"లేదు సార్! రేపు రాత్రితో నిషిద్దకాలం అయిపోతుంది ఎల్లుండి రాత్రికే మా శోభనం. కానీ మా మామయ్యకు శాస్త్రాల పిచ్చి మరీ ఎక్కువ. ఆయనకు ఏదయినా కొత్త అవాంతరం తట్టి పోస్ట్ పోన్ చేసినా ఆశ్చర్యపడక్కరలేదు" అన్నాడు వంశీ.
    
    "మీ మామయ్యకు ఎందుకంత పిచ్చి?"
    
    "ఏం చెప్పమంటారు! ఎప్పుడో గురి కుదిరి వుంటుంది. అదలా కంటిన్యూ అయిపోయింది. అయితే ఆ గురి పిచ్చిగా రూపాంతరం చెందడం వల్ల మేం ఘోరంగా బలైపోయాం. పెళ్ళి జరిగి నెలవుతున్నా గోటక బ్రహ్మచారిగా గడుపుతున్నాను. ఆయన పిచ్చిలోకి మమ్మల్ని కూడా లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మరీ తలనొప్పిగా తయారయింది.
    
    ఈ పెద్దవాళ్ళంతా    ఇంతేననుకుంటా తమ ఇష్టా యిష్టాలను పిల్లల మీద రుద్దాలనుకుంటారు. పెద్దల దౌష్ట్యానికి గురయ్యేది పిల్లలే కదా.
    
    తండ్రివల్ల మా ఫ్రెండ్ శంకర్ అనే అతను శోభనం రోజున అభాసుపాలవడేగాక జీవితంలో చాలా నష్టపోయాడు"
    
    శరవణన్ కి కుతూహలం ఎక్కువైంది. "ఎవరప్పా అంద శంకరం? ఏం జరిగిందో సొల్లప్పా! ఆ మధ్య నువ్వు చెప్పిన ఫస్ట్ నైట్ స్టోరీ రొంబా ఎక్స్ లెంట్ గా వుందప్పా" అన్నాడు.
    
    వంశీ ఓ సిప్ వేసి, సిగరెట్ వెలిగించాడు. శరవణన్ దీక్షగా వినడం ప్రారంభించాడు. అంత కాన్ సన్ ట్రేట్ చేయకపోతే ఆ తెలుగు సరిగ్గా అర్ధం కాదని తెలుసు.
    
    వంశీ మధ్య మధ్య సిప్ చేస్తూ చెబుతున్నాడు.
    
                                                              *    *    *    *    *
    
    అతని పేరు శంకర్ దురదృష్టాన్ని వెంట పెట్టుకుని వచ్చినట్లున్నాడు.
    
    తల్లి అతనికి ఎనిమిదేళ్ళు రాగానే చనిపోయింది. ఇక మిగిలింది అతని తండ్రి సుబ్బరామయ్య.
    
    ఆయనిది చాలా పెక్యులర్ కేరక్టర్. అందర్నీ డామినేట్ చేయాలన్న మనస్తత్వం. ఇలాంటి వక్రబుద్దుల్ని బయట ప్రదర్శించే వీలుండదు గనుక ఇంట్లో చూపించేవాడు. భార్యని చాలా చులకనగా మాట్లాడేవాడు. ఆమె ఎందుకూ పనికిరాదనీ, ఆమెకు ఏమీ చేతకాదనీ తిట్టిపోసేవాడు.
    
    ఇది ఎంత ఘోరంగా తయారయిందంటే ఆమె ఆయన ముందు నోరు విప్పడానికి జంకేది. యిలా ఆయనతో పడీ పడీ మరణించింది. ఇక మిగిలింది కొడుకు. వాడిమీద తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు.
    
    "చొక్కా బటన్ ఏమైంది? నువ్వు ఎందుకూ పనికిరావు నీలాంటి కొరగాని కొడుకు వున్నా ఒకటే, లేకపోయినా ఒకటే ఏమిటా ఏడుపుగొట్టు ముఖం? నీలాంటి వాడికి తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గు చేటు రేపట్నుంచి స్కూల్లో బటన్ లు తెంచుకుని వస్తే నీవు చీరేస్తాను ఛీఛీ - వెధవ పీనుగ దాపురించాడు ఇంటిలో" యిలా సాగేది ఆయన దండకం.
    
    శాపనార్ధాలే కాదు విపరీతంగా కొట్టేవాడు కూడా కాఫీ తాగేప్పుడు ఓ చుక్క కింద ఒలికినాసరే కొడుకు మీద ఒంటి కాలిపై లేచేవాడు.
    
    "ఇన్నేళ్ళొచ్చాయ్ కాఫీ తాగడం తెలియదా! నీలాంటివాడి తలమీద రూపాయి పెట్టి వేలం వేస్తే అర్ధరూపాయికి కూడా ఎవడూ కొనడు. తిననూ, తాగనూ కూడా తెలియని వెధవ్వి, ఎందుకు పనికొస్తావ్? జాతరలో బలి ఇచ్చేస్తే పీడా వదిలిపోతుంది" అంటూ చావబాదేవాడు.
    
