"మీరు నమ్ముతానంటే ఒక ముక్క చెబుతాను?"

 

    "ఊ?" అన్నాడు సత్యం.

 

    "విజయవాడ వచ్చి మిమ్మల్ని కలుసుకోవలసిందని టెలిగ్రాం చదివి నేను మూర్చపోయేను!"

 

    "మీకు మూర్చ రోగముందా!" అన్నాడు సత్యం!

 

    లక్ష్మీపతి పకపకా నవ్వేస్తూ అన్నాడు-

 

    "అమ్మో! ఏమిటో అనుకున్నాను. చతురులే సుమా! రోగం సంగతేమో గాని- ఆనందం ఎక్కువైతే మూర్చపోయే పనవుతుంది నాకు!"

 

    "ఎందుకంత ఆనందం?"

 

    "ఇంకా ఎందుకని అడుగుతారేమిటండీ! మీ అంతస్థెక్కడ నేనెక్కడ? అల్లాంటి నేను మీకు ఇంకా గుర్తున్నానంటే అది నా అదృష్టం కాదూ? అంచేత టెలిగ్రాం అందగానే రెక్కలు కట్టుకుని మీ దగ్గిర వాలేను. ఎంతో ఆదరంగా ఆహ్వానించడమే గాకుండా- మీ వ్యాపారంలో నన్ను భాగస్థుడ్ని చేస్తానన్నప్పుడు-"

 

    "మళ్ళా మూర్ఛరోగం వచ్చిందా?"

 

    "చిత్తం! ఇంచుమించు అంతే అయ్యింది. కొంతకాలం మా ఇంట్లో నా దగ్గిరే వుంటానని మీరు చెప్పగానే మూడోసారి మూర్ఛపోయేను."

 

    "ఇప్పుడెట్లా వుంది పరిస్థితి?"

 

    "కొంచెం కొంచెం తేరుకుంటున్నాను! కానీ, ఎంత కాదనుకుంటున్నా ఒక ధర్మ సందేహం పీడిస్తూనే వుంది!"

 

    "ఏమిటో అది?" కుతూహలంగా అడిగేడు సత్యం.

 

    లక్ష్మీపతి సర్దుక్కూచుని చెప్పేడు-

 

    "నన్ను మించిన సన్నిహితులు మీకు వేల సంఖ్యలో ఉన్నారు. హోదా వగైరాలు చూసుకున్నా వాళ్ళంతా నాకంటే గొప్పవాళ్ళు. ఇంత మందిని కాదని మీ పార్టనర్ గా ప్రత్యేకించి నన్నే ఎంచుకున్నారంటే అందులోవున్న వ్యాపార రహస్యం ఏమిటో తెలీకుండా వుంది."

 

    సత్యం కులాసాగా నవ్వేడు. లక్ష్మీపతి ఆ నవ్వుకి బ్రేకు వేసేడు-

 

    "తమరలా నవ్వేస్తే నాకు సమాధానం దొరికినట్టు కాదుగదా!"

 

    సత్యం నవ్వు ఆపి సీరియస్ గానే అడిగేడు-

 

    "చెబితే బాధపడరుగదా?"

 

    "పడను!"

 

    "నేను ప్రారంభించే ఈ కొత్త వ్యాపారానికి పెట్టుబడికంటే ముఖ్యంగా లేకితనం అవసరం!"

 

    "లేకితనమా!"

 

    "అవునదే! పరమలోభితనాన్ని మించిన లేకితనం. అది నా దగ్గిర లేదు. నా సన్నిహితుల దగ్గిరా లేదు, ఆ క్వాలిఫికేషను నాకు తెలిసినంత వరకు మీ ఒక్కర్లోనే వుందని నా ఉద్దేశం!"

 

    ఆ మాటకి లక్ష్మీపతి కించిత్తుకూడా సిగ్గుపడలేదు. పైపెచ్చు "చిత్తం! అదంతా తమ అభిమానం" అని మురిసిపోతూ మెలికలు తిరిగేడు.

 

    "ఛీ! వీడి బతుకు తగలెయ్య" అని సత్యం మనసులో తిట్టుకున్నాడు.

 

    అందుచేతనే మిమ్మల్ని పార్టనర్ గా తీసుకున్నాను!" అని కొసరు మాట అన్నాడు సత్యం.

 

    అంతలో పద్మ కాఫీ తీసుకొచ్చింది. "నాన్నా" అని పిలిచి ఆమె గది బయటే నిలబడిపోయింది.

 

    లక్ష్మీపతి పద్మను చూస్తూ అన్నాడు---

 

    "అక్కడే నిలబడ్డావేమమ్మా! సత్యంగారు మనకేం పరాయివారు కాదులే! మావయ్యగారే! రా లోపలికి!"

 

    పద్మ లోపలికొచ్చింది. సత్యం ఆమె వేపు కన్నార్పకుండా చూస్తూనే వున్నాడు. అతనట్లా చూడటం లక్ష్మీపతికి గొప్ప ముచ్చటగా వుంది.

