వేసవిలో జుట్టు ఎక్కువ రాలుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో!

వేసవి కాలం మొదలవగానే చాలామంది జుట్టు రాలడం అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్య ముఖ్యంగా ఏప్రిల్ , మే నెలల్లో మరింత తీవ్రమవుతుంది. చాలామంది ఈ హెయిర్ ఫాల్ సమస్య గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా వేసవిలో హెయిర్ ఫాల్ కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం రాలుతున్న జుట్టు కారణంగా చాలా అసహనం, డిప్రెషన్ కు లోనవుతారు. అసలు వేసవికాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుంది? ఈ హెయిర్ ఫాల్ ను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, చిట్కాలు ఏంటి? తెలుసుకుంటే..
వేసవిలో జుట్టు రాలడానికి గల కారణాలు..
చెమట , జిడ్డు..
వేసవికాలం తీవ్రమైన వేడిగాలులను తెస్తుంది. చెమట, జిడ్డు, దుమ్ము తలపై పేరుకుపోయి, వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేస్తాయి. ఈ చెమట, నూనె, దుమ్ము కాంబినేషన్ జుట్టు రాలడానికి దారితీస్తుంది.
ఎక్కువ ఎండ, పొడి బారడం..
సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు జుట్టులోని తేమను పీల్చుకుంటాయి, దీనివల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా, బలహీనంగా , సులభంగా విరిగిపోయేలా చేస్తుంది.
కుదుళ్లు..
తలలో వేడి, చెమట ఎక్కువైనప్పుడు జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి, దీనివల్ల జుట్టు పెరుగుదల ప్రభావితమవుతుంది.
డీహైడ్రేషన్..
శరీరంలో నీటి కొరత వల్ల వెంట్రుకల కుదుళ్లు పొడిబారి, జుట్టు రాలడానికి దారితీస్తుంది. తగినంత నీరు త్రాగడం చాలా అవసరం.
హార్మోన్ల మార్పులు..
వేసవి కాలంలో శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగవచ్చు, దీనివల్ల జుట్టు రాలడం జరుగుతుంది.
పోషకాహార లోపాలు..
ప్రోటీన్, ఐరన్ , విటమిన్ల లోపం వల్ల జుట్టు పలుచగా , పెళుసుగా మారుతుంది. సమతుల్య ఆహారం చాలా అవసరం.
వేసవిలో హెయిర్ పాల్ తగ్గడానికి చిట్కాలు..
సరైన హెయిర్ కేర్ ను డైలీ లైఫ్ స్టైల్ లో బాగం చేసుకుంటే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. తేలికపాటి షాంపూయింగ్, నూనె రాయడం , తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది.
హోమ్ టిప్స్..
కలబంద, కొబ్బరి నూనె , ఉసిరి వంటి సహజ నివారణలు జుట్టుకు పోషణనిచ్చి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
వారానికి రెండుసార్లు కొబ్బరి లేదా బాదం నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవాలి. అయితే నూనెను అలాగే తలమీద వదిలేయకూడదు. కనీసం ఒక గంట తర్వాత తప్పకుండా షాంపూ చేసుకోవాలి. ఇది జుట్టును కుదుళ్ల నుండి బలపరుస్తుంది.
వేసవిలో జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
జుట్టుకు పోషణ అందాలంటే, శరీర పోషణపై శ్రద్ధ వహించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.
*రూపశ్రీ.