    ఆ లేత మనసులో ఆయన వాలకం చెడ్డముద్ర వేసింది తండ్రి చెప్పినట్లు తను ఎందుకూ పనికిరాడేమోనన్న అనుమానం మొదలైంది.
    
    దాంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడింది. తనకంటే అందోరో చలాకీగా, తెలివిగా కనిపించేవారు. తను ఎందుకూ పనికి రారన్న భావన మొదలయింది. దాంతో తోటి పిల్లలతో కలవలేక పోయాడు. ఒంటరితనం అలవాటైపోయింది.
    
    దీనిని కూడా సహించలేకపోయాడు సుబ్బరామయ్య "ఎప్పుడూ ఎందుకలా ముంగిలా వుంటావ్? అయినా నీలాంటివాడితో ఎవరూ జత కట్టరు. ఆ తలలో బంకమన్ను కాకుండా కాస్తంతయినా మెదడు వుంటే ఎవరయినా స్నేహం చేస్తారు. తమరికి లేనిదీ అదే కదా" అంటూ చావకొట్టేవాడు.
    
    తండ్రిని ఎదిరించలేక తనలో తనే కుమిలిపోయేవాడు. తల్లి వుండి ఓదార్చేది. అక్కున చేర్చుకుని కన్నీళ్ళు తుడిచేది. అతని ఒంటరితనాన్ని దిష్టి తీసేసినట్లు తీసేసేది. కానీ ఇప్పుడు ఆమె లేదు. ఓదార్చే దిక్కు లేక అతను నిశ్శబ్దంగా తనలో తఃనే మదనపడిపోయేవాడు.
    
    తండ్రి ఎదురుపడడమే వణికిపోయేవాడు కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. నాలుక తడబడేది. వెన్నులోంచి మొదలయిన చలి ఒంటిని ఐస్ గడ్డలా మార్చేసింది.
    
    ఇలాంటప్పుడు కూడా ఆయన ఊరుకుండేవాడు కాడు. మరింత రెచ్చిపోయేవాడు. "ఏమిటలా వణికిపోతున్నావ్? నేనేమైనా రాక్షసుడ్నా? పిరికిపందకు మనుషులు కూడా రాక్షసుల్లా కనపడతారు కాబోలు. నీలాంటివాడ్ని ఎడారిలో వదిలిపెట్టి క్రూరమృగాల్ని మీదకు ఉసిగొల్పాలి. కర్రముక్క గుచ్చుకున్నా తాచుపాము కాటేసిందని హడలి చచ్చే రకానివి నువ్వు నీలాంటి పనికిమాలిన వెధవ భూమికి భారం. ప్రపంచంలో పనికిరానిది ఏదయినా వుంటే అది నువ్వే."    

    దీంతో మరింత కుంచించుకుపోయేవాడు. భూమి పగిలి తనను మింగేస్తే బావుండునన్నట్లు తల కిన్హకు వాల్చేసేవాడు. కన్నీళ్ళకు కళ్ళలోపలే ఆనకట్ట వేసేవాడు. ఏడ్చే వీలు కూడా లేకపోవడంతో ఆ బాధ గుండెల్లో ఘనీభవించింది. దీంతో కొత్త కొత్త కాంప్లెక్స్ లు బయలుదేరాయి.
    
    మనుషులంటే భయపడేవాడు. ఇల్లు వదిలి వీధిలోకి రావాలంటే జంకేవాడు. ఎక్కడైనా గుంపుగా జనం వుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేసేవి. కాళ్ళు వణికేవి. అడుగు ముందుకు పడేది కాదు. గుంపంతా తనకోసమే కాచుకుని వున్నట్లూ, తను కనపడగానే వాళ్ళంతా తనమీద పడిపోతారేమోనని భ్రమించేవాడు.
    
    మనసే కాదు శరీరమూ పెరగలేదు శంకర్ కి. ఇరవై అయిదేళ్ళు వచ్చినా అయిదడుగులకు మించలేకపోయాడు సన్నగా ముడిచిపెట్టిన గొడుగులా వుండేవాడు. జీవకళ ముఖంలోనే కాదు కళ్ళల్లో కూడా కనిపించేది కాదు.
    
    ఎలాగో ఓలా మొత్తానికి డిగ్రీ పూర్తయిందనిపించాడు. సుబ్బరామయ్య కొడుక్కి తన ఆఫీసులోనే చిన్నఉద్యోగం ఇప్పించాడు.
    
    ఇన్ని రోజులూ ఆడదిక్కులేని సంసారం కాబట్టి ఇల్లు కూడా అలానే వుండేది. జిహ్వకు సరయిన రుచి కూడా అందేదికాదు. కొడుకు చేతివంట మొహం మొత్తింది. దీంతో కోడల్ని తెచ్చుకోవాలన్న ఆతృత ఎక్కువ కావడంతో కొడుