"సందీప్ నన్ను ప్రేమించలేదన్న వాస్తవాన్ని నేను భరించలేకపోతున్నాను. నన్ను అందరిలో ఒకదానిగా చూడడాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాను. నేను...నేను...అందంగా వుంటాననే నా వెంట పడ్డాడుగా...ఆ అందం అంతవరకే వాడుకుని వదిలెయ్యడానికా?" ఆవేదనో, ఆక్రోశమోకానీ నా గొంతు వణికింది.

 

    చిత్ర నా భుజం మీద చెయ్యివేసి "ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరి కూడా తొలి ప్రేమలో ఘోరంగా విఫలమయ్యానని వ్రాసింది! అందానికీ ఇటువంటి వ్యవహారాలకీ పొంతన వుండదు. వీటికి కారణం ఎక్స్ పెక్టేషన్! అతనూ నువ్వూ ఆ విషయంలో క్లియర్ గా లేకపోవడమే దానికి దారితీసింది" అంది.

 

    ఎంతోమంది నాలాంటి ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విలువైన విషయం!

 

    అన్ని రకాల పరిచయాలూ స్నేహాలూ కావు! అన్ని రకాల స్నేహాలూ ప్రేమకి పునాదులు వెయ్యవు. ప్రేమలన్నీ పెళ్ళికి దారితియ్యవు!

 

    ఇటువంటి వ్యవహారాల్లో వీలైనంత తొందరగా అమ్మాయి, అబ్బాయీ వాళ్ల ఎక్స్ పెక్టేషన్ల గురించి మాట్లాడేసుకోవడం మంచిది.

 

    "ఆదివారం నా ఎంగేజ్ మెంట్ కి వస్తావుగా!" ఇన్విటేషన్ కార్డు ఇస్తూ అడిగింది చిత్ర.

 

    నేను తలఊపాను.

 

    "ప్రేమ ఫెయిల్ అయినప్పుడల్లా చచ్చిపోతే ఎన్నిసార్లు చావాల్సొస్తుందో తెలుసా?" నవ్వుతూ అంది చిత్ర.

 

    "ప్రతాప్ కి కార్డు పంపించావా?" అడిగింది వైజయంతి.

 

    "ఆ...అందగానే ఫోన్ చేశాడు. రావడానికి కుదరదు అని కంగ్రాట్స్ చెప్పాడు. అన్నట్లు నీకు తన విషెస్ చెప్పమన్నాడు" అంది.

 

    "ఇంకేం అనలేదా?" వైజూ ఆత్రంగా అడిగింది.

 

    ప్రపంచం అంతా ఎండిపోయి ఒక్క నీటిచుక్క కూడా దొరక్క దాహంతో నాలుక పిడచకట్టినట్లుగా వుంటుంది ప్రేమికుల పరిస్థితి! దుర్భరమైన నరకం!

 

    "ముక్త చచ్చిపోయింది అని చెప్పే పరిస్థితి కొంతలో తప్పిపోయింది నీకు!" విరక్తిగా అన్నాను.

 

    "అందరి సంగతులూ అడిగాడా?" ఇంక ఆపుకోలేక అడిగేసింది వైజూ.

 

    "వైజూ మళ్ళీ ఎవర్నీ ప్రేమించలేదా అని అడిగాడు" అంది నవ్వుతూ చిత్ర.

 

    "చిత్రా...దాని గుండెని కోయకు!" అనుకున్నాను.

 

    వైజూ కళ్ళల్లో తడి!

 

    "స్టుపిడ్!" అంది.

 

    "మరిచాను, వైజూని ఉత్తరం రాయమను అన్నాడు" అంది అప్పుడే గుర్తుకొచ్చినట్లు.

 

    ఆ మాటతో వైజూ ముఖంలో వెన్నెలొచ్చింది.

 

    "నేను ఇంక వెళతాను, బావతో షాపింగుకి వెళ్ళాలి" అంటూ లేచింది చిత్ర.

 

    "చిత్ర గొప్ప అదృష్టవంతురాలు. కోరుకున్నవాడే భర్తగా మారుతున్నాడు" అన్నాను.

 

    "భర్తగా మారేవాడ్నే కోరుకున్నాను" అంది చిత్ర.

