ఞానసుందరి బయటకు వచ్చారు.

    ఆమె కట్టులో, బొట్టులో, తల దువ్వుకోవటంలో, శరీరపు తీరులో, నడకలో, కదలికలో, పెదవి కదల్చడంలో, కళ్ళలో, చూపులో చెప్పలేని వినమ్రతతో కూడిన ఆకర్షణ వున్నది. ఆమె పౌడర్ రాసుకోలేదు, లిప్ స్టిక్ పూసుకోలేదు. హైహీల్స్ తొడుక్కోలేదు. మెరిసే దుస్తులు ధరించలేదు. అయినా ఆమెలో నిండుతనం వుంది. ఆమె సుందర నయనదళకాంతుల్లో ఆత్మవిశ్వాసం, ఎవ్వర్నీ చూసి ఝడుసుకోని స్థయిర్యం, ఎట్టి సంఘటనైనా ఎదుర్కోగల నిబ్బరం, ఇన్ ఫీరియారిటీ అంటే తెలియనితనం, అనురాగం, మానవత్వంమీద మమకారం, నలుగుర్నీ సమానంగాచూడగల విశాలత్వం ద్యోతకమవుతున్నాయి. అతని చెయ్యి పట్టుకుని ఆమె నడుస్తూంటే చూపరులు ముగ్ధులై తిలకించసాగారు. ఎవరినైనా స్వార్ధ రహితుల్నిచేసి, వారిలోని ప్రలోభాన్ని నశింపజేసే మంత్రశక్తి ఆమెవద్ద వున్నదేమో అనిపిస్తుంది. ఆ సమయంలో చూస్తే అజంతా శిల్పమూ, దంతపుబొమ్మా, చందనపు ప్రతిమా - ఇలాంటి ఉపమానాలతో ఆమెను పోల్చటం సరికాదు. మామూలు మానవాంగన. అయితే సృష్టికి, ప్రకృతికి నిర్వచనం చెప్పే సహజ, సజీవ మనవసుందరి.

    విశాలమైన రోడ్లమీదుగా మెత్తగా కారు పోసాగింది. అతనిప్రక్కన తాలూకూ కూర్చుంది ఆమె. ఇద్దరిమధ్యా బరువుతో కూడిన మౌనం ఆవహించింది. ఈ బరువులో కాస్త ప్రశాంతత ఉంది.

    వీధికి ఇరుప్రక్కలా పాదరసపు దీపకాంతి. నడుస్తూన్న వివిధరకాల తరగతుల ప్రజానీకం, ఎడతెరిపి లేకుండా పరిగెడుతున్న కార్లూ, సిటిలో ప్రకృతి చోటు చేసుకుంటున్నట్లు స్ఫురింపజేసే ఇంపైన వాతావరణమూ, గిలిగింతలు పెట్టే చలిగాలి. ఎటుచూసినా దూరాన మినుకుమినుకుమంటున్న దీపాలూ, విశాలంగా సాగి నీటిపై పరుపులా పరచుకున్న టాంక్ బండ్.......

    "హైదరాబాద్ బై నైట్" అన్నాడు మురళి తనలో తను అనుకుంటున్నట్లు.

    ఆమె ఏమీ మాట్లాడలేదు.

    "బెంగుళూరు, హైదరాబాద్ ఇవే నాకు నచ్చిన నగరాలు. ఇంత నిర్మలమైన ప్రశాంతత ఈ రెండూ మినహాయించి ఎక్కడా లభించవు."

    "మనలో వుంటుంది" అన్నదామె ఈసారి మౌనం ధరించకుండా.

    మనలో ఎంతవరకూ ఉంటుంది? కొంతవరకే. మిగతాది పరిసరాలమీద, మనకు సంభందించిన సన్నిహిత వ్యక్తులమీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి మనకు ఏదీ కలిసిరాకపోతే చాలా దుర్భలులం అవుతాం."

    "అలా అనుకోవటంలా నేను" అన్నది జ్ఞానసుందరి నిశ్చలకంఠంతో. "మన బలహీనతలు పరిసరాలమీదకు నెట్టటం కేవలం సాకు అవుతుంది. మన శాంతికి, తపనకూ మన ప్రవృత్తే కారణం. బలిష్టమైన గుండె, దిట్టమైన మనసూ మనిషిని ఆనందానికి చేరువగా తీసుకొస్తుంది. అలాంటి వ్యక్తి పల్లెలో వున్నా, పట్టణంలో వున్న ఆఖరికి అడవులలో వున్నా సుఖపడటం చాతనవుతుంది

    "అలాంటి శక్తి గలదానివా జ్ఞానా?" అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.

    ఆమె పెదవులమీద చిరుదరహాసం ఉదయించింది. "మన వివాహము జరిగి అయిదురోజులయింది. మీ అనుగ్రహం వుంటే, నా శక్తి అని అననుగానీ, నా మాటలయందు నమ్మకం కలిగిస్తాను" అంది మృదువుగా.

    ఒక్కక్షణం అతను మాట్లాడలేకపోయాడు. తర్వాత "జ్ఞానా! నువ్వెవరివి?" అన్నాడు హఠాత్తుగా.

    "ఒక స్త్రీని, అబలను, అర్ధాంగిని."

    "స్త్రీవి నిజమే. అందరిలాంటి స్త్రీవి మాత్రం కాదు. అర్ధాంగినన్నావు, ఆ మాటమీద నాకు గురికుదరటం లేదు."

    "ఎందుకని? నా మెళ్ళో పుస్తె కట్టటం అబద్ధమా."