"అది కాదయ్యగారూ!" అని కేశవులు ఏదో చెప్పబోయాడు. కానీ ఎవరి మాటా లెక్కచేయకుండా ఎలా వచ్చాడో అలాగే రవి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కేశవులు కన్నీళ్ళు పెట్టుకుని "చూశావా! ఇదంతా నీమూలానే వచ్చిందయ్యా. దుర్మార్గుడా!" అన్నాడు.

    కానీ లోలోపల ఏమేమి రభసలు జరిగాయో తెలియదు. సాయంత్రానికల్లా నేతిగరిటె ఇంటి చూరుమీద కనిపించింది. బహుశా ఎత్తుకుపోయిన కాకి తిరిగి పెట్టివుంటుందని వంటవాడు నిర్ధారణచేసి "హమ్మయ్య! నా నిర్దోషిత్వం బయటపడింది" అని గుండెమీద చేయివేసుకుని దీర్ధనిశ్వాసం వదిలాడు. ఆ వస్తువు మళ్ళీ ఇనప్పెట్టెలోకి వెళ్ళిపోయింది.

    చాలారోజులు ఇలానే గడిచిపోయాయి. అవి నిస్సారమైనవైనా కావచ్చు. ఆనందకరమైనవైనా కావచ్చు. కానీ ఏమీ ప్రత్యేకత లేనివి.

    ఒకరోజు పెద్దక్కగారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది బయల్దేరి వస్తున్నానని. అతను ఉత్తరం చదివి ఊరుకున్నాడు.  

    మరునాడు తెల్లవారుఝామునే బండిదిగి, రెండేళ్ళ చంటివాడిని ఎత్తుకుని లోపలకు వచ్చిన సుభద్ర "అయ్యో! నా ఖర్మ! ఇలా చిక్కిపోయావేమిటిరా తమ్ముడూ? పట్నంలో సిగరెట్లు గిగరెట్లు ఏమయినా అలవరుచుకున్నావేం ?" అంది నోరు నొక్కుకుని. కేశవులు లోపలకు సామాను జేరేస్తున్నాడు.

    "దురదృష్టవశాత్తూ ఆ అలవాటు నాకు అబ్బలేదు."

    "దురదృష్టమంటావేమిట్రా వెర్రినాగమ్మా! అందుకనే మా తమ్ముడు చాలా అమాయకుడు, వట్టి వెర్రిబాగులవాడు అని నలుగురితో చెప్పి మురిసి పోతుంటాను."

    ఈ ధోరణి నచ్చక రవి "బావలేకుండా వచ్చావేం అక్కయ్యా?" అని అడిగాడు.

    "ఆయనకు ఒక్కపనా? ఒక్క ఇదా తమ్ముడూ? పొద్దునలేచి ఆరింటికి బయట కాలుపెడితే తిరిగి రాత్రి పదింటికి వస్తూంటారు."

    "అయితే బావ ఇంకా బిజీగా తిరగటం మానలేదన్నమాట."

    "ఆ! మరి ఎలా నాయనా? ఊళ్ళో అందరికీ ఆయన్తోటి పని ఉంటుందాయె మరి" అని కొంచెం ఆగి " అది ఒక్క మరిదిగారికే చెల్లింది. ఇంట్లో కాలు బయట పెట్టకుండా" అంది.

    ఆవిడ ఏమాలోచించుకుంటూ ఇలా మాట్లాడుతుందో అర్ధంగాక విసుగుతో "పెద్ద బావ రోగిష్టి మనిషికాదుగా?" అన్నాడు.

    ఆమె ఈమాటకు రిత్తబోయింది. కానీ తక్షణం చాకచక్యంతో ఆ చిహ్నాలను ముఖంలోంచి పారద్రోలి, నవ్వు తెచ్చుకుని "ఆయన నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమన్నారు తమ్ముడూ!" అన్నది.

    రవి ఏమీ సమాధానం ఇవ్వకుండా స్వీకరించినట్లు తలూపి వూరుకున్నాడు.

    సుభద్ర ఆ రాత్రి వంటవాడిని దుమ్మెత్తిపోయటం రవి విన్నాడు. దానికితోడు కేశవులు ఆమెతో అతన్నిగురించి ఫిర్యాదు చేసినట్లున్నాడు. ఉన్నవీ లేనివీ కలిపి దుయ్యబడుతోంది. వంట బ్రాహ్మణుడు అచేతనుడై తలవంచుకుని నిలబడిపోయాడు. ఈ వ్యవహారంలో రవి ఏమీ జోక్యం కలిగించుకోలేదు. ఆ రాత్రి రవి పడుకుని వున్నప్పుడు ఆమెప్రక్కనే కూర్చుని "ఇలాగైతే నువ్వేం లాభంలేదు తమ్ముడూ!" అంది.

