అనిత కిడ్నాప్ గురించి గాని, సౌదామిని ఇక్కడకు రావటం గురించి గానీ తెలీని ప్రబంధ, తడిసిన బట్టలతోనే గోడకి జారగిలబడిపోయింది.
    
    "సీరియస్ గా నేనన్న మాటలని గురించి ఆలోచిస్తున్నావా?"
    
    "అహఁ" తల అడ్డంగా వూపింది.
    
    "మరి?"
    
    "మా అన్నయ్య..." ఆమె గొంతు తడారిపోయింది.
    
    "మీ అన్నయ్య..."
    
    "చేసిన పొరపాతుకి క్షమించమని అడగాలని..."
    
    నవ్వేశాడు. "అలా అలవాటులేని సిగ్గుని అభినయిస్తూ ఆలోచిస్తున్నారన్నమాట."
    
    సీరియస్ గా తల పైకెత్తింది. "నేను కూడా సిగ్గుపడగలను."
    
    "సిగ్గుపడాల్సిన విషయం కాదే?"
    
    "మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తేనే అందంగా వుంటుంది ప్రబంధా! చెప్పండి. నేనంటే కోపం లేదు కదూ?"
    
    "ఆ మాట అనాల్సింది నేను."
    
    క్షణం తర్వాత అన్నాడు- "ఈ రాత్రికి వర్షం తగ్గేట్టు లేదు."
    
    'ఓ యుగం దాకా తగ్గకపోతే బాగుణ్ను' అనలేదు ప్రబంధ మనసులోనే అనుకుంది.
    
    "తప్పదు! నామూలంగా ఆరోగ్యం చెడిపోయిందన్న చెడ్డపేరు నా కొద్దు. ఈ రాత్రికి ఇక్కడే ఉండాలీ అంటే మీరు అర్జెంటుగా తడిసిన బట్టల్ని మార్చి తీరాలి.
    
    "ఇలాగే వుంటాను."
    
    "ఒప్పుకోను."
    
    బలవంతంగా తనే వివస్త్రగా మార్చేస్తాడా?
    
    "పోటీలో తప్ప మాటలతో చెప్పే మాట వినరనుకుంటాను" అన్నాడు.
    
    అర్ధంకానట్టు చూసింది.
    
    ఆ చూపులు అతడి మనసు పొరల్లోకి వాడిచూపుల్లా చొచ్చుకుపోయాయి.
    
    వర్షం కురుస్తున్న రాత్రి.... ఒంటరితనం....అందమైన యౌవనం.
    
    ఇంతకాలం ఆలోచించడం తెలియని ఆదిత్య చిత్రమయిన వివశత్వానికి గురౌతున్నాడు.
    
    తను ఇలా అవసరమై నటిస్తున్నాడో, లేక నిజాన్నే నటన అని తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడో అతడికే తెలియదు.
    
    "జవాబు చెప్పండి ప్రబంధా?"
    
    "దేనికి?"
    
    "ఇప్పుడు మనం ఓ క్విజ్ పోటీకి సిద్దపడుతున్నాం.
    
    "ఇప్పుడా?"
    
    "మనం తొలిసారి కలుసుకున్నది పోటీలో. ఇప్పుడు మళ్ళీ ఐక్యూతో ఎవరిమాట ఎవరు వినాలో తేల్చుకుందాం."
    
    "అంటే?" విస్మయంగా చూసింది.
    
    "మీరు మీ మాట ప్రకారం బట్టలు మార్చకూడదు అనుకుంటే నాతో క్విజ్ లో నెగ్గాలి."
    
    చిత్రంగా అనిపించిందామెకి. అయినా సంతోషంగా వుంది.
    
    ఏం మాట్లాడుతూ గంటలు దొర్లించాలో అర్ధంకాని ఆమెకి ఈ ప్రపోజల్ బాగానే వున్నట్టనిపించింది.
    
    అది మాత్రమే కాదు- ఇప్పుడామె చూస్తున్నది. మరో ఆదిత్యని. అతన్ని ఇంతకాలం ఎలా చూడాలని అనుకుందో ఇప్పటికి అలా కనిపిస్తున్నాడు.
    
    అతని మాటల్లోని చిలిపితనం మరీ మరీ వినాలనిపించేట్టుగా వుంది.
    
    తనను తహను పరామర్శగా తాకి గుండె లోతుల్లో తటిల్లతలా మెరవాలని ఏ తూర్పు కిరణాలకోసం ఇంతకాలం తపస్సు చేసిందో, ఇదిగో ఇప్పుడు ఆ కిరణాలే ప్రత్యక్షమయి పరామర్శనే కాదు, పరవశాన్నీ నింపుతున్నాయి.
    
    "నేను రెడీ" అంది ధీమాగా.
    
    "బాగా ఆలోచించుకోండి."
    
    నవ్వేసింది.
    
    "నవ్వటం కాదు, ఇదో చిత్రమయిన పోటీ."
    
    "అంటే?"
    
    "మీరు జవాబు చెప్పని ప్రతి ప్రశ్నకి మీ ఒంటిమీద నుంచి ఒక్కోటి తీసేయాలి."
    
    ప్రబంధ చెంపలు అరుణిమ దాల్చాయి.
    
    "చెబితే?" అడిగింది స్వప్నంలోలా.
    
    "చెబితే తీయనక్కర్లేదు."
    
    "అలాకాదు మీరేం శిక్ష విధించుకుంటారో చెప్పండి."
    
    క్షణం తర్వాత అన్నాడు- "మీ తడి బట్టల్ని విప్పమనను. మీరు జవాబు చెప్పేసిన మరుక్షణం చెంబుడునీళ్ళను  నా మీద ఒంపుకుని నేనూ తడిసిపోతాను."
    
    "అలా ఎంతసేపు?" అడగబోయి ఆగిపోయింది. అలాగే తెల్లారి పోతేనేం?"
    
    "సరే" అంది.
    
    బయట ఎక్కడో పిడుగు పడిన చప్పుడు.
    
    మరుక్షణం ఓ మెరుపు.
    
    ఇప్పుడు ప్రబంధలోనూ అలజడి మొదలయింది ప్రారంభం కాబోతున్న తుఫానులా.
    
    ఆదిత్య ప్రబంధ సమక్షంలో పోటీకి సిద్దమౌతూ తన సమస్యని మరిచిపోయాడు.
    
    అది సౌదామిని అందించిన ధైర్యమో, లేక ప్రబంధ అండతో ఎలాంటి విపత్కర స్థితినయినా ఎదుర్కోగలనన్న నమ్మకమో మరి. నెమ్మదిగా అన్నాడు "ఇప్పటికీ మించిపోయిందిలేదు ప్రబంధా! మరోసారి ఆలోచించుకోండి."
    
    "ఏ విషయంలో?" మొండిగానే అంది.
        
    "ఈ పోటీ బహుశా ఓ ఆడపిల్లగా మీకు ఇబ్బందికరమైనదిగా అనిపించొచ్చు. ఏ అమ్మాయీ కోరనిదీ, కూడనిదీ కావచ్చు."