 

    నిజంగా ఎంతటి అదృష్టం! ఇంటి ముంగిలిలోకొచ్చేవాడికే స్వాగతగీతి పలికి వెళ్ళేవానికి నిశ్శబ్దంగా వీడ్కొలివ్వడం సాధ్యమా? సాధ్యమయితే ఇన్ని కావ్యాలూ, చరిత్రలూ ఎందుకు పుడతాయి?

 

    వైజయంతి నాతో "నీ బాధ నేను అర్థం చేసుకోగలను ముక్తా. కానీ ఓర్చుకోవాలి. నువ్వు ఇందాక అన్నట్లుగా మోసపోలేదే! అతను నిన్ను దగా చెయ్యలేదు. చాలా నిజాయితీ ఉన్నవాడు!" అంది.

 

    "నిజాయితీనా?" ఆశ్చర్యం వేసింది.

 

    "ఔను! నువ్వు పెళ్ళిగురించి అడిగినప్పుడు వెంటనే తన అభిప్రాయం చెప్పకుండా, ఆ అవసరం కాస్తా తీరిపోయాక చెప్పి వుంటే ఏం చేసేదానివి? అతను అలా చెయ్యలేదు. హీ ఈజ్ వెరీ స్ట్రైట్ ఎండ్ క్లియర్! అందుకు మెచ్చుకోవాలి!" అంది.

 

    ఆ విషయమే ఆలోచిస్తూ ఉండిపోయాను.

 

    సందీప్ నన్ను బెడ్ మీదకి తీసుకెళ్ళాడు.

 

    అతనికి నేను సర్వం అర్పించడానికి సన్నద్ధమయ్యాను. ఆ నిమిషంలో అతనికి నా శరీరం పూర్తిగా వశమైపోయింది. అతను ఆమాట దాటేసినా నేనేం చెయ్యలేకపోయేదాన్ని. ఆ సౌఖ్యానికి తలవొగ్గి నోరుమెదిపేదాన్ని కానేమో! కానీ...అతను అలా చెయ్యకుండా తన ఉద్దేశం, అభిప్రాయం స్పష్టంగా చెప్పాడు.

 

    ఒక్కసారి తరచి గతాన్ని చూసుకుంటే అతను ఎప్పుడూ నాతో పొరపాట్న కూడా 'లవ్', 'మేరేజ్' అన్న పదాలు రానియ్యలేదు! కేవలం ఫ్రెండ్ షిప్, క్లోజ్ నెస్ అన్న పదాలే వాడాడు.

 

    ఎస్...హీ ఈజ్ వెరీ క్లియర్! నేనే తెలివితక్కువగా పప్పులో కాలేశాను. నార్లెస్ డికెన్స్ వ్రాసిన 'గుడ్ ఎక్స్ పెక్టేషన్స్ గుర్తొచ్చింది!

 

    సందీప్ కి నేను ఒక్కదాన్నే సరిపోను! అతను ఎవర్నీ ప్రేమించడు. అందరితో స్నేహం చేస్తాడు. అందాన్ని ఇష్టపడతాడు. రేపు వచ్చే భార్యని మాత్రం ప్రేమిస్తాడు. హాయిగా ఉంటాడు. దటీజ్ సందీప్!

 

    చిత్రకి ప్రెజంటేషన్ కొనడానికి నేనూ వైజూ అబిడ్స్ వెళితే, సందీప్ కారులో, అతని ప్రక్కన కూర్చున్న రూబీని చూశాక అతనిపట్ల నా అభిప్రాయం రూఢీ అయింది.

 

    రూబీ ఆరోజు మ్యూజికల్ చైర్స్ లో నేను కూర్చోబోయే కుర్చీ తన్నేసిన పిల్ల!


                                  *  *  *


    రూబీ ఎలాగైతేనేం చివరికి సీటు గెల్చుకుంది! నా మనసంతా అసహనంగా మారిపోయింది. వైజూనే ఏదో ఆర్ట్ పీస్ సెలెక్టుచేసి చిత్రకోసం తీసుకుంది.

 

    "ఆటోలో మా ఇంటివద్ద దింపి "రాత్రి నిద్రపోయే ముందు ఆరోజు మనం చేసిన పనులన్నీ ఒకసారి తల్చుకుంటే, మరునాడు పొరపాట్లు చేయకుండా ఉండచ్చు! అని మా నాన్న అనేవారు" అంది.

 

    "ఔను!" అన్నాను.