    "ఏమిటి అక్కయ్యా!" అన్నాడు రవి తెల్లబోయి.

    "ఆలనాపాలనా కనుక్కునేవారు ఎవరూ లేరు గనుకనే ఈ ఇల్లు ఇలా అస్తవ్యస్తంగా పడివుంది. తలుచుకుంటే నాకు లోలోపల ఏదో కుమ్మరిపురుగు తొలుస్తున్నట్లుగా వుంది" అని, పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుని, గాద్గదికంగా "వెనుకటి తాతగారు ఇలా వుండేవారుట. ఆ శాఖ ఇంకా పోలేదు."

    "ఏం చేయమంటారో చెప్పమ్మా!"

    "మరి నేనేమైనా గట్టిగా మాట్లాడితే నీకు విసుగాయె. ఇదంతా చూస్తూంటే నాకెలావుందో తెలుసా? నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళకూడదనిపిస్తుంది."

    రవి నిదానంగా "నన్ను విడువకుండా కూర్చుంటే అవతల బావ విషయమో?" అన్నాడు.

    "అదీ నిజమే! అందుకనే కదా నేను బలవంతాన నా కోరికను చంపుకుంటున్నాను" అని కొంచెం విరామంతో "అయినా నాకు తెలియక అడుగుతాను తమ్ముడూ! ప్లీడరీ కూడా పాసవుతున్నావుకదా! ఇంకా ఎన్నాళ్ళు ఈ లంకంత కొంపను కళాకాంతులు లేకుండా వుండమంటావు చెప్పు?" అని బెడ్ లైట్ వెలుగులో అతని ముఖంవంక లోతుగా చూసింది.

    రవి ఈ మాటల్ని అర్ధం చేసుకున్నాడు. మాట్లాడకుండా ఊరుకున్నాడు.

    "వింటున్నావా?"

    అతను కళ్ళుకూడా తెరవకుండా ఇంకా అలాగే పడుకునివున్నాడు.

    "నిద్రపోతున్నావా?"

    తనకేది శరణ్యమో అతనికిప్పుడు బోధపడింది. ఆ అభినయమే తప్పనిసరి అయింది. ఆమె కొంతసేపు అలానేకూర్చుని మెల్లగా లేచి వెళ్లిపోవటం అలికిడిని బట్టి గ్రహించాడు.

    కానీ సుభద్ర ఆ ప్రసక్తి అంతటితో మానుకుని ఊరుకోలేదు. రెండుమూడు రోజులుమాత్రం ముభావంగా గడిపింది. ఆరోజు పదకొండింటికి రవి భోజనం చేస్తుండగా ప్రక్కనే కూర్చుని బంగాళాదుంపల వేపుడు తీసుకువచ్చి వడ్డిస్తూ "చిన్నప్పుడు ఈ కూరంటే నీకు ఎంత ప్రీతో నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్లు మెదుల్తుంటుంది. మా ఇంట్లో ఎప్పుడు ఇది చేసుకున్నా, నువ్వు గుర్తుకువచ్చి కళ్ళలోనీళ్ళు గిర్రున తిరుగుతాయంతే నమ్ము తమ్ముడూ!" అంది.

    "నేనెలా మర్చిపోతానక్కయ్యా నీ వాత్సల్యం?" అని అన్నం కలుపుతున్నాడు.

    "అలా అంటానా? మీ బావగారు దెప్పిపొడుస్తారు నన్ను. మీ తమ్ముడికి నువ్వంటే ఏమీ అభిమానం లేదని."

    "పరిహాసానికి అని వుంటారు."

    "దేనికైనా అననీ. మా తమ్ముడిని అంతమాట అంటే నేను ఊరుకుంటానా? చూసుకోండి, నామాట అబద్ధమయితే నేవెళ్ళి అన్నీ నిశ్చయపరుచుకుని వస్తాను అని పంతంపట్టి బయల్దేరాను."

    "నిశ్చయమా?" అని ఆశ్చర్యంతో ఆమెవంక తేరిపారచూశాడు.