 

    కొన్ని కోట్ల కరెన్సీనోట్లు తన ఇంట్లో గుట్టలు గుట్టలుగా పడివున్నట్టు భ్రమపడ్డాడు లక్ష్మీపతి.

 

    "మామయ్యగారి కివ్వమ్మా!" అన్నాడు లక్ష్మీపతి.

 

    పద్మ సత్యానికి కాఫీ కప్పులో యిచ్చింది. లక్ష్మీపతి కళ్ళముందు కరెన్సీనోట్ల దృశ్యం యింకా తొలగిపోలేదు. సత్యంతో ఆశగా అన్నాడు-

 

    "నా శ్రేయస్సు కోరేవారు. మీ దగ్గిర దాపరిక మెందుకు? పిల్లదానికి ఈ ఏడాదే పెళ్ళిచేద్దామనుకుంటున్నాను. మీ ఎరికలో సంబంధమేదైనా"...

 

    సత్యం అతని మాటకు అడ్డువస్తూ అన్నాడు-

 

    "ఎందుకులేరు? వున్నవారంతా కోటీశ్వరులే!"

 

    "చిత్తం! తమరు తలుచుకుంటే మా అమ్మాయి పెళ్ళి కోటీశ్వరులతోనే జరిపిం చేయగలరు. తమ పవరు నాకు తెలీందా?" అన్నాడు లక్ష్మీపతి బోలెడు ఆశతో...

 

    "ఎవరో ఎందుకు? సాక్షాత్తుగా మా అబ్బాయే వున్నాడు" అన్నాడు సత్యం.

 

    అంతమాట విని తట్టుకోలేక లక్ష్మీపతి కూచున్నవాడు కాస్తా తూలిపడ్డాడు. పడ్డవాడు ఎట్టాగూ పడ్డాడు గనుక అమాంతం బావగారూ అనేసి సత్యం కాళ్ళమీద కూడా పడిపోదామనుకున్నాడు.

 

    అతను అల్లాంటి ప్రయత్నం చేయబోతుండగా మళ్ళా సత్యం అన్నాడు---

 

    "కాని-వాడికీ నాకూ చెడింది!"

 

    ఆ దెబ్బతో లక్ష్మీపతి ఉత్సాహం పూర్తిగా నీరు కారిపోయింది. వళ్ళోపడే ధనరాసుల్ని కాకులు తన్నుకుపోయినంత బాధపడ్డాడు. మెల్లిగా లేచి కూచున్నాడు.

 

    సత్యం యింకా చెప్తూనే వున్నాడు.

 

    "వాడి పెళ్ళి వాడిష్టప్రకారం జరగాలన్నాడు. నేను వీల్లేదన్నాను. మాటామాటా వచ్చింది. ఇల్లు విడిచి వెళ్ళిపోయేడు. ఎక్కడ అఘోరిస్తున్నాడో ఏమో?"

 

    లక్ష్మీపతి కలుగచేసుకున్నాడు-యింకా ఆశ చావక--

 

    "మీకేం అభ్యంతరం లేకపోతే అబ్బాయిగారి ఫోటో ఇప్పించండి. ఎక్కడున్నా పట్టుకొచ్చి మీకప్పగిస్తాను."

 

    "ఏం లాభం? వాడు నా మాట వినిపించుకో నప్పుడు-ఇంట్లోవుంటే ఏం? వీధుల్లో తిరిగితే ఏం?"

 

    "పోనీ నా ఇంట్లో పెట్టుకుంటాను సరా?" అన్నాడు లక్ష్మీపతి అదే తన ధ్యేయమైనట్టు...

 

    "ఆ శ్రమ మీకెందుకులెండి! ఎట్లా రాసి పెట్టి వుంటే అట్లా జరుగుతుంది" అన్నాడు సత్యం.

 

    ఆ తర్వాత బ్రీఫ్ కేసు తెరిచేడు. లక్ష్మీపతి చూపు అందులో వున్న కరెన్సీమీద పడింది. అంతడబ్బు చూడగానే గుండెల్లో వణుకుపుట్టింది.

 

    సత్యం వందకాగితాల కట్ట ఒకటి టీపాయ్ మీద పెట్టి లక్ష్మీపతితో అన్నాడు.

 

    "కొంతకాలం నేనిక్కడ వుండాలి గనుక - నేనుండే గదికి ఏ.సి. ఏర్పాట్లు చూడండి."

 

    నోట్లకట్టని చూడగానే లక్ష్మీపతి చేతి నరాలు జివ్వుమన్నాయి. అంచేత చేయి అకస్మాత్తుగా నోట్లకట్ట వేపు కదిలింది.

 

    తీసుకుంటే ఆ పెద్దమనసు ఏమనుకుంటుందోనన్న భయం కలగ్గానే ఆ కట్టకి అంగుళం యివతల చెయ్యి ఆగిపోయింది.

 

    సత్యం కులాసాగా అన్నాడు-

 

    "మీ క్వాలిఫికేషను ఏమిటో చెప్పేక కూడా సంశయిస్తున్నారంటే బాధగావుంది, పుచ్చుకోండి."