"ఏమిటి?"
    
    క్షణంపాటు యిద్దరి చూపులూ కలుసుకుని విడిపోయాయి.
    
    "అదే..." గొణుగుతున్నట్టుగా చెప్పింది. "ఆస్కార్ కి సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్నే అడగమంటున్నాను."
    
    "ఈ టాపిక్ లో నాకన్నా మీరే తెలివయిన అమ్మాయని ఇందాకే నిరూపించుకున్నారుగా? మీరడగటమే న్యాయం."
    
    అది తనను తాను అతడు తక్కువచేసుకోవడమో, లేక తనకు అతడిస్తున్న విలువో ఆమెకి బోధపడలేదు.
    
    "పుస్తకం మూసేశారేం?" అడిగాడు.
    
    "చూదకుమ్డా అడుగుదామని."
    
    "అంటే... ఈ టాపిక్ మీద మీకు మంచి కమాండ్ వున్నట్లేగా?"
    
    ఆమె జవాబు చెప్పలేదు. పరవశంగా చూసింది. "ఆస్కార్ అవార్డు పొందిన ఒకే ఒక్క భారతీయుడెవరు?"
    
    "భాను అతియ్య 1982లో గాంధీ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆ బహుమతిని షేర్ చేసుకున్నాడు."
    
    "ఆస్కార్ అవార్డు పొందిన నల్లజాతి వ్యక్తి పేరు?"
    
    "సిడ్నీ పాయిటర్!" 1963లో 'లిలీస్ ఆఫ్ ది ఫీల్డ్' చిత్రంలో ఉత్తమ నటుడుగా బహుమతిని సాధించాడు."
    
    "ఇంతవరకూ ఒకే ఒక్క హారర్ చిత్రాన్ని ఆస్కార్ కి నామినేట్ చేశారు. ఆ చిత్రంపేరు?"
    
    "ది ఎగ్జార్సిస్ట్."
    
    "ఇంతవరకూ ఎక్కువ ఆస్కార్ బహుమతుల్ని పొందినచిత్రం?"
    
    "1959లో బెన్ హర్ చిత్రం పదకొండు బహుమతుల్ని గెల్చుకుంది."
    
    "లారెల్ అండ్ హార్టీ చిత్రం ఒక్కటి ఆస్కార్ అవార్డు సంపాదించుకుంది. ఆ చిత్రం పేరు?"
    
    "ది మ్యూజిక్ బాక్స్ 1932లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్ గా ఆస్కార్ అవార్డు పొందింది."
    
    "ఇక చాలు" అంది ప్రబంధ.
    
    "అదేం?"
    
    "ఇంతకంటే నాకూ తెలీదు."
    
    పైకి లేచారిద్దరూ ఆమెతోపాటు లైబ్రరీ బయటికి నడిచిన ఆదిత్యకి తెలీదు-
    
    ఇద్దరూ మాట్లాడుకోవడాన్ని గమనించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి అప్పటికే మోసేయడంతో, సూరితోపాటు మరికొందరు దూరంగా ఓ చెట్టుకింద నిలబడి చూస్తున్నారు చాలా ఆసక్తిగా.
    
    ఆదిత్య కంగారుపడ్డాడు కాని ప్రబంధకి ఇది చాలా గర్వంగా వుంది. పర్యవసానం గురించి ఆలోచించడంగాని, మరెవరిగురించో సంకోచించడం గాని తెలీని ప్రబంధ ఎంత సంతృప్తిగా చుట్టూ చూసిందీ అంటే వెంటనే అడిగింది- "తఃరచూ లైబ్రరీకి వస్తుంటారా?"
    
    "అప్పుడప్పుడూ."
    
    "హాస్పిటల్ కి రెగ్యులర్ గా వస్తుంటారేమో!"
    
    "తప్పదుగా?"
    
    "నేను సాయంకాలం వస్తాను. సరిగ్గా ఆరుగంటలకి" వెళ్ళబోతున్న ఆదిత్యతో అంది.
    
    "మరచిపోయాను."
    
    "ఏమిటది?"
    
    "అడిగిన ప్రతి ప్రశ్నకీ జవాబు చెప్పిన మీకు కంగ్రాట్స్ చెప్పడం"
    
    "నాకు తెలిసినవే మీరు అడగాలనుకుంటున్నారు."
    
    "అలా అయి..." చిరుకోపంగా అంది- "మీరు చెప్పలేని ప్రశ్న అడగాల్సుంటుంది."
    
    "వెల్ కమ్."
    
    అతడితో పరిచయం కొనసాగాలీ అంటే అలాంటిదేదో కావాలీ అనిపించిందేమో వెంటనే అంది- "అమ్మాయిలు వేసుకొనే 'బికినీ' గురించి విన్నారా?"     
        
    "విన్నాను."
    
    "అది మొట్టమొదట ఎక్కడ, ఎలా ప్రారంభమైందో చెప్పగలరా?"
    
    నివ్వెరపోతూ చూశాడు.
    
    ఆ చూపు ప్రబంధని మరెక్కడో తాకి బిడియాన్ని కలిగించిందేమో ఇలాంటి ప్రశ్న అడగాల్సింది కాదేమో అనుకుంది క్షణంపాటు.
    
    "నిజమే ఆదిత్యా! బికినీకి ఓ కథ వుంది. అది మీరు చెప్పాలి. ఎప్పుడో కాదు....ఈరోజే....సాయంకాలం హాస్పిటల్లో..."
    
    "ఇంత స్వల్ప వ్యవధిలోనా" అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
    
    "ఈలోగా వెరిఫై చేయొచ్చుగా?"
    
    "ఎక్కడ...?" అన్నాడు టక్కున.
    
    ప్రబంధ మొహం రాగరంజితమైపోయింది "నేను వెరిఫై చేయమన్నది బికినీ గురించిన కథని బికినీని కాదు"
    
    "నేనంటున్నదీ అదే ప్రబంధా!"
    
    అరక్షణం తరువాత అంది.... "చెప్పలేకపోతే ఒప్పేసుకోండి.....ఆన్సర్ నేను చెబుతాగా.... ఇక్కడ కాదు హాస్పిటల్లో."
    
    "ఒకవేళ నేను చెప్పగలిగితే?" పందెంలా అన్నాడు.
    
    "ఏం కావాలి?"
    
    "అదీ మీరే చెప్పండి."
    
    మొహమాటం, ఆనందం అతడికి చాలా చేరువ కాగలిగానన్న ఉత్సాహం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అంది రహస్యంలా..." ఒకవేళ మీరు స్వల్ప వ్యవధిలో చెప్పగలిగితే..."
    
    "చెప్పగలిగితే?"
    
    "షాక్ లో అయితే చివరిదాన్ని, ఇన్ స్ట్రుమెంటుగా అయితే ముందు వుంచేదాన్ని మిస్ దగ్గర మిస్ కాని  రెండింటినీ కానుకగా ఇస్తాను.'
    
    ఆమె వెళ్ళిపోయింది.
    
    నిజంగా షాక్ తిన్నాడు ఆదిత్య.
    
    చాలాసేపటిదాకా తేరుకోలేకపోయాడు ఆదిత్య.