వైజూ పకపకా నవ్వుతోంది.

 

    "ఐ యామ్ ఫెద్ అప్ యార్..." విసుగ్గా చెప్పాను.

 

    "కళ్ళు చెదిరేలా ఇంత అందంగా వుంటే ఇదే ప్రాబ్లెమ్! మంచి లిఫ్ట్ పోగొట్టుకున్నావు. బుద్ధి లేదు నీకు!" అది నవ్వుతూనే అంటోంది.

 

    "బుద్ధి వచ్చింది నాకు...ఆటో!" అని ఆటోను పిలిచాను.


                                   *  *  *


    అమ్మా, నాన్నా ఊర్నుండి తాతయ్యతో వచ్చారు. తాతయ్య నా తలమీద ఆప్యాయంగా చెయ్యి వెయ్యగానే, ఆ చేతిని పట్టుకుని చెంపకి ఆన్చుకున్నాను.

 

    మళ్ళీ తాతయ్యని చూడలేనేమో అనుకున్నాను. ఆయన అలా దగ్గరగా వుంటే ఎంతో ఉపశాంతిగా అనిపించింది.

 

    "చైతన్య నీ కోసం ఇది పంపించాడు..." అంటూ అమ్మ ఒక ప్యాకెట్ ఇచ్చింది. "ఏవిటి? తన పెళ్ళి లడ్డూలా?" నవ్వుతూనే తీసుకున్నాను.

 

    ప్యాకెట్ ఓపెన్ చేస్తే లోపల అటుకుల గొలుసు! చిన్న ఉత్తరం... 'ఆముక్తా... నిన్ను ముట్టుకుని నీ మెడలో మూడు ముళ్ళూ ఎలాగూ వెయ్యలేకపోయాను. కనీసం నేను పంపిస్తున్న ఈ గొలుసునైనా నీ మెడని తాకే అదృష్టాన్ని ఇవ్వు!...చైతన్య'

 

    అప్రయత్నంగా గొలుసు మెడలో వేసుకున్నాను. నన్ను తాకే అవకాశం వచ్చినా, నేను ఇచ్చినా కూడా తాకని ఏకైక వ్యక్తి... పల్లెటూరివాడు. చదువురానివాడు, ఛాందసుడు...ఇవన్ని తప్పు!

 

    గొప్ప హృదయ సంస్కారం కలవాడు. జీవితాన్ని చదివిన జ్ఞాని! వ్యక్తిత్వంలో హిమాలయ ఎత్తుకి ఎదిగినవాడు. నాకెంతో ఇష్టమైనవాడు!

 

    చిన్నప్పుడు పరిచయం అయిన 'చీపిరి తలవాడు' 'ఐ లైక్ యూ బావా!" అనుకున్నాను.

 

    లిల్లీ పెళ్ళికి అమ్మా, నాన్నలని తీసుకుని బయలుదేరాను. అప్పటికే విక్కీ కారు తీసుకొచ్చి గుమ్మంలో రెడీగా వున్నాడు.

 

    "అందరి పెళ్ళిళ్ళూ అయిపోతున్నాయి" అమ్మ స్వగతంగా అంటోంది.

 

    "పెళ్ళివారు నెలలోగా కబురుచేస్తాం అన్నారు...ఇవాళో రేపో శుభవార్త వస్తుంది. మన ఇంట్లోనూ అవుతుంది పెళ్ళి!" నాన్న ఊరడించారు.

 

    "ఈ చీరలో నువ్వు చాలా బావున్నావు!" విక్కీ మెచ్చుకున్నాడు.

 

    "థాంక్యూ...లాభం లేదని తెల్సినా మెచ్చుకుంటూనే వున్నావే!" జోక్ చేశాను.

 

    "యూ నాటీ!" అని కొట్టబోయి ఆగిపోయాడు.

 

    అమ్మా, నాన్నా వచ్చి కారు ఎక్కారు.

 

    నేను విక్కి పక్కన కూర్చున్నాను.

