కోల్ట్ ఫేషియల్.. 10నిమిషాల్లో మేకప్ లేకుండానే ముఖం మెరిసిపోతుంది..!

ఇప్పట్లో ప్రతి ఒక్కరూ మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ ప్రతిసారీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్ చేయించుకోవడం సాధ్యం కాదు. అలాంటి వారికి కోల్డ్ ఫేషియల్ చాలా సులభమైన, చౌకైన, ప్రభావవంతమైన మార్గం. కోల్డ్ ఫేషియల్ అంటే ముఖానికి ఐస్ థెరపీ ఇవ్వడం. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. ముడతలు, మచ్చలు, వాపు, ఓపెన్ రంధ్రాలను కూడా తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో కోల్డ్ ఫేషియల్ ట్రెండ్ పెరిగింది. చాలా మంది నటీమణులు కూడా ఈ ఐస్ థెరపీని తమ దినచర్యలో చేర్చుకున్నారు. అసలు కోల్డ్ ఫేషియల్ ఎలా చేయాలో, దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..
కోల్డ్ ఫేషియల్ అంటే..
కోల్డ్ ఫేషియల్ అనేది సహజమైన చర్మ సంరక్షణ ప్రక్రియ. దీనిలో ముఖాన్ని ఐస్ లేదా కోల్డ్ ఫేస్ మాస్క్ సహాయంతో మసాజ్ చేస్తారు. ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ముఖం తక్షణమే తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ సింపుల్ పద్ధతితో ఎటువంటి ఖరీదైన ఉత్పత్తులు లేదా పార్లర్ లకు వెళ్లకుండా ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. కేవలం 10 నిమిషాల ఐస్ థెరపీతో, మేకప్ లేకుండా కూడా చర్మం క్లియర్ గా తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
కోల్డ్ ఫేషియల్ ఎలా చేయాలి?
ముందుగా ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్ తో కడుక్కోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ ను కాటన్ క్లాత్ లో చుట్టాలి. చేతులతో వృత్తాకార కదలికలో తేలికగా ఐస్ తో ముఖం మొత్తాన్ని మసాజ్ చేయాలి. ఈ ప్రక్రియను సుమారు 10 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా కలబంద జెల్ అప్లై చేయాలి. కావాలంటే, రోజ్ వాటర్, గ్రీన్ టీ, దోసకాయ రసం లేదా కలబందను ఐస్ లో కలిపి ఐస్ క్యూబ్స్ తయారు చేసి దానితో మసాజ్ చేయవచ్చు. ఇది మరింత మంచి ఫలితాలు ఇస్తుంది.
ప్రయోజనాలు ..
ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేయడం వల్ల చర్మం చల్లబడి వాపు తగ్గుతుంది.
ఈ ఫేషియల్ రక్త ప్రసరణను పెంచడం ద్వారా ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది.
నల్లటి వలయాలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కోల్డ్ ఫేషియల్ తెరుచుకున్న రంధ్రాలను బిగించి చర్మాన్ని మృదువుగా, దృఢంగా చేస్తుంది.
ముఖంపై దద్దుర్లు, వడదెబ్బ, మొటిమలు కూడా ఈ చికిత్స నుండి ఉపశమనం పొందుతాయి.
ఎప్పుడు చేయాలి?
మెరుగైన ఫలితాలను చూడటానికి, వారానికి రెండు లేదా మూడు సార్లు కోల్డ్ ఫేషియల్ చేయడం మంచిది.. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉదయం నిద్రలేచి కోల్డ్ ఫేషియల్ చేసుకుంటే ముఖం రోజంతా తాజాగా, జిడ్డు లేకుండా ఉంటుంది.
మేకప్ వేసుకునే ముందు కోల్డ్ ఫేషియల్ చేయడం వల్ల చర్మం నునుపుగా ఉంటుంది, మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. ముఖ్యంగా చెమటలు ఎక్కువ పట్టేవారికి కోల్డ్ ఫేషియల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎవరికి మంచిది?
జిడ్డు చర్మం ఉన్నవారికి కోల్డ్ ఫేషియల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారు ప్రతి సీజన్‌లో కోల్డ్ ఫేషియల్ చేయవచ్చు.
వేసవిలో ముఖం మీద వడదెబ్బ తగలడం సర్వసాధారణం లేదా ముఖం మీద వాపు ఉంటే కోల్డ్ ఫేషియల్ మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది వడదెబ్బ, వాపును తగ్గిస్తుంది.
ముడతలు, ఫైన్ లైన్స్, ఓపెన్ రంద్రాలతో బాధపడేవారు కోల్డ్ ఫేషియల్ చేసుకుంటే మేలు.
చర్మం అలసిపోయి నీరసంగా మారిన వారు కోల్డ్ ఫేషియల్ చేసుకుంటే చర్మం తిరిగి తాజాగా మారుతుంది.
*రూపశ్రీ.



