పిలుద్దామా అనుకున్నాడు. నోరాడలేదు. అలాగే అనిమిషంగా చూస్తూ నిలబడ్డాడు. ఎవరికోసమైతే తన జీవితం నరకప్రాయం చేసుకున్నాడో, ఎవరినైతే తనకు ఎన్నడూ అందని అపురూప సౌగంధికాపుష్పం అనుకున్నాడో ఆ సుకుమార, సౌందర్యమూర్తిని ఒడలెరుగని స్థితిలో తన యింట్లో.... తన పాన్పుపై చూసేసరికి మతి చలించినట్లయింది. ఈ భూమ్మీద యింత విచిత్రం ఎలా సంభవించింది? అసలు వేదిత బ్రతికివుండటం ఎలా జరిగింది?   

 

    అతని కల్లోల హృదయంలో ఓ ఆలోచన మెదిలింది. ఏ విషయమూ సమగ్రంగా తెలుసుకోకుండా వేదితను యిప్పుడు లేపటం పొరపాటు. మొదట సక్సేనాను కలుసుకోవాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. వెనక్కి తిరగబోతూ అప్రయత్నంగా ఆమెవైపు మరోసారి చూశాడు.

 

    ఎప్పుడూ ధవళవస్త్రాలనే ధరించే వేదిత లేత ఊదారంగు చీరె, నలుపు రంగు జాకెట్టు వేసుకుని వుంది. శిగ సొగసుగా చుట్టబడి, అందులో ఓ గులాబీ గర్వంగా ప్రకాశిస్తోంది. అంతలో ఆమె నిద్రలోనే అటునుంచి యిటు ఒత్తిగిల్లింది. విశాలమైన ఆమె నయన తూగళి సుఖనిద్రా పారవశ్యంలో బరువుగా మూతలు పడివుంది. ఆ కనులచుట్టూ సహజంగా అమిరినట్లు కనబడుతోన్న కాటుక ప్రక్కలకుకూడా ఒకింత సాగి మరింత సోయగాన్ని చేకూర్చింది. ఫాలభాగాన మెరుస్తూన్న సింధూరవర్ణపు జుట్టూ.... కంఠసీమ నలంకరిస్తూ బొంబాయిలో నవ నాగరికంగా వేసుకునే పూసలదండా.... అందంగా, హొయలుగా సాగే ఆమె ఉచ్మ్వాస నిశ్వాసాలూ....

 

    అతను ఎంత చకితుడయాడో అంత పులకితుడయాడు. బండబారిన అతని గుండెమీద తన సున్నితమైన వ్రేళ్ళతో ఎవరో సరిగమలు పలికించినట్లయింది. క్రూరమైన అతని తపస్సుకు క్షుద్రదేవత ఏదో కనికరించి వరమిచ్చినట్లయింది. వొదల్లేక వొదల్లేక వెడుతున్నట్లు, మళ్లీ చూడటం పడదేమో అన్నంత భ్రాంతితో తనివితీరా తిలకించి, మెల్లగా గది బయటకు వచ్చి తలుపులు చేరవేసి, హాలుదాటి క్రిందికి వెళ్ళిపోయాడు.

 

    టాక్సీ ఒకటి పిలిచి ఎక్కి కూర్చున్నాడు. అతనికి అర్థం కావటం లేదు. అయోమయంగా వుంది. సక్సేనా, సక్సేనా! అతనికి హిమాలయమంత ఎదిగిన అపూర్వమనిషిలా గోచరించాడు.

 

    శాయి వెళ్ళేసరికి సక్సేనా తన ప్రయివేటు గదిలో ఒక్కడే కూర్చుని సిగిరెట్టు త్రాగుతూ కాయితాలు చూసుకుంటున్నాడు. తలుపుతీసిన శబ్దం విని తలయెత్తి శాయి కనిపించగానే సంతోషంతో లేచి నిల్చుంటూ "అరె!నువ్వు? ఎప్పుడూ రావటం?" అని యింగ్లీషులో అంటూ ముందుకువచ్చి స్నేహితుడ్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు.

 

    "ఇప్పుడే వస్తున్నాను"

 

    "ముందుగా వైర్ అన్నా యివ్వలేదేమిటి భాయీ! స్టేషన్ కి కారు తీసుకుని వద్దును గదా!" అని స్నేహితుడ్ని వదిలిపెట్టి, అతని రూపంకేసి వింతగా చూస్తూ "ఇదేమిటి భాయి? జుట్టేమయింది నీది?" అని అడిగాడు.

 

    "మా అమ్మ కూడా చనిపోయింది సక్సేనా, ఇహ ఆ ప్రాంతాలతో నాకు పూర్తిగా ఋణం తీరిపోయినట్లే."

 

    "ఏమిటి? అమ్మగారు పోయారా?"

 

    "అవును బ్రదర్. సీతను చూడటానికి వచ్చి అక్కడ యింకా జబ్బుపడి, నేను వెళ్ళాక రెండురోజులకు తనుకూడా కన్నుమూసింది."

 

    "అరె! ఎంత పని జరిగింది?" అన్నాడు సక్సేనా విచారం వ్యక్తం చేస్తూ.

 

    శాయి రెండునిముషాలు మెదలకుండా వూరుకుని "సక్సేనా! వేదిత నా యింటికి ఎలా వచ్చింది ?" అనడిగాడు హఠాత్తుగా.

 

    సక్సేనా ఉలికిపడి గగుర్పాటును అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ,

 

    "నువ్వు యింటికి వెళ్ళి వచ్చావా?" అని అడిగాడు.

 

    "అవును"

 

    "అక్కడ ఏం చూశావు?"

 

    "వేదిత మంచంమీద గాఢనిద్రా పరవశయై వుంది. ఆమెను లేపితే ఏం జరుగుతుందోనని చప్పుడు చేయకుండా యిక్కడకు వచ్చేశాను."

 

    "మంచిపని చేశావు. ముందు కూర్చుందాం పద. తర్వాత జరిగిందంతా చెబుతాను" అంటూ సక్సేనా స్నేహితుడ్ని చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టాడు. తనుకూడా కుర్చుని కాలింగ్ బెల్ నొక్కి, బాయ్ వచ్చాక రెండు కాఫీ తెమ్మని చెప్పి పంపించాడు.

 

    "కాఫీ కేం తొందరొచ్చిందిలే. జరిగింది చెప్పవయ్యా మహానుభావా ముందు."

 

    "కంగారుపడకు భాయీ! నువ్విప్పుడు ఎలా వున్నావో తెలుసా? కాఫీ త్రాగి స్థిమితపడ్డాక సావకాశంగా చెబుతాను."

 

    "ఊ! నువ్వు మహా ఛాదస్తుడివోయ్. నీ మొండితనంతో చంపేస్తున్నావు" అన్నాడు శాయి అసహనంగా.

 

    అయిదు నిమిషాల్లో కాఫీలు వచ్చాయి. శాయి కప్పు అందుకుని గబగబ త్రాగేసి "సీసాలమీద సీసాలు లేపేసేవాడికి ఈ కాఫీ స్థిమిత మిస్తుందా బ్రదర్! చెప్పు, త్వరగా చెప్పు" అన్నాడు ఆతృతగా.

 

    సక్సేనా తాపీగా, అన్ని వివరాలతో సహా ఆరోజు రోడ్డుమీద హఠాత్తుగా వేదిత కనబడింది మొదలు జరిగిన విశేషమంతా చెప్పాడు. ఆమె స్తబ్దవైఖరి, నిర్లిప్తజీవితం, నిషేధాలను విసర్జించటం, వేణు గోపాలుని విగ్రహం గదిలో భరించలేక కేకలువెయ్యటం, త్రిమూర్తులు ఆమె రాకకుగల కారణాన్ని గురించి ప్రశ్నించగా కల్యాణమూర్తి గురించి చెప్పటం.... అన్నీ విశదీకించాడు.

 

    శాయి చెవులప్పజెప్పి ఆశ్చర్యంగా విన్నాడు . అతనికి కలగా, యింద్రజాలంలా వుంది అంతా. ఎక్కడి వేదిత? ఎక్కడి బొంబాయి? బాల్యంనుంచీ తమ గత చరిత్ర అంతా ఒకసారి పునశ్చరణ చేసుకున్నాడు. కల్యాణమూర్తికి యింతటి విశిష్టస్థానం వుందా ఆమె హృదయంలో? ఆమె అంతరంగంలోని ఆరాధ్యదైవమా అతడు? శాయి ఒక రకంగా నిర్వచనం చెప్పుకున్నాడు. ఇన్నాళ్ళూ ఆమె గుండెల్లో నిద్రపోతున్నాడు కల్యాణమూర్తి, అజ్ఞాతంగా యుగయుగాలనుండి నివసిస్తున్నట్లు. తను వెళ్ళి ఆమెలో నిద్రాణమైవున్న శక్తుల్ని మేలుకొలిపి, జ్ఞాన సంపదనంతా చిన్నాభిన్నం చేసి పారిపోయాడు. ఆమెను పీడించాడు. క్రూరహింసలకు గురిచేశాడు. అయినా  భరించింది. తర్వాత కల్యాణమూర్తి వెళ్ళి యింకా హింసాకాండ ఏమయినా మిగిలివుంటే పూర్తిచేసి వుంటాడు. ఈ ఉపద్రవాలను విఘాతాలను తట్టుకోలేక  ఆమె పరారై వచ్చేసింది. కాని ఆమె వచ్చేసరికి సమయం దాటిపోయింది. అతను దేశం విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నిరుత్తరురాలై, నిస్సహాయురాలై సర్వం కోల్పోయి తన ఆత్మను వంచించుకుని, నిర్జీవురాలివలె మిగిలిపోయింది. బహుశా ఆమె దేహం మాత్రమే నివసిస్తోంది యీ భూమ్మీద.