అలా అరుస్తున్నది పోలీసులు.

 

    అంతే! ఆ వీధిలో అందరిదృష్టీ పరుగెడుతున్న పసివాడైన దొంగపైకి మళ్లాయి.

 

                                 *    *    *

 

    "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
    అహం త్వా సర్వసాపేభ్యో మోక్ష్యయిష్యామి మాశుచః"

 

    శివాలయ ప్రాంగణం ఆ నిశిరాత్రివేళ కాశీనాథశాస్త్రి గంభీరస్వరం భక్తి ప్రపత్తులతో ప్రతిధ్వనిస్తూ అతడికభిముఖంగా కూర్చున్న భక్తుల హృదయాల్లో జేగంటలను మ్రోగిస్తూంది.

 

    "సమస్త ధర్మములను అనగా ప్రాయశ్చిత్తములు బాహ్యాచారనిష్టలు మున్నగు వానినన్నిటిని వీడి నన్నే శరణుపొందుము. నిన్నెల్లపాపములనుండియు విముక్తుని చేసెదను . శోకింపకుము... అన్నది గీత ఉవాచ..." కాశీనాథశాస్త్రి ధృక్కుల్లో అసదృశమయిన ఆర్థ్ర "ఒక ప్రేయసికి ప్రియుడిపై త్రికరణశుద్ధిగాగల ప్రేమ, లౌకికునికి సాంసారిక విషయంపై గల రాగం, లోభికి సంపాదనపైగల అనురక్తి యీ మూడింటి సమన్వయంతో సరితూగగల గాడేచ్ఛ మాత్రమే నరుడు నారాయణునికి దరి చేర్చగలిగేది. సదా నిర్మల నిష్కపట హృదయముతో ఓ ప్రభూ! మంచిచెడుల విచక్షణ నాకు తెలియదు. పారమార్థిక జీవన విధానంలో నేనేమార్గాన్ని అనుసరించాలీ... నిర్ణయించి మనోబలంతో ఇష్ట ఫలసిద్ధికోసం నడిపించే దిక్సూచివి నువ్వే... మార్గానివీ నీవే... అంటూ శరణు జొచ్చిననాడు గమ్యం సుగమం కాగలదు" నిశ్శబ్ద వైతరణిలా ఆయన గొంతు నించి జాలువారే తాత్వికతకి హరిత కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.

 

    నిజానికి ఆమె ఆలయానికి వచ్చింది ఆధ్యాత్మికమైన ఆలోచనలతో కాదు.

 

    అందోళనగా వుంది. తను త్రికరణశుద్ధిగా కాంక్షించే యశస్వికి ఏ ఆపదా రాకూడదని దేవుణ్ణి అర్థించాలని వచ్చింది. నిన్న మొన్నటిదాకా ఎంత ఆకతాయిగా బ్రతికిందని... కాని యశస్వితోవున్న ఈ కొద్దిరోజుల సాహచర్యం కొన్నేళ్ళ వయస్సుని పెంచింది అంతకుమించి యశస్విపై అనురాగాన్ని ద్విగుణీకృతం చేసింది.

 

    ఎక్కడనుంచి వచ్చినా ఎందుకు అతడి సన్నిధిని కోరుకున్నా ఇప్పుడామె అభిలషించేది... యశస్వి శ్రేయస్సుని మాత్రమే కాదు... దానితో ముడిపడివున్న నానీ బ్రతుకుని కూడా...

 

    కాశీనాథశాస్త్రి గళం అమృతధారల్ని వర్షిస్తూ ఇంకా కొనసాగుతూనే వుంది.

 

    అప్పుడు లేచిందామె.

 

    గుడిబయటకొస్తూ ఒక్కసారి ఆఖరిసారిగా గర్భగుడివేపు తిరిగిచూసింది.

 

    ధూపదీప నైవేద్యాలమధ్య ముముక్షువుల మనోనిబ్బరానికి మూలస్థంభంలా వుంది శివలింగం.

 

    అలవోకగా చేతుల్ని జోడించింది.

 

    అది వైరాగ్యం కాదు.

 

    అపశృతి కోరని అనురాగం.

 

    కోరుకున్నది మనోశక్తీకాదు... చెక్కుచెదరని అనురక్తి.

