సుడిగాలి వీచినట్లుగావున్న యీ ప్రశ్నకు ఆమెలోని నరనరమూ వొణికింది. సర్వశక్తీ కూడదీసుకుని గట్టిగా "తెలీదు -తెలీదు" అని అరుద్దామనుకుంది. కాని ఆమె గొంతు మూగపోయినట్లయింది. కంఠాన్ని ఎవరో నొక్కినట్లయి మాట రాలేదు.

 

    "చెప్పు వేదితా! నీకు ప్రేమంటే తెలీదూ? నువ్వు కరుడుగట్టిన బండరాయివా?"

 

    "ప్రేమ! నేను సమస్త జీవరాసుల్నీ, ప్రకృతినీ, ఈ భూమినీ, గాలినీ, వెలుతురునీ, చీకటినీ, సమానంగా ప్రేమిస్తాను " అని చెబుదామనుకుంది ఆమె. కాని యీనాడు ఏదో దెయ్యం ఆవహించినట్లయి, వంటిమీదా, హృదయంమీదా యెన్నో రంగులు చల్లినట్లయి, యిన్నాళ్లూ తను యినుప తలుపులతో మూసివుంచిన చిట్టచివరి హృదయ కవాటం తెరచుకుని, నెమళ్ళు పురివిప్పి ఆడినట్లు, వర్షానికి భూమి తడిసి కమ్మని వాసనలు వెదజల్లినట్లు పులకితురాలై నిలబడిపోయింది. ఆమెలో ఇన్నాళ్ళూ నిద్రపోతూన్న మరో వేదిత చిరునవ్వు ముఖంలో సజీవమైన కళతో లేచి వచ్చినట్లయింది. ఓ మృదుసుగంధం వీచి, విచిత్రమైన మైకం క్రమ్మివేసినట్లయింది.

 

    వేదితా! బదులు చెప్పు వేదితా! నువ్వు నన్ను ప్రేమించ లేదూ?"

 

    "నిన్ను.... నిన్ను.... నా ప్రాణాధికంగా ప్రేమించాను కల్యాణ మూర్తీ! నేను నిజం చెప్పివేస్తున్నాను ఈనాడు. చిన్ననాటినుంచీ నీ వంటే నాకెంతో అభిమానం, మమకారం, తియ్యదనం ఉన్నాయి. పెళ్ళయి, పెనిమిటితో కాపురం చేస్తూ కూడా నిన్నెడతెగకుండా మనసులో ఆరాధించాను. కల్యాణ్! నా కల్యాణ్! మళ్ళీ ఎందుకు నాకు కనిపించి నాలో తుఫాను లేవదీస్తున్నావు? అబ్బ, ఈ ఉద్వేగాన్ని భరించలేకుండా ఉన్నాను." చీకటిలో తన రూపాన్ని మరుగుపరుచుకున్న వేదిత మైకంలో స్వప్నావస్థలో మాట్లాడినట్లు, ఏదో లోకాలనుండి అన్నట్లు మాట్లాడుతోంది.

 

    "వేదితా! ఎక్కడ ఉన్నావు నువ్వు?"

 

    "ఇక్కడే, నీకు చేరువలోనే ఉన్నాను. కాని దయవుంచి నా దగ్గరకు రాకు కళ్యాణ్! అక్కడే వుండు. అక్కడే కబుర్లు చెప్పు.

 

    "రాను వేదితా! నీకు కష్టం కలుగజేసేపని యెన్నడూ చెయ్యను."

 

    "అబ్బ! మాట్లాడు కళ్యాణ్! నాకు తృప్తి, ఉపశాంతీ కలిగిస్తూన్న నీ తియ్యని కబుర్లని అలాగే కొనసాగించు. ఇంకా వినాలని వుంది నాకు. నీ మాటలు ఇంకా యింకా చెప్పు. ఎట్లా వేధించావు నన్ను ఇన్నాళ్ళూ! ఎంత దుర్మార్గుడివి నువ్వు కళ్యాణ్?"

 

