"గుడ్ మార్నింగ్... నేను యశస్విని."

 

    "చెప్పండి" నాలిక తడబడుతూంది.

 

    "మీరు ప్రజెంట్ చేసిన న్యూస్ అద్భుతంగా వుంది."

 

    "థేంక్స్... కాని ఇంతటితో ఆగిపోదు. ఆగనివ్వను. ఇందులో పోయింది నాకు ప్రియమైన స్నేహితుడు కాబట్టి ప్రతిరోజూ ఇదో ఫీచర్ లా కొనసాగిస్తా... ఈ వేడి చల్లారకుండా ప్రజల్ని ప్రభుత్వాన్ని రెచ్చగొడతాను."

 

    "నాకా నమ్మకముంది."

 

    "అప్పుడే ఛీఫ్ మినిస్టర్ రంగంలోకి దిగాడని, తన పార్టీ పరువుని తన నాయకత్వాన్ని ప్రజలు శంకించకుండా చర్యల్ని తీసుకోబోతున్నాడనీ తెలిసింది. సో! ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది."

 

    "రాందేవ్ కెమెరాలో ఫిల్మ్ రోల్ ఎలా పోయిందో తెలుసుకోవడం..."

 

    "యూ ఆర్ స్పీకింగ్ లైకె పోలీసాఫీసర్" నవ్వు వినిపించింది. "అదికాదు మిష్టర్ యశస్వీ... నానీ ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకొన్నాయి..."

 

    "ఎలా" తొట్రుపాటుగా అన్నాడు యశస్వి. "నేను డిపార్ట్ మెంటల్ గా చేసిన ఎంక్వయిరీనిబట్టి నానీ అప్పారావు దగ్గరలేడు. అర్థరాత్రివేళ నానీని గదిలో నుంచి ఎవరో ఎత్తుకుపోయారని ముందు జాగ్రత్తగా అప్పారావు పోలీస్ కంప్లయింటిచ్చాడు."   

 

    "తెలివైన ఫూల్" రామసూరి గొంతు ఉత్సుకతతో పలికింది.

 

    "ఇప్పుడు చెప్పు బ్రదర్. ఆ ఎత్తుకుపోవడమన్నది రాందేవ్ ఎందుకు చేసుండడు? ఆ విషయం తెల్సుకునే రాందేవ్ ని ఎందుకు హత్య చేయించి వుండడు? ఆఫ్ కోర్స్... ఇవన్నీ ప్రోటబిలిటీస్ గా మీ డిపార్టుమెంటుకి అనిపించొచ్చు. బట్... నా ప్రకారం ఇవి ఫేక్ట్స్."

 

    యశస్వి పిడికిలి ఫోన్ చుట్టూ బిగుసుకుపోయింది.

 

    "మీకు హోంమినిష్టర్ గురించి కొద్దిగా తెలుసు.కాని నాకు వాడి జాతకం అంతా తెలుసు. చెప్పమంటారా... వాడో లుచ్ఛా, పక్కా వుమనైజర్, డాఫర్ గాడు, ఇంకా చాలా. తన పదవిని పరపతిని అంత సునాయాసంగా వదలడు. అవసరమనిపిస్తే హత్యలు చేయిస్తాడు. అవసరం లేకపోయినా అలజడి సృష్టించి ప్రజలదృష్టికి తప్పుదోవ పట్టించగలడు. సో! మైడియర్ ఇన్ స్పెక్టర్! ఇప్పుడు మన ముఖ్య కర్తవ్యం ఆ పసికందును ప్రాణాలతో కాపాడటం. డౌటే అనుకోండి. బట్, ట్రై చేయాలి ఏమంటారు?"

 

    యశస్వి నుదుట స్వేదం ముత్యాల్లా అలుముకుంది అప్పటికే.

 

    "రెండోది, రాత్రి వాడితో ఎవర్తన్నా వుందేమో తెలుసుకోవడం. ఎందుకంటే నా అంచనా తప్పుకాదు బ్రదర్. రాందేవ్ అలాంటిదేదో ఫోటోలు తీసుంటాడు కాబట్టే రీలుపోయింది. నానీని రాందేవ్ తప్పించే ప్రయత్నంలోనే వాళ్లకి చేజిక్కి వుంటాడనిపిస్తుంది. కాబట్టి నానీ బ్రతుకుతో ఈ సమస్య మొత్తం ముడిపడుంది" ఫోన్ పెట్టేసిన చప్పుడు.

 

    కొన్ని క్షణాలక్రితందాకా వున్న ప్రశాంతత చెదిరిపోయిన యశస్వి రిసీవర్ని క్రెడిల్ చేసి సాలోచనగా పైకిలేస్తూ చూశాడు.

 

    హరిత ఎప్పుడు నిద్రలేచిందో రెప్పవాల్చకుండా అతడ్ని గమనిస్తూ "ఏమైంది?" అంది నైటీని సర్దుకుని అతడి ముందుకొస్తూ...

 

    "హోంమినిష్టర్ అప్పారావు చుట్టూ ముడులు బిగుసుకుపోయాయి హరితా" భావరహితంగా అన్నాడు.

 

    "మంచిదేగా?"

 

    "అనీ నేనూ అనుకొన్నాను కాని..." ఓ క్షణం ఆగి" ఇప్పుడు నానీ మరిన్ని విషమ పరిస్థితుల్లో చిక్కుకున్నాడనిపిస్తూంది" అన్నాడు.

 

    ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో మంత్రపుష్పాన్ని తాతయ్య పాండిత్య ప్రకర్షని జీర్ణించుకుంటూ బ్రతకాల్సిన ఓ పసికందు ఇంత పెద్ద సమస్యకి మూలమౌతాడనిగానీ, ఇంతమందికి ఇన్నిరకాలుగా అవసరమైన ప్రాణిగా మారతాడనిగానీ ఎవరన్నా ఊహించారా?

 

    అసలు నాన్నీ ఎక్కడున్నాడంటావ్!"  

 

                                       *    *    *

 

    "ఎక్కడున్నా వాడుండకూడదు... వాడు ప్రాణాలతో బ్రతికుంటే నా పదవిపోతుంది. తర్వాత పరువుపోతుంది. ఆనక నాకు, నాతర్వాత నీకు పుట్టగతులుండకుండా పోతాయి" తోకతొక్కిన త్రాచులా ఎగిరిపడ్తున్నాడు అప్పారావు.

 

    "అయితే ఆ రామసూరిగాడ్ని లేపేయమంటారా" హరి ఉద్రేకంగా అడిగాడు.

 

    "దానివలన ఒరిగేదేంటి" విసుక్కున్నాడు.

 

    "న్యూస్ ఆగిపోతుంది."

 

    "వాడబ్బ మరోడొస్తాడు" అసహనంగా పచార్లుచేస్తూ "నా శత్రువు వాడు కాదు. ఇప్పుడు ఆ నానీగాడు. వాడిచేతిలో రీలు. వాడు దొరికితే పత్రికలింకా విజృంభిస్తాయి. ప్రతిపక్షాలు పేట్రేగిపోతాయి.ఎసెంబ్లీలో నా పరిస్థితి బెంబేలయిపోతుంది. ఆనక చేసేదేమీలేక ఛీఫ్ మినిష్టర్ ఓ కమిటీని వేసి నన్ను నవ్వులపాల్జేస్తూ తన నిజాయితీని నిరూపించుకుంటాడు. కాబట్టి అర్జంటుగా వాడ్ని చంపేయాలి."

 

    "వెధవ జాతకం గట్టిది లాగుంది. రెండుసార్లూ తప్పించుకున్నాడు."

 

    "ఇక తప్పించుకోకూడదనే నేననేది" ఈసారి గెస్ట్ హౌస్ దద్దరిల్లేటట్టు అరిచాడు. "వాడు చిక్కాల్సింది మనచేతుల్లో. దూరంగా పారిపోతున్నాడని ఆలోచించకు. కాల్చిపారేయ్. ఆనక ఆ విషయం నాకొదిలెయ్. పోలీస్ డిపార్టుమెంట్ లో వున్నది చాలామంది నా మనుషులే కాబట్టి ఆ సంగతి నేను చూసుకుంటాను."

 

    "ఈరోజు ఎలాగన్నా"

 

    "రోజుకాదు, గంటల్లో వాడిపని పూర్తికావాలి. పేపర్లో ఫోటోకూడా వేశాడుగా. కావాలంటే నీ గేంగుకి వందపేపర్లు కొనిచ్చి ఆ ఫోటోతో పట్నమంతా గాలించమను. అట్టే వ్యవధిలేదు. ఇంకా నిలబడ్డావేం! అది చేసేదాకా నీముఖం చూపించకు. వెళ్ళు" కాలుగాలిన పిల్లిలా చిందులు తొక్కుతుంటే హరి ఆశ్చర్యంగా చూశాడు.

 

    ఇంతకంటే చాలా గొప్ప ఘాతుకాలు తనచేత చేయించిన అప్పారావు ఈ విషయంలో చాలా హైరానా పడిపోవడం హరికి విడ్డూరంగా వుంది.

 

    దూకుడుగా వెళ్ళి జీప్ లో కూర్చున్నాడు.

 

    హరి వెళ్లిన రెండునిముషాలకి పడకగదిని చేరుకున్న అప్పారావు కామేశ్వరి కార్యక్రమంలోకి దిగబోతుంటే "ఇప్పుడొద్దు. అర్జెంటుగా నువ్వు మానోరమ హోటల్లో దిగిపో... నేను చాలా చిక్కుల్లో పడ్డాను" అన్నాడు.

 

    "అదికాదు..." చెప్పబోయిందేదో.

 

    "ఇంకేం చెప్పకు వెంటనే వెళ్లు" కసురుకున్నాడు.