 

    "అభయాన్ని కోరిన యెందరికో ఆసరాగామారి నీ ఆస్తిత్వంతో ఇంకా ధర్మాన్ని కాపాడే దివ్యత్వాన్ని కోల్పోని ఓ కారుణ్యమూర్తీ... మనసు అలజడిగా వుంది. ధైర్యం సన్నగిల్లిపోతోంది. నీ నామస్మరణమే శరణు కోరినవారికి వరమైతే... నీ ఓంకారనాదమే ఈ సృష్టిని నడిపే వేదమయితే ఇప్పుడు నేను చేతులు జోడించి రక్షించమని నిన్ను అర్థించేది నా సుఖాన్ని కాదయ్యా... ఓ పసికందు ప్రాణాల్ని... ఆ పసికందుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్న ఇంకా ఈ నేలపై మిగిలిన మరో నిజాయితీని... ఈ పోరాటంలో నరమేధమే తప్పనిసరయితే ముందు నా బ్రతుకుని నైవేద్యంగా మార్చుకో..." సజల నేత్రాలతో అప్పుడు ముందుకి కదిలింది.   

 

    నడుస్తూంది హరిత.

 

    ఆమెకిప్పుడు ప్రశాంతంగా వుంది.

 

    అది అల్లరిగా యశస్వి ఒడిలో తలపెట్టుకుని ఆకాశంలో చుక్కలని వెక్కిరించే క్షణాల్లో పొందే విశ్రాంతిలాంటిది కాదు.

 

    తనవాళ్ళకోసం తను బలికావడానికి త్రికరణశుద్ధిగా నిర్ణయించుకున్న ఓ తపస్విని హృదయాంతరాళంలో  రంగుదిద్దుకున్న వెలకట్టలేని సంతృప్తి.

 

    ఆమె కారులో రాలేదు.

 

    హోటల్ కి ఆలయం దగ్గర కావడంతో నడుచుకుంటూనే బయలుదేరింది.

 

    శివాలయంలో నిజానికి ఇంకా కూర్చునేదే.

 

    యశస్వి తిరిగివస్తే గదిలో తను లేకపోవడంతో కంగారుపడతాడనుకుంది.

 

    మరొకొన్ని క్షణాలు అక్కడే ఆ గదిలోనే వుంటే ఓ అపురూపమైన సన్నివేశంలో తను సాక్షిగా మారి నానీకథకి తనే ముగింపునిచ్చే అతి ముఖ్యమైన పాత్ర అయివుండేది.

 

    కాని కొద్దిగా తొందరపడింది.

 

    ఆమె నిర్మానుష్యంగా వున్న రోడ్డుపై నడుస్తూంటే అన్నారెవరో "ఎక్స్ క్యూజ్ మీ."

 

    అప్పుడు చూసింది సమీపంలో ఆగిన టాక్సీని. "ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం యెక్కడుందో చెబుతారా...?" అడిగాడు టాక్సీలోంచే .

 

    "సారీ! నేనూ ఈ ఊరికి కొత్తే..." చెబుతూనే ఆ చీకటిమలుపు తిరగబోయింది.

 

    "పోనీ..." ఈసారి చాలా సమీపంగా వచ్చాడింకో వ్యక్తి "మీ పేరు చెబుతారా?"

 

    ఆమె ఉద్రేకంతో ఏదో అనబోయింది.

 

    కాని అవకాశం ఇవ్వని ఆ వ్యక్తి ఆమెనోరు నొక్కాడు ఒడిసిపట్టుకుని...

 

    ఆమె జరుగుతున్నదేమిటో గ్రహించేలోగానే మరోముగ్గురు వ్యక్తులు ముందు వ్యక్తిని సహకరించారు.

 

    హరితని టాక్సీ వెనుకభాగంలోకి నెట్టిన వ్యక్తులు "పోనీయ్" అన్నారు.

 

    మరో అరక్షణంలో టాక్సీ వేగాన్ని పుంజుకుంది.    

 

                                    *    *    *

 

    "ఎవరు బాబూ నువ్వు" పురాణ కాలక్షేపాన్ని ముగించి గర్భగుడిలోకి వచ్చిన కాశీనాథశాస్త్రి గొంతు ఆర్థ్రంగా పలికింది.

 

    శివలింగానికి వెనుక నక్కి కూచున్న నానీ ముందు ఉలిక్కిపడ్డాడు. వెంటనే భయంతో వణికిపోతూ "లేదు తాతయ్యా! నేను దొంగనికాదు. వాళ్ళంతా అలా అంటున్నారు కాని... భయంతో ఇలా పరుగెత్తుకొచ్చానన్నమాట. ఎందుకంటే మరేమో అమ్మ దేవుడిపాట నేర్పిందిగా."