అడవిలో అమ్మ..

ఎంబీబీఎస్ చదవని డాక్టర్... లక్ష్మి కుట్టి!

 

 

గొప్ప విజయాలు సాధించడానికి పెద్ద కుటుంబంలో పుట్టనక్కర్లేదు. గొప్ప బ్యాగ్రౌండ్ లో పెరగనక్కర్లేదు. గొప్ప గొప్ప చదువులు చదవనరక్కర్లేదు. ఆలోచన గొప్పగా ఉంటే చాలు. సంకల్పం గట్టిదైతే చాలు. లక్ష్మికుట్టిని చూస్తే ఎవరైనా ఈ విషయమే చెప్తారు. ఎందుకంటే ఆమె పెద్దగా చదువుకోలేదు. చెప్పుకోదగ్గ బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఈరోజు ఆమె గురించి చెప్పుకోడానికి మాత్రం చాలా ఉంది. 

 

 

    తిరువనంతపురం జిల్లాలోని కల్లార్ అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో... ఓ చిన్న గుడిసెలో నివసిస్తుంది డెబ్భై అయిదేళ్ల లక్ష్మి కుట్టి. మామూలుగా చూస్తే ఆమె కూడా అందరిలాంటిదే కదా అనిపిస్తుంది. కానీ ఆమె గురించి తెలుసుకుంటే మాత్రం అందరిలో ఒకరు కాదు, అందనంత ఎత్తులో ఉన్నది అనిపిస్తుంది. లక్ష్మి... ఎంబీబీఎస్ చదవని డాక్టర్. పట్టాలు పొందని మేధావి. ఎటువంటి వ్యాధి అయినా, ఎలాంటి నలతనైనా క్షణాల్లో మాయం చేసేయగలదామె. 


    లక్ష్మి కుట్టి ఇంటి చుట్టూ రకరకాల మొక్కలుంటాయి. వాటి ఆకులు, వేర్లతో దాదాపు ఐదు వందల రకాల వ్యాధులకి వైద్యం చేస్తుంది. ఇంతవరకూ ఆమె ట్రీట్మెంట్ ఫెయిలయ్యింది లేదు. ఉండేది అడవిలో కావడంతో పాము కాటేసినా, విష పురుగు కరిచినా ఆమె దగ్గరకే పరిగెత్తుకు వస్తారు. క్షణాల్లో ఆ విషాన్ని తీసి పారేస్తుంది లక్ష్మి. ఆమె వైద్యం చూస్తే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. 

 

    లక్ష్మికి ఈ మెళకువలన్నీ ఆమె తల్లి ద్వారా తెలిశాయి. వాటిని మరింత మెరుగు చేసి వీలైనంత మందికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది లక్ష్మి. మొదట లక్ష్మి వైద్యం అడవికే పరిమితమైపోయింది. కానీ కాలం గడిచేకొద్దీ విషయం మెల్లమెల్లగా అడవి చుట్టూ ఉన్న గ్రామాలకు పాకింది. దాంతో అక్కడి నుంచి కూడా వైద్యం కోసం లక్ష్మి దగ్గరకు వచ్చేవారు. వారి ద్వారా లక్ష్మి పేరు అందరికీ తెలిసిపోయింది. కేరళ మొత్తం లక్ష్మి పేరు జపించసాగింది.

 

ఆమె గొప్పదనం తెలిసి కేరళ ప్రభుత్వం 'నాటు వైద్య రత్న' అవార్డునిచ్చి సత్కరించింది. ఆమె కానీ, ఆమె తల్లి కానీ వాళ్లు చేసే వైద్య ప్రక్రియ గురించి పుస్తకం రాస్తే ప్రచురించడానికి కేరళ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిద్ధంగా ఉంది. కేరళ ఫోక్ లోర్ అకాడెమీ లక్ష్మిని గౌరవ అధ్యాపకురాలిగా నియమించుకుంది. ఆమె విజ్ఞనాన్ని మరికొందరికి అందించే ప్రయత్నం చేస్తోంది. ఇవి కాక ఆమెకు లభించిన ప్రశంసలు, ప్రశంసాపత్రాలు, అవార్డులు, రివార్డులు ఎన్నెన్నో.

 

 

    ఇంత సాధించినా దాని గురించి ఏమీ మాట్లాడదు లక్ష్మి. ఎవరైనా పొగిడినా... "నేను సాధించింది ఏమీ లేదు, మా అమ్మ నాకు నేర్పింది, నేను నేర్చుకున్నదానితో పదిమందికి సేవ చేస్తున్నాను అంతే" అంటుంది సింపుల్ గా. తరచూ ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి వైద్య సేవలు అందించడమో, ప్రకృతి గురించి ప్రచారం చేయడమో చేస్తూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది లక్ష్మి. వైద్యం చేయడంతో పాటు ఆప్యాయత నిండిన మాటలతో ఆమె ఓదార్చే తీరు చూసి అందరూ ఆమెను ప్రేమగా అమ్మా అని పిలుస్తుంటారు. 'అడవికి అమ్మమ్మ' (గ్రాండ్ మదర్ ఆఫ్ ఫారెస్ట్) అంటూ బిరుదు కూడా ఇచ్చారు.

 

    అందరికీ ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచే లక్ష్మి జీవితంలో మాత్రం చాలా విషాదం ఉంది. ఆమె పెద్ద కుమారుడు ఓ మదపుటేనుగు బారిన పడి మరణించాడు. చిన్న కుమారుడు కూడా ఓ ప్రమాదంలో కన్ను మూశాడు. కొన్నాళ్ల క్రితమే భర్త కూడా ఆమెను విచిడిపెట్టి వెళ్లిపోయాడు. వాళ్లందరి జ్ఞాపకాలూ మనసును గుచ్చుతున్నా తన కర్తవ్యాన్ని మాత్రం క్షణం మర్చిపోదు లక్ష్మి. ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు, సిటీకి వచ్చి మీ సేవలు అందించండి అన్నా కూడా ఆమె వినదు. "ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. కన్నుమూసే వరకూ ఇక్కడే ఉంటాను.

 

అడవిని దాటొచ్చి సేవ చేస్తాను కానీ ఈ అడవిని మాత్రం ఎప్పటికీ వదలను" అని తేల్చి చెప్పేస్తుంది లక్ష్మి. కాస్తం గుర్తింపు రాగానే మూలాలు మర్చిపోయే మనుషులున్న ఈ రోజుల్లో... అడవి తల్లికే తన జీవితం అంట్లోన్న లక్ష్మికుట్టిని అభినందించి తీరాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాస్ట్ లీ ఎక్విప్ మెంట్ తో లభించే వైద్యాన్ని కేవలం ఆకులు, వేర్లతో అందిస్తోన్న ఆమె ప్రతిభకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి!

- Sameera