"నన్ను బెదిరించాలని వాడ్ని తోడు బెట్టుకొని వచ్చావా? ఇప్పుడేమింది మిస్టర్ పిల్లిగడ్డం?" పీటర్ ఉలిక్కిపడి మాటలు వినిపించిన వేపు చూశాడు. అక్కడ సామంత్ నవ్వుతూ కనిపించాడు.

 

    పరిస్థితులంత త్వరత్వరగా అడ్డం తిరుగుతాయని ఊహించని పీటర్ ఓ క్షణం అయోమయంగా సామంత్ కేసి చూశాడు.

 

    "వాడే అరెస్ట్ అయి వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాడు డి.ఐ.జి.గారి ఇంట్లో పట్టపగలు, పబ్లిగ్గా దొంగతనం చేసినందుకు..."

 

    మరోసారి షాక్ తిన్నాడు పీటర్.

 

    ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వస్తున్న ఆహ్వానితులు బేడీలతో వెళ్తున్న నరసింహం కేసి ఆశ్చర్యంగా చూశారు.

 

    నరసింహానికి తల కొట్టేసినట్లయింది.

 

    "మర్యాదగా సాయంత్రానికి నేనడిగిన పదిలక్షలు ఇచ్చి కనకారావును పంపించండి. లేదంటే నరసింహానికి పట్టిన గతే మీకు పడుతుంది. నామీద అన్యాయంగా పోలీస్ స్టేషన్ లో ప్రయోగం చేసినందుకే వాడికా గతి పట్టింది. అది గుర్తుంచుకొని డబ్బు పంపించండి" సామంత్ ఆ మాటలంటూనే జనంలో కలిసిపోయాడు.

 

    పీటర్ శ్రీలంక పౌరుడిలా వుండుండి భయపడిపోయాడు.

 

    'నామీద అన్యాయంగా పోలీస్ స్టేషన్ లో ప్రయోగం చేసినందుకే ఆ గతి పట్టించాను' అంటే సామంత్ పన్నిన వలలో చిక్కుకున్నాడా నరసింహం..." ఆ ఆలోచన రాగానే వడివడిగా అక్కడి నుంచి తప్పుకున్నాడు.

 

    "ఏమయింది...?"

 

    "మనం అనుకున్న చేప వలలో పడింది. ఇంక బ్రహ్మదేవుడు కూడా వాడ్ని రక్షించలేడు" అన్నాడు సామంత్ లిఫ్ట్ కేసి నడుస్తూ.

 

    "నరసింహం మనమీద పగబడితే? ఐమీన్ అతన్ని ఇరికించింది మనమే అని అతనికి తెలిస్తే?" మధుమతి సామంత్ ని ఫాలో అవుతూ అంది.

 

    "మనమే అని వాడికి తెలియాలి. ఇంకా ఇప్పటి వరకు తెలీదు. మరో అరగంటకు తెలుస్తుంది. అప్పుడు నీగురించి చెబుతాడు. సాక్ష్యాధారాల ననుసరించి పోలీసులు నిన్ను అనుమానించలేరు. అసలు నిన్నా చుట్టుప్రక్కల ఎవరూ చూడలేదు"

 

    "నువ్వు అసాధ్యుడివి సామంత్... ఒక పోలీస్ ఎస్.ఐ.ని దొంగను చేసి ఆ పోలీసులచేతే అరెస్టు చేయించావ్" చిర్నవ్వుతో అంది మధుమతి సామంత్ ని అందుకునే ప్రయత్నం చేస్తూ.


                               *    *    *    *


    "అసలేమైంది? ఎందుకు నరసింహం అరెస్టు చేయబడ్డాడో వెంటనే తెలుసుకోవాలి. నరసింహాన్ని దెబ్బ కొట్టింది సామంతే అయితే మనం చచ్చినట్టు అతనడిగిన పదిలక్షలు పంపించవలసిందే. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎంక్వయిరీ చేసుకురా" ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు పీటర్.

 

    సామంత్ ని తలుచుకుని తొలిసారి బాగా భయపడ్డాడు కనకారావు.


                                *    *    *    *


    పెళ్ళి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అర్జునరావు ఆధ్వర్యంలో.

 

    నాగమ్మ దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తోంది.

 

    అర్జున్ రావు పథకంలో భాగంగానే కృష్ణ ఓబెరాయ్ హోటల్ కాన్ఫరెన్స్ హాలుని వివాహవేదికగా సెటిల్ చేశాడు సెక్రటరీ.

 

    మరోప్రక్క నాయకి అమెరికాలో వున్న తన ఫ్రెండ్స్ ని తన మ్యారేజ్ కి అటెండ్ కమ్మని ఫోన్ చేసి చెప్పింది.

 

    క్రీస్టినీ, మాంటే, రాబర్ట్ క్రీస్టినీ హడావిడిగా వీసాలకోసం ఇండియా ఎంబసీకి బయలుదేరారు.


                                                       *    *    *    *


    నరసింహం లాకప్ లోకి నెట్టబడ్డాడు.

 

    తను పనిచేసిన పోలీస్ స్టేషన్ లోనే దోషిగా నిలబెట్టబడ్డాడు.

 

    కానిస్టేబుల్ సత్యం లాకప్ లో చిందులు తొక్కుతున్న నరసింహాన్ని చూసి వేదాంత ధోరణిలో నవ్వాడు.

 

    "నేను దొంగతనం చేయలేదు" నరసింహం ఆ మాటని అప్పటికి ఓ వందసార్లు అన్నాడు.

 

    సాక్ష్యాధారాలు బలంగా వుండడంతో ఎవరూ నమ్మలేదు.

 

    డి.ఐ.జి. ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి నరసింహాన్ని గుర్తుపట్టేసి వెళ్ళారు.

 

    డి.ఐ.జి. జరిగింది తెలుసుకుని ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆఘమేఘాల మీద నరసింహాన్ని బంధించి స్టేషనుకి బయలుదేరాడు.

 

    సి.ఐ. డి.ఐ.జి. కోపాన్ని తలుచుకొని వణికిపోతున్నాడు.

 

    మరో పావుగంటకు స్టేషనులో కాలుపెట్టిన డి.ఐ.జి.కి ఫోను వచ్చింది.

 

    సి.ఐ. భయపడుతూనే ఆ సంగతి చెప్పాడు. డి.ఐ.జి. తనను తాను తమాయించుకుంటూ ఫోనందుకున్నాడు.

 

    "డి.ఐ.జి.గారేనా?"

 

    "అవును"

 

    "దొంగతనం మీ డిపార్ట్ మెంట్ వ్యక్తులు చేస్తే శిక్షలో ముదరా ఏమన్నా వుంటుందా?"

 

    "వాడ్డూయూ మీన్...? వాడ్నిప్పుడే సస్పెండ్ చేస్తున్నాను"

 

    "శెభాష్... ఇంతకీ మీ ఫర్నిచర్ అమ్మగా వచ్చిన డబ్బును రికవర్ చేసుకున్నారా? యాభై రెండువేలు వచ్చాయి. అందులో యిప్పటికి ఎంత ఖర్చు చేశాడో మీరు నాలుగు తగిలిస్తే చెబుతాడు."

 

    "వాడు చెబుతాడు- నాలుగు తగిలిస్తే వాడి బాబయినా దిగొచ్చి చెబుతాడు"

 

    "మరి మీ ఫోన్ బిల్లు...?"

 

    "ఫోన్ బిల్లేమిటి?"

 

    "మీ ఎస్.టి.డి ఫోన్ తో ఆటలాడుకున్నాడు. వాళ్ళ అత్తగారి ఊరయిన అత్తిలికి ట్రంకాల్ చేసి అరగంట, వాళ్ళ సొంత ఊరయిన అమలాపురానికి చేసి అరగంట మాట్లాడాడు. బహుశా మీ ఫోన్ బిల్లు ఈసారి పదివేలు దాటవచ్చు. అవన్నీ అలా వుంచి మీ ఇంట్లో హాయిగా మందు కొట్టాడు. మరి ఏవేవో చేశాడు. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. మీ పరువు ప్రతిష్టలతో ఫుట్ బాల్ ఆడేసుకున్నాడు. ఇదే బయటవాడయితే ఎలా శిక్షిస్తారో అలాగే అతడ్నీ శిక్షిస్తారని ఆశిస్తాను" ఫోన్ కి ఆవేపున వున్న సామంత్ ఫోన్ ని డిస్కనెక్టు చేసేశాడు.

 

    కోపంతో డి.ఐ.జి. ఊగిపోతున్నాడు.

 

    తీరని అవమానం అతని అణువణువుని దహించి వేస్తోంది. శివ తాండవానికి సిద్ధమవుతున్న అపరశివుడిలా వున్నాడు డి.ఐ.జి.

 

    "వాడెక్కడా...?" ఉరుములా వచ్చిందా ప్రశ్న డి.ఐ.జి. నోటి వెంట.

 

    సి.ఐ. వణికిపోతూ నరసింహం వున్న లాకప్ కేసి చూపుల్ని మరల్చాడు.