 

    "విక్కీ...పెళ్ళికొడుకు వచ్చాడా? నువ్వు చూశావా? ఎలా వున్నాడూ?" ఆతృతగా ప్రశ్నలు వేశాను.

 

    "తినబోతూ రుచులెందుకే అడగడం?" అమ్మ నవ్వింది.

 

    "ప్రాణ స్నేహితురాలి కాబోయే భర్త ఎలా వుంటాడో అని ఉత్సుకత!" నాన్న నవ్వారు.

 

    విక్కీ కూడా నవ్వి "ఇంకా నేనూ చూడలేదు. డైరెక్ట్ గా రిజిస్ట్రార్ ఆఫీసుకి వస్తానన్నాడట!" అన్నాడు.

 

    రిజిస్ట్రార్ ఆఫీసు ముందు లిల్లీ ఆకుపచ్చ పట్టుచీరలో, జడ వేసుకుని, పూలు పెట్టుకుని, కళ్యాణ తిలకంతో కళకళలాడుతూ కనిపించింది. కారు దగ్గరకి వచ్చి అమ్మకీ, నాన్నకీ కాళ్ళకి నమస్కారం చేసింది.

 

    "దీర్ఘ సుమంగళీభవ!" అని వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించారు.

 

    నా కళ్ళు ఆతృతగా పెళ్ళికొడుకు కొరకు చుట్టుపక్కలంతా వెదుకుతూనే వున్నాయి.

 

    లిల్లీ వాళ్ళ అమ్మనీ, తమ్ముడ్నీ పరిచయం చేసింది. లిల్లీ వాళ్ళ అమ్మతో అమ్మ పాత జ్ఞాపకాలని తవ్వుకోడంలో మునిగిపోయింది.

 

    "టైం అవుతోంది ఇంకా రాలేదేమిటి? ఒకసారి ఫోన్ చెయ్యి" వాళ్ళ తమ్ముడు కంగారుపడుతూ అన్నాడు.

 

    లిల్లీ సెల్ ఫోన్ తీసి డైల్ చేసి-

 

    "హలో బాస్! టైం అవుతోంది నువ్వు వస్తావా...వేరే ఇంకెవరితోటైనా కానివ్వమంటావా?" అని అడిగింది.

 

    దాని అల్లరికి నేను నవ్వేశాను.

 

    "ఏవిటా మాటలు? అబ్బాయి ఏం అన్నాడూ?" వాళ్ళ అమ్మ మందలింపుగా అడిగింది.

 

    "సందు చివరే వున్నాడట. ఎవరినీ చూసుకోవద్దని లబలబ లాడాడు!" లిల్లీ నవ్వుతూ అంది.

 

    "అదిగో...లారొచ్చేసింది" వాళ్ళ తమ్ముడు టై సర్దుకుంటూ, బావగారిని రిసీవ్ చేసుకోడానికి ఎదురెళ్ళాడు.

 

    విక్కీ టేప్ రికార్డర్ లో మంగళ వాద్యాల కేసెట్ ఆన్ చేశాడు.

 

    పురోహితుడికన్నా ఎక్కువగా రిజిస్ట్రార్... "త్వరగా రమ్మనండి... త్వరగా లేకపోతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది" అని కంగారు పెట్టాడు.

 

    అతను కారు దిగి, వెనక డోర్ తీశాడు. వెనకాల సీట్లో నుండి ఒక ముసలావిడా, లిల్లీ వాళ్ళ నాన్న దిగారు.

 

    లిల్లీ తల్లి ఆనందంగా "ఏవండీ...వచ్చారా..." అంటూ ఎదురెళ్ళింది.

 

    ఆయన ఆశ్చర్యంగా "ఏవిటీ? బోస్... పెళ్ళికూతురెవరూ?" అని అడిగాడు.

 

    "నేనే...మీరు పెళ్ళికొడుకు తరఫున వచ్చినట్లున్నారూ!" వ్యంగ్యంగా అంది లిల్లీ.