తను తీసుకున్న ఆగంతకుడి వజ్రాలకి మాస్టర్ చావు రూపంలో సమాధానం చెప్పి తీరాలి అని మనస్సులో దృఢంగా అనుకుంటూ పరిసరాల్ని జాగరూకతతో గమనించసాగాడు జోహ్రా.
    
                                                *    *    *    *    *
    
    సూట్ నెంబర్ 1001లో ఉన్న హాన్ బ్రదర్స్ గదిలోంచి ఒక వ్యక్తి ఆందోళనగ సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో బయటకు రావటం, షరీఫ్ పార్టీకి వెళ్తామని చెప్పిన హాన్ బ్రదర్స్ వెళ్ళకపోవటం- కనీసం ఏమీ ఆర్డర్ యివ్వకపోవటంతో ఆ ఫ్లోర్ స్టీవార్డ్ కి అనుమానం వచ్చి వడివడిగా ఆపరేటరు రూమ్ కి వెళ్ళి 1001 కి కనెక్షన్ యివ్వమని చెప్పి ఫోన్ అందుకున్నాడు. ఆవేపు నుంచి ఎంతకీ రిప్లయి లేకపోవటంతో అనుమానం మరింత బలపడింది దాంతో యింకేమాత్రం ఆలస్యం చేయకుండా మేనేజరుని కలిసి విషయం చెప్పాడు.
    
    మేనేజరు వెంటనే దగ్గర్లో వున్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్స్ ని పంపించమని చెప్పటంతో విషయం ఒకింత సీరియస్ అయిపోయింది.
    
                                                *    *    *    *    *
    
    సరీగ్గా ఎనిమిదిగంటలకు మిల్లర్ జుహు జూబ్లీ గార్డెన్స్ ముందు కారు దిగాడు.
    
    మిల్లర్ ని చూసిన సిద్దేశ్వర్ ఓబరాయ్ పెదవుల మీద చిరునవ్వు ఓ క్షణకాలం మెరిసి అదృశ్యమైంది.    

    ప్రక్కనున్న ఐనాందార్ కి అతనే మిల్లర్ అని వేలుపెట్టి చూపించాడు సిద్దేశ్వర్ ఓబరాయ్.
    
    "నాకంతా గందరగోళంగానూ, అయోమయంగానూ ఉంది. మిల్లరే స్వయంగా మాస్టర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించటానికి వచ్చాడంటే పరిస్థితి మనం ఊహిస్తున్న దానికంటే సీరియస్ అని అర్ధమవుతోంది 'జె' ఖచ్చితంగా వస్తాడు..." ఐనాందార్ సాలోచనగా అన్నాడు.
    
    "వస్తాడు కాదు వచ్చేసి ఉంటాడు" తాపీగా అన్నాడు సిద్దేశ్వర్ ఓబరాయ్.
    
    ఐనాందార్ ఉలిక్కిపడ్డాడు.
    
    "ఎస్.... ఏదో ఒక రకంగా అతను రాగలడు. ఎఫ్.బి ఐనే ఏమారుస్తూ వస్తూన్న 'జె'కి ఈ పార్టీలోకి ఎంటరయి పోవటం పెద్ద లెక్కలోనిచి కాదు."
    
    "మనమేమీ చేయలేమా....?" ఐనాందార్ ఆందోళనగా అడిగాడు.
    
    "జె మాస్టర్ ని అసాసినేట్ చేసే ప్రయత్నంలో ఉండగా తప్ప మనం అతన్ని కేచ్ చేయలేం. ఇక్కడకొచ్చిన అందరూ పెద్దవాళ్ళే మన ఆఫీసు పాస్ లేకుండా పిట్టను కూడా లోపలకు వదలవద్దని చెప్పినా అతను వస్తాడు. ఎవరి పాస్ నో కొట్టేసి అతని రూపంలోకి తన మేకప్ టెక్నిక్ ద్వారా మారిపోయి వస్తాడు. ఒకవేళ ఇప్పుడు మనం ఎవరినన్నా అనుమానించినా, వార్ని కస్టడీలోకి తీసుకున్నా అతను 'జె' కాకపోతే మన పరిస్థితి ఏమిటి? ఐదువేలమంది వి.ఐ.పి.లున్నారిక్కడ ఎవర్ని అనుమానించినా ప్రమాదమే. ఈ పార్టీకొచ్చిన ప్రముఖుల్లో సి.ఎమ్., హోంమినిష్టర్ మిగతా కేబినెట్ మినిష్టర్, కొందరు సెంట్రల్ మినిష్టర్సు, హోం సెక్రటరీ, ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. మనం ఏ పొరపాటు చేసినా పార్టీ రసాభాసయిపోతుంది. దాంతో మనపై అధికారుల్ని మనల్ని చార్చ్ చేయటం ఖాయం.
        
    జేది చెలగాటం...
    
    మనది ప్రాణ సంకటం....ఏది ఏమైనా మన జాగ్రత్తల్లో మనముండాలి. పాస్ లేకుండా ఎవర్నీ వదలలేదుగా?"
    
    "సమస్యే లేదు పాస్ ని, పాస్ లోని అతిధి ఫోటోని, ఆ ఫోటో మీద ఉండే మన ఆఫీస్ సీల్ ని మీ సంతకాన్ని చూడందే ఎవర్నీ లోపలకు రానివ్వటం లేదు." కాన్ఫిడెంట్ గా అన్నాడు ఐనాందర్.
    
    "వీడియో కంట్రోలింగ్ రూమ్ కి వెళతాన్నేను. మీరు ఈ చుట్టు ప్రక్కల చూస్తుండండి" అంటూ సిద్దేశ్వర్ ఓబరాయ్ అటుకేసి సాగిపోయాడు.
    
    అనుమానమున్న ప్రదేశంలో నియమించిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ని వైర్ లెస్ లో కాంటాక్టు చేస్తూ "ఎనీథింగ్ రాంగ్" అని అడగడం మొదలెట్టాడు ఐనాందార్.
    
    "నథింగ్ సార్.... ఎవ్రీథింగ్ ఓకే సార్" అనే సమాధానాలొస్తున్నాయి.
    
    సిద్దేశ్వర్ ఓబరాయ్ వీడియో సెట్స్ ముందు కూర్చున్నాడు.
    
    అతిధులు, వారి మూమెంట్సు స్పష్టంగా టీవీ సెట్సులో కనిపిస్తున్నాయి. అంతా స్మూత్ గా వెళుతోంది. వెంటనే వైర్ లెస్ ఆన్ చేసి మాస్టర్ ఉండే ప్రాంతాన్ని కవర్ చేస్తున్న కెమేరా మెన్ ని లైన్ లోకి పిలిచాడు.
    
    "మాస్టర్ మీద, మిల్లర్ మీద ఎక్కువగా కెమేరాని కేంద్రీకరించు. హండ్రెడ్ ఫీట్ రేడియస్ ని కవర్ చేయాలి. ముఖ్యంగా మిల్లర్ మొఖం మీద ఎక్కువ కాన్ సంట్రేట్ చెయ్" అని ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి వైర్ లెస్ సెట్ ని ఆఫ్ చేసాడు ఓబరాయ్.
    
    మిల్లర్ చూపులు డేగకళ్ళలా శతృవుని కనిపెట్టేందుకు చలిస్తుంటాయి. అతను ఖచ్చితంగా 'జె' కోసం వెతుకుతుంటాడు. అతని చూపులు ఎవరిమీద పడతాయో అతన్ని పరిశీలిస్తే సరిపోతుందని ఓబరాయ్ ఉద్దేశం.
    
    ఇదిలా వుండగా మిల్లర్ ని ఎప్పుడూ చూసి ఉండని జోహ్రా అదునుకోసం కాచుకొని ఉన్నాడు. అతనికి తెలుసు ఆ ప్రాంతమంతా పోలీసులు మఫ్టీలో తారట్లాడుతున్నారని- అతనికి తెలుసు ఆ ప్రాంతంలోని ప్రతి అంగుళాన్ని వీడియో కెమేరాలు కవర్ చేస్తాయని. కాని తనకి చిరాకు కలిగిస్తున్న విషయమొక్కటే మాస్టర్ చుట్టూ మూగుతున్న అతిధులు. ఒకళ్ళు వదిలితే ఒకళ్ళు కంటిన్యూగా ఎవరో ఒకరు మాస్టర్ ని కలిసి మాట్లాడేందుకు షేక్ హేండ్స్ ఇచ్చి విష్ చేసేందుకు ఆరాటపడి తనకు నిరాశను కలిగిస్తున్నారు.
    
                                                   *    *    *    *    *
    
    మరో పదినిమిషాలకే ఇద్దరు కానిస్టేబుల్స్ హాన్ బ్రదర్స్ దిగిన హోటల్ కేసి హడావిడిగా బయలుదేరారు.
    
                                                     *    *    *    *    *
    
    గిరిధర్ గోమాంగ్ పేరు మీద ఖలీల్ జోహ్రాకి ఒక పాస్ పోర్టుని రడీ చేసి బొంబాయి టూ సింగపూర్ ఫ్లయిట్ టిక్కెట్ తీసి సిద్దంగా ఉంచాడు.
    
    జూన్ 21, మధ్యాహ్నం ఫ్లయిట్ కి జోహ్రా బొంబాయిని వదిలేయటం జరగాలి. అందుకే ఖలీల్ ఆ పనుల్లో నిమగ్నమయి ఉన్నాడు.
    
                                                     *    *    *    *    *
    
    జోహ్రా తన కుడిచేతిని సిద్దంగా ఉంచుకొని సమయం కోసం కాచుకొని ఉండగా, మాస్టర్ ని కమ్మేసిన అతిధులు పల్చబడుతుండగా మృదుల వచ్చేసింది. వస్తూనే తనచుట్టూ మూగుతున్న వార్ని తప్పించుకుంటూ, తనకు కావల్సిన మాస్టర్ ని చేరుకొంది.
    
    మృదులను చూస్తూనే ప్రణవ ఒకింత తడబాటుకి గురయ్యాడు.
    
    అవకాశం వచ్చినట్లే వచ్చి, చేజారిపోవటంతో జోహ్రాలో ఇరిటేషన్ పెరిగిపోయింది.