    "వేదితా! నాలో ఓ మహాసముద్రం ఉప్పొంగిపోతున్నది. నీ కోసమే ఇన్నాళ్ళూ నేను బ్రతికాను. నీ తలంపులతో నిండిపోయే పెళ్ళి చేసుకోలేదు నేను నువ్వు కావాలని యెంత బలవత్తరమైన కోరికలతో బాధపడ్డానో తెలుసా? వేదితా! నీ తండ్రి కఠినుడు, కపటి. అందుకనే మాయామర్మం యెరుగని నిన్ను యెప్పటికైనా ఉపద్రవం ముంచుకు వస్తుందని కఠినవ్రతం చేపట్టించాడు. ఆ మాయలోపడి నువ్వు అల్లాడిపోతున్నావు. ఆభమూ శుభమూ తెలియని అమాయకురాలివి నువ్వు. నీ అలజడి నీ తండ్రి గ్రహించినా, బయటపడితే తనే చేజేతులా నిన్ను వక్రమార్గాన పట్టించినట్లుంటుందని ఏమీ తెలియని నంగనాచిలా వూరుకున్నాడు. ఆయనతో రెండు మూడు రోజులు మాట్లాడగానే విషయం నాకు బోధపడిపోయింది. ఈ నాటకానికి సూత్రధారి అతను. నటివి నువ్వు. నీ ఆరాధ్యదైవం నీ వేణుగోపాలుడు.... నీ మధ్య, నేనూ ఆస్తికుడినే. నాకూ భగవంతుడిలో నమ్మకముంది. కాని భగవంతుడు తన భక్తులను తమ జీవితాలని నిస్సారం చేసుకుని, శాస్త్రాలను మూర్ఖంగా నమ్ముకుని, తనను గ్రుడ్డిగా ఆరాధించమని యెన్నడూ చెప్పడు."

 

    "ఉండు. అలా మాట్లాడకు కళ్యాణ్ దయవుంచి" అంది వేదిత కాస్త తెలివి తెచ్చుకుని. "భగవంతుడు అందరి భక్తులనూ అట్లా నిర్ధేశించక పోవచ్చు. కాని నాయందు అతని కృపావీక్షణాలు ప్రసరించి నన్ను ధన్యురాల్ని చేయటం కోసం నియమించి ఉండవచ్చు. ఈ అదృష్టం అందరికీ లభించదుగా. అందరి గమ్యాలూ ఒకటిగా వుంటే లోకంలో ఇందరు విశిష్ట వ్యక్తులు, త్యాగమూర్తుల అవతరణ ఎలా జరిగి వుంటుందంటావు కళ్యాణ్? ఎక్కడో ఒక చోటనైనా ఏ ఒక్కరో త్యాగానికి పూనుకోలేకపోతే, అందరూ యీ ప్రలోభానికి దాసులే అయితే యీసృష్టి ఎప్పుడో నిలిచిపోయి ఉండేది. ఒకవేళవున్నా దాని స్వరూపం వేరు విధంగా ఉండేది."

 

    "ఉండవచ్చు త్యాగమూర్తులు. కాని త్యాగం స్వతఃసిద్ధంగా ఉండాలి గాని, పరుల కల్పితంగా ఉండరాదు. మన త్యాగం పరులకు ఉపకారమూ చేయక మనమే దహిస్తూ ఉన్నప్పుడు యెందుకు వాటి ఉనికి వేదితా!"

 

    వేదిత బదులు చెప్పలేదు. ఆమెలోంచి ఒక క్షణం పాత మనిషీ, మరో క్షణం కొత్త మనిషీ మాట్లాడుతున్నారు. ఒకరినొకరు జయించాలని చూస్తున్నారు.

 

    "అసలెందుకీ వాదులాట అంతా! నీదారిన నువ్వు వెళ్లిపోతే, నా దార్ని నేను యిలా బ్రతికితే ఏం జరుగుతుంది? అంతా సవ్యంగా ఉంటుంది ఏం?" అందామనుకుంది పాత వేదిత.

 

    "నువ్వు వెళ్లిపోతే నీ మనోహరమైన స్మృతులు, సరళమైన నీ వలపులు నన్ను బ్రతకనిస్తాయా?" అందామనుకుంది కొత్త వేదిత.

 

    "అసలు నా జీవితంలో యింత జోక్యమెందుకు మీకు? యెందుకిలా సిద్ధాంతాలూ, నినాదాలూ లేవదీస్తారు?" అందామనుకుంది పాత వేదిత.

 

    "సమయం మించిపోకముందు నన్నిలా వేధిస్తే యెంత బాగుండేది?" అందామనుకుంది కొత్త వేదిత.

 

    "నాతో చెలగాటమాడి యెంత అపాయకరమైన పరిస్థితులకు నువ్వు దారితీస్తున్నావో తెలుసునా? అందుకే శాసిస్తున్నాను. వెళ్ళిపో యిక్కడ్నించి" అందామనుకుంది పాత వేదిత.

 

    "నిన్ను అభ్యర్థిస్తున్నాను. నన్నిలా నిర్ధయగా విడిచి వెళ్ళిపోతే యెలా జరుగుతుంది నాకు భవిష్యత్తు? అందమైన కల చెరిగిపోదూ? చెరిపేస్తావా? కల చెరిపేస్తావా?"

 

    "అబ్బ! నీ వాదం చాలుగాని వెళ్ళిపో."

 

    "వెళ్ళకు వెళ్ళకు కళ్యాణ్ నన్ను విడిచి."