ఆ ప్రశ్నకు వెంటనే జవాబు దొరకలేదు.

 

    "బర్త్ డే పార్టీ లేదా? నవ్వుతూ అడుగుతున్న అతడివైపు అయోమయంగా చూసిందామె.

 

    "పార్టీ కోసమే నిన్నిక్కడకు తీసికొచ్చాను. నాకోసం... నువ్వేమైనా చేస్తావా?" కప్ బోర్డువైపు నడుస్తూ అంది.

 

    "టెస్టింగా? చెప్పు... ఏం చెయ్యమంటావ్?" సీరియస్ గా అడిగాడు అతను.

 

    ఒక్కక్షణం అతని కళ్ళల్లోకి చూసింది నిశాంత.

 

    "ఈ రాత్రంతా... ఒంటరిగా... యీ గెస్ట్ హౌస్ లో వుండాలి" కప్ బోర్డులోని విస్కీబాటిల్స్ తీసి గ్లాసు టీపాయ్ మీద పెడుతూ అంది నిశాంత.

 

    "ఎందుకు?" వెంటనే సిద్ధార్ధ నోటినుంచి వచ్చిందా ప్రశ్న.

 

    నిశాంత కోసం తను వుండగలడు కానీ... తను ప్యాలెస్ లో లేని విషయం బయటపడితే... సెక్యూరిటీ స్టాఫ్ కి, అనంతమూర్తికి ఆ విషయం తెలిస్తే... అతడి కళ్ళ వెనక తొంగిచూస్తున్న కనబడని భయం.

 

    "నో క్వశ్చన్... వుంటావా... లేదా?" బ్యాగ్ లోంచి త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్స్ తీసి టేబుల్ మీద పెడుతూ అడిగింది నిశాంత.

 

    "రాత్రంతా అఖ్ఖర్లేదు నాలుగు, అయిదు గంతలావ్వరకూ" మళ్ళీ చెప్పింది.

 

    గ్లాసు నిండా విస్కీని నింపి, మిగతా బాటిల్స్ లోని విస్కీని సింక్ లో పారబోసింది. ఆ ఖాళీ బాటిల్స్ ను గెస్ట్ హౌస్ వెనక పొదల్లోంచి విసిరేసింది.

 

    "ఏమిటిదంతా? గమ్మత్తుగా వుందే పార్టీ."

 

    మరో అరగంట గడిచింది. చేతి వాచీవైపు చూసింది నిశాంత.

 

    "సరిగ్గా నాలుగు గంటలకు టాక్సీ వస్తుంది. నిన్నెవరూ డిస్ట్రబ్ చెయ్యరు సిద్ధార్ధా! రేపు కలుద్దాం... గుడ్ నైట్" చెప్పింది నిశాంత.

 

    "ఏమిటిదంతా... నువ్వెళ్ళిపోతున్నావా" నిశాంత ప్రతి చర్యా, ప్రతి మాటా విచిత్రంగా వుంది అతడికి.

 

    "ఈ ఒక్కరోజూ నా కోసం... బుద్ధిగా ఇక్కడుండు సిద్ధార్ధా!" అల్లరిగా అతని ముక్కుమీద గిల్లి గెస్ట్ హౌస్ లోంచి బయటకొచ్చింది నిశాంత.

 

    మరో అయిదు నిమిషాల తర్వాత నిశాంత వ్యాన్ ముస్సోరీ రోడ్డు వైపు చీకట్లో ప్రయాణం చేసింది.

 

    అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారిగా నిశాంత గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.

 

    "ఎవరీమె?"

 

    విస్కీ గ్లాసుని చూస్తూ ఆలోచిస్తున్నాడు అతను.


                             *    *    *    *


    ముస్సోరీకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న యమునా బ్రిడ్జి నిశ్శబ్దంగా వుంది.

 

    ఆ బ్రిడ్జి చివర సిమెంటు అరుగు మీద ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు.

 

    ఆ ఇద్దరూ నిశాంత, సిద్ధార్ధ.    "నిశాంతా! ఇంతదూరం నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా?"

 

    "ఎందుకు?"

 

    "నువ్వు నవ్వనంటే చెప్తాను."

 

    "చెప్పు."

 

    "నాకు ఏ పనీ చేయాలనిపించడం లేదు. నా మీద నాకే చికాగ్గా వుంటోంది. రాత్రిళ్ళు నిద్రపట్టడంలేదు. నేను బ్రతుకుతున్న కృత్రిమ వాతావరణంలోంచి బయటపడి దూరంగా వెళ్ళిపోవాలనుంది. స్వేచ్చగా బ్రతకాలని వుంది."

 

    అతడి నోటి వెంబడి వస్తున్న ఆ మాటల్ని వింటూ అతని ముఖ కవళికల్ని గమనిస్తోంది నిశాంత.

 

    "స్వేచ్చగా అంటే?"

 

    "స్వేచ్చగా అంటే జాలీగా కాదు. నా జీవితాన్ని నేనే నిర్దేశించుకోవాలి. డబ్బు, హోదా, అధికారం ఇవేవీ నాకఖ్ఖర్లేదు. ఎవరి చేతుల్లోనూ బందీగా కాకుండా నీలా స్వతంత్రంగా."

 

    "నాలా స్వతంత్రంగానా?" ఆ మాటకు మనసులోనే నవ్వుకుంది నిశాంత.

 

    నేను  స్వతంత్రురాలీని కాదు మిత్రమా? నేను కూడా బందీనే. నువ్వు కనీసం నీ గురించి ఆలోచించుకునే  స్వేచ్చ వుంది. నాకా స్వేచ్చ కూడా లేదు. నా ఆలోచనలు కూడా నావి కావు. నా బ్రతుకు నాది కాదు. ఆమె మనసు నిశ్శబ్దంగా ఒక్కక్షణం బాధపడింది.

 

    "ఏం చెయ్యాలని" తేరుకుంటూ అడిగింది.

 

    "ఎక్కడికైనా వెళ్ళిపోతాను... దూరంగా. అందుకు నాక్కావల్సింది... నన్ను ఇన్ స్పైర్ చేసే ఒక మనసు" నిశాంత కనుగుడ్లలో కనిపిస్తున్న తన ప్రతిబింబంవైపు చూస్తున్నాడు అతను.   

 

    తన మనసులో మారుమూల గూడు కట్టుకుని వున్న గాఢమైన అనుభూతులకు అక్షర రూపకల్పన చేస్తున్నాడు అతను.

 

    "నేను అదృష్టవంతుడ్నో, దురదృష్టవంతుడ్నో నాకే తెలీడం లేదు నిశాంతా! నా బ్రతుకు గురించి నీకు తెలీదు. బంగారు పంజరంలో చిలకను నేను. నేను నేర్చుకొన్న చిలకపలుకులు... బిజినెస్... బిజినెస్... అంతే... అసలు నేనెవరో నీకు తెలుసా?" ఆవేశంగా అడిగాడు అతను.

 

    "అందమైన అమాయకమైన మనుషుల్ని ప్రేమించగలిగే సిద్దార్ధవు కాదా?" అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది నిశాంత.

 

    "మనుషుల్ని ప్రేమించగలిగే సిద్ధార్ధ... అవును... నిశాంతా! నాకు మనుషుల మధ్య ఒక మనిషిగా తిరగాలని వుంది. నాకు ఆత్మీయత కావాలి. నాకు ప్రేమ కావాలి. చెప్పు నిశాంతా? వాటిని నాకివ్వగలవా?"

 

    నీరెండలో కలగలిసిన యమునా నది మీద నుంచి వస్తున్న గాలి వెచ్చగా తగిలింది ఆమెకు.  

 

    "ఏంటాలోచిస్తున్నావ్ నిశాంతా? నేను నీ ప్రేమకు అర్హుడ్ని కానా? చెప్పు? నీ ప్రేమను నేను పొందాలంటే నన్ను నువ్వు ప్రేమించాలంటే ఏం చెయ్యాలో చెప్పు?"

 

    జాలిగా నవ్వింది ఆమె. తన జాలి తనకే అంతులేని అగాధంలా కనిపిస్తోంది. ఆ అగాధం చివర దేశ్ ముఖ్. ఆయన చేతిలో ఆయుధం తను.

 

    నిన్ను నాశనం చెయ్యడానికి వచ్చిన మృత్యువును. మృత్యువును నువ్వు ప్రేమిస్తున్నావ్ సిద్ధార్ధా...

 

    అతని చేతి స్పర్శతో చటుక్కున నిశాంత ఆలోచనలు తెగిపోయాయి.

 

    అతని చెయ్యి నెమ్మదిగా ఆమె నడుముని చుట్టుముట్టింది.

 

    ఆమెను గట్టిగా పట్టుకుని ఆమె ముఖాన్ని తనవైపు తిప్పుకుని ముందుకు వంగి కంఠం మధ్య భాగంలో, నుదుటిమీద, కనురెప్పలమీద ముద్దు పెట్టుకున్నాడు అతను.