అప్పుడు సమయం మధ్యాహ్నం 3.30 గంటలు బ్రహ్మ బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్యాకెట్ ఒకటికొని ప్రణవకిచ్చాడు. ప్రణవ ఆశ్చర్యపోయి చూస్తుండగా "మాస్టర్ ఈ బ్రాండ్ సిగరెట్స్ కాలుస్తుంటారు" అన్నాడు మెల్లగా బ్రహ్మ.
    
    ప్రణవ సిగరెట్ వెలిగించాడు.
    
    నలుగురూ తిరిగి లాంచీల రేవుకేసి సాగారు.
    
    "మీ ధైర్యానికి నా కాశ్చర్యమేస్తోంది" అన్నాడు ప్రణవ పొగను బయటకు వదులుతూ.
    
    "అంతు బట్టని ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు జరుగుతున్నాయి. వాటిల్లో ఇదొకటనుకో మనలోని అసంతృప్తికి అనుమానాలకి ఎక్కడో ఒకచోట చరమగీతం పడి ముందుకు సాగాలంటే కొన్ని విషయాలపట్ల మొండితనాన్ని ప్రదర్శించాలి" బ్రహ్మ ప్రణవ మనస్సులో రేగుతున్న భావాల తీవ్రతని అంచనావేస్తూ అన్నాడు.
    
    మరికొద్ది క్షణాలకి నలుగురూ తాము హైర్ చేసుకున్న లాంచీ ఎక్కారు.
    
    లాంచీ తిరిగి ఎలిఫెంటాకేన్స్ నుంచి బొంబాయికేసి బయలుదేరింది.
    
                                                      *    *    *    *    *
    
    యునైటెడ్ స్టేటాఫ్ అమెరికా రాజధాని వాషింగ్ టన్ డి.సి. నగర సరిహద్దుల్లో ఉన్న పెన్సిల్ వేనియా ఎవెన్యూలో ఉన్న ఎఫ్.బి.ఐ. హెయిర్ ఐడెంటిఫికేషన్ డిపార్టుమెంట్ హెడ్ కి ఎఫ్.బి.ఐ. డైరెక్టర్ నుంచి సిద్దేశ్వర్ ఓబరాయ్ కి సహకరించమని ఆర్డర్స్ వెళ్ళాయి.
    
    మూసుకున్న ఆ శాఖ తలుపుల వెనుక హైలీ సోఫిస్టికేటెడ్ కంపేరిజన్ మైక్రోస్కోప్ ముందుకి ఒక ఫోరెన్ సిక్ ఎక్స్ పర్ట్ వచ్చి కూర్చున్నాడు.
    
    అతని అసిస్టెంట్ సిద్దేశ్వర్ ఓబరాయ్ బొంబాయి నుంచి పంపించిన కవర్ లోంచి ఒక వెంట్రుక తీసి పొడిగా ఉన్న గ్లాస్ స్లయిడ్ మీద జాగ్రత్తగా మౌంట్ చేసి వినయంగా ఎక్స్ పర్టు కి అందించాడు.
    
    "సార్" అసిస్టెంట్ మెల్లగా అన్నాడు.
    
    వాదిద్దరి మధ్య ఆంగ్లంలో సంభాషణ జరుగుతోంది.
    
    "వూ....చెప్పు"
    
    "బొంబాయి పోలీస్ కమీషనర్ నుంచి వచ్చిన ఈ కవర్ లో ఈ హెయిర్ అనాలసిస్ కూడా ఉంది సార్"
    
    "ఉన్నాసరే....కంపేరిజన్ కంప్యూటర్ కి ఫీడ్ చేసే ముందు బొంబాయి ఫోరెన్ సిక్ లాబ్ ఈ హెయిర్ ని సరిగ్గా అనలైజ్ చేసిందో లేదో చూసుకోవటం చాలామంచిది. లేదంటే డైరెక్టర్ గారు మనమీద ఫైరయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలింతకీ ఈ వెంట్రుక ఎవరిడొంకను కదిలించబోతోందో?" స్టయిడ్ ని మైక్రోస్కోప్ ముందుకి తెచ్చుకుంటూ అన్నాడు ఎక్స్ పర్టు.
    
    "పోలీసాఫీసర్స్ కి నీతి, నిజాయితీలే కాదు తెలివితేటలు, అత్యాధునిక నేర పరిశోధనా పద్దతులు కూడా ఉండాలని గట్టిగా వాదించి మన ఎఫ్.బి.ఐ. సహకారంతో బొమ్బయైల్కో ఫోరెన్ సిక్ లేబ్ ఏర్పడటానికి కారకులయిన ముఖ్యమయిన వ్యక్తి సిద్దేశ్వర్ ఓబరాయ్. గొప్ప గుండె ధైర్యం, తెగువ, వ్యక్తిత్వం ఉన్న పోలీసాఫీసర్ బొంబాయి నేర ప్రపంచానికి సింహస్వప్నం లాంటివాడు. అతనికి మన ఎఫ్.బి.ఐ.లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రెండు మూడుసార్లు ఆయన స్టడీ చేయటానికి కూడా ప్రత్యేకంగా బొంబాయి నుంచి ఇక్కడకు వచ్చారు సార్. ఎంతో పెద్ద వ్యవహారం కాకపోతే ఇలా స్కైప్యేక్ లో పంపించి ఆ వెంటనే డైరెక్టర్ గారికి పర్సనల్ గా ఫోన్ చేసి ఈ విషయాన్ని త్వరగా పర్ ష్యూ చేయమని రిక్వెస్టు చేయరు" అన్నాడు అసిస్టెంట్ ఎక్స్ పర్టుకి లెమన్ టీ అందిస్తూ.
    
    తరువాత నిశ్శబ్దం అలుముకుంది.
    
    ఎక్స్ పర్టు తలవంచి మైక్రోస్కోప్ ద్వారా దేవానంద్ ఇంటి ఆవరణలోని మామిడిచెట్టుపై దొరికిన హెయిర్ పరీక్షిస్తూ అసిస్టెంట్ కి సూచన లివ్వసాగాడు.
    
    అంతర్జాతీయ స్థాయి నేరస్థుడయిన జోహ్రాపై వలపన్నే కార్యక్రమం వేగాన్నందుకుంది.
    
                                                          *    *    *    *    *
    
    వెస్టరన్ షూట్స్...
    
    ఎత్తయిన కొండలపై ఉన్న అద్భుత సుందర ప్రదేశం....లోనావాలా...
    
    బొంబాయి పూణే హైవేలో ఉన్న హిల్ స్టేషన్ బొంబాయి నుంచి కారులో బయలుదేరిన ఖలీల్ మూడుగంటల్లో లోనావాలా చేరుకున్నాడు.
    
    అక్కడ తనకున్న గెస్టుహౌస్ లో విడిది చేసాడు.
    
    ఆ మరుక్షణం గెస్టు హౌస్ లో ఉన్న ఫోన్ నుంచి నిర్విరామంగా బొంబాయిలో ప్రధానమయిన పోలీస్ స్టేషన్ కి కాల్స్ వెళ్ళసాగాయి.
    
    బొంబైయిట్స్ క్విక్ రిలాక్సింగ్ వీకెండ్.
    
    ఆరోజు శనివారం.....నిమిషానికో కారు లోనవాలా హిల్స్ పైకి వస్తోంది.
    
    ఎత్తయిన పశ్చిమ పర్వతశ్రేణులు.... లోయలు.... పచ్చని పట్టుచీర పరచినట్లుగా కనిపిస్తున్న లాండ్ స్కేప్ కన్నుల పండుగగా ఉన్న పరిసరాల్ని చూస్తూండగా జోహ్రా వచ్చాడు లోపలకు.
    
    "నామీద సిద్దేశ్వర్ ఓబరాయ్ ఓ కన్నేసి ఉంచాడు. అందుకే నిన్ను ముందు రమ్మన్నది" విండోలోంచి కనిపిస్తున్న ఫారమ్ హౌసెస్ హాలిడే విలాస్ కేసి చూస్తూ అన్నాడు ఖలీల్.
    
    జోహ్రా మందహాసం చేసాడు.
    
    "దేవానంద్ ఇంటి వాచ్ మెన్ అబూ నిన్నూ, నన్నూ చూసాడు. ఆరోజు థాంప్సన్ సబ్ మిషన్ గన్ ఫైరయిన శబ్దాలు ఆ చుట్టుప్రక్కల ప్రతిధ్వనించాయి. ఏ ఒక్కరు పోలీసులకు ఇన్ ఫామ్ చేసినా ప్రమాదమే."
    
    'అది నాకు తెలుసు. నువ్వేం జాగ్రత్తలు తీసుకుంటున్నావ్ ఆ విషయంలో?" జోహ్రా రేవుడ్స్ పై ఉన్న ఎమ్.టి.డి.సి. రిసార్టుకేసి చూస్తూ ప్రశ్నించాడు.
    
    "బొంబాయిలోని ప్రతి పోలీస్ స్టేషన్ కి నేను నెలనెలా పంపే మామూళ్ళు నాకు ఎలాంటి ఇన్ ఫర్మేషన్ ని అయినా అందిస్తాయి. ఇప్పుడు నేను నా మామూళ్ళని ఈ ఫోన్ ద్వారా ప్రశ్నించాను. మరో రెండు గంటలకు మనకు కావల్సిన వివరాలు అందుతాయి.
    
    జుహు పోలీస్ స్టేషన్ లో కొత్త కేసేదయినా నమోదయిందా.....?
    
    అబూ ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా?
    
    అబూని పోలీసులెవరయినా కలిసారా?