"ఏమిటి? మనసుకి నచ్చినవాడిని పెళ్ళి చేసుకోవడం నీచమైన పనా? అయితే డబ్బుకోసం పరాయిదేశపు ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలనుకోవడాన్ని ఏమనాలి|| సమాజాన్ని ఉద్దరించడమా?" అంది అప్సర పదునుగా తను తన తండ్రితో అంతగట్టిగా నిర్మొహమాటంగా మాట్లాడవలసి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.

 

    నిరాశనీ, నిరాశవల్ల ఉత్పన్నమయిన కోపాన్నీ కంట్రోలు చేసుకుంటూ చాలాసేపు మౌనంగా వుండిపోయాడు బాబూజీ. తర్వాత, తన లిమిట్సు ఏమిటో తాను గ్రహించినవాడిలా తెచ్చిపెట్టుకున్న శాంతంతో అన్నాడు.  

 

    "సరే: నువ్వు కూడా నా అంత దానివయ్యావు. చిన్నపిల్లని గద్దించి నీచేత నీకు ఇష్టంలేని పనులు చేయించడం సాధ్యంకాదని నాకు తెలుసు. నీ ఇష్టం వచ్చినవాడినే నువ్వు పెళ్ళిచేసుకో, కానీ ఒక్క షరతు మీద..."

 

    ప్రశ్నార్థకంగా చూసింది అప్సర. "ఏమిటది?"

 

    "నిన్ను ఇన్నేళ్ళనుంచి ప్రాణాలకు ప్రాణంగా పెంచాను. దానికి బదులుగా ఒక్క కోరిక కోరవచ్చా?"

 

    "చెప్పు డాడీ:" అంది అప్సర ఆర్థ్రంగా.

 

    "చిత్రద్వీప్ లో యురేనియం ఉందని మనకు తెలియడం కేవలం అదృష్టం అనుకుంటున్నాను. నువ్వు ప్రేమ మైకంలో వుండి డబ్బువిలువ మరిచిపోతున్నావు. అంతేగానీ డబ్బు విలువ నీకు తెలియకపోలేదు. ఈ ప్రేమమోజు తగ్గిపోయాక మళ్ళీ డబ్బు గుర్తు వస్తుంది నీకు. కానీ ఇంత భారీగా సంపాదించే అవకాశాలు మనకు కావలసి వచ్చినప్పుడల్లా రావు. అందుకని అప్సరా: నా మాటమీద విలువ వుంచి, ఈ ఒక్క ప్రాజెక్టూ పూర్తి అయేదాకా నీ పెళ్ళి వాయిదా వేసుకో: చిత్రద్వీప్ లో జనరల్ భోజాని పదవిలోనుంచి దింపి, మనకు ఫేవర్ బుల్ గా ఉండే వాళ్ళని గద్దె నెక్కించి, యురేనియం మన సొంతం చేసుకున్న తర్వాత ఇంక నీ యిష్టం: అప్పుడు నీతోపాటు నేనుకూడా ఈ బిజినెస్ లో నుంచి రిటైరయిపోతాను. ఏమంటావ్: ఈ ఒక్క ప్రాజెక్టుకి మాత్రం నీ సహాయ సహకారాలు నాక్కావాలి. కాదనకు?"   

 

    "సారీ డాడ్:" అని లేచి నిలబడింది అప్సర. ఇంక ఈ ప్రస్తావన అనవసరం అన్నట్లు. అన్న ప్రతాప్ దగ్గరకి వచ్చి కూర్చుంది.

 

    గుడ్డుపెట్టే బాతు బొమ్మతో అమాయకంగా ఆడుకుంటున్నట్లు నటిస్తూనే, తండ్రికీ, చెల్లెలికీ  మధ్య జరుగుతున్న సంభాషణని ఒక్కమాట పొల్లుపోకుండా, శ్రద్ధగా ఆలకిస్తున్నాడు ప్రతాప్. వెర్రిబాగుల వాడిలా కనబడుతూ తమ కళ్ళముందు ఆడుకుంటున్న ప్రతాపే రాణా అన్న పేరుతో చలామణీ అయ్యే ఏస్ ఇండియన్ గూఢచారి అని ఆ తండ్రీ కూతుళ్ళకిద్దరికీ తెలియదు.

 

    గత కొద్దిరోజులనుంచి తండ్రి ప్రవర్తన కొంచెం చిత్రంగా ఉండటం గమనిస్తూనే వున్నాడు ప్రతాప్. తండ్రి చెల్లెలికి అర్జెంటుగా రమ్మని మెసేజ్ పంపడం అతనికి తెలుసు. మామూలుగా అయితే ఎంత ముఖ్యమైన వ్యవహారమైనా సరే చెల్లెలితో ఫోన్ లో మాట్లాడేస్తాడు తండ్రి. మరీ ముఖ్యమైన, రహస్యమైన పని అయితే, కంపెనీకి ఉన్న ప్రత్యేకమైన కోడ్ లో, మెసేజ్ పంపిస్తాడు.

 

    అలా చెయ్యకుండా, చెల్లెలితో స్వయంగా రమ్మన్నాడంటే, రెండే కారణాలు అయి వుండాలి.

 

    ఒకటి -

 

    టాప్ సీక్రెట్ బిజినెస్ వ్యవహారమయినా అయి వుండాలి.

 

    లేదా -

 

    చెల్లెలి పెళ్ళి విషయం అయి వుండాలి. వ్యాపారంలో తనకమునకలయిపోతున్న తండ్రి, తనకు అన్నిట్లో కుడిభుజంగా వుంటున్న అప్సరకి ఇప్పుడప్పుడే పెళ్ళిచేసే ఉద్దేశ్యంలో లేడని తనకి తెలుసు.

 

    అందుకని...

 

    అప్సరని పిలిపించిన అవసరం ఏదో బిజినెస్ కి సంబంధించినదే అయి వుండాలి. లేదా, అంతకంటే పెద్దదే ఏదో అయి వుండాలి.

 

    అది కనిపెట్టడానికే తను ఇక్కడ కాచుకుని వున్నాడు.

 

    ఇప్పుడా రహస్యమేమిటో తెలిసింది:

 

    అది మామూలు రహస్యం కూడా కాదు: ఈ భూగోళంమీద వున్న దేశాలన్నిటినీ తల్లకిందులు చేసి పారేసే రహస్యం:   

 

    యురేనియం: బ్లాకులో ఒక్క ఔన్సు కొన్ని లక్షల రూపాయలకు అమ్ముడుపోయే యురేనియం?

 

    సత్తా వుంటే, ఆటంబాంబులు తయారుచేయడానికి పనికి వచ్చే యురేనియం:

 

    అది తన తండ్రిలాంటి నీతీనియమాల్లేని వ్యాపారస్తుడి చేతిలో పడబోతోందా?

 

    తను బయటికి వెళ్ళగానే రాణా రూపంలో దీనికి ప్రతిగా ఏం చెయ్యాలో ఆలోచించడం మొదలుపెట్టింది ప్రతాప్ మనసు.

 

    "ఇంకేం కొత్తబొమ్మలు కొన్నావన్నా?" అంటోంది అప్సర ఆప్యాయంగా.

 

    ఓ వెర్రినవ్వు నవ్వి, అల్మారాలోనుంచి తన బొమ్మలన్నీ బయటికి తీయడం మొదలెట్టాడు ప్రతాప్.

 

                                                                         *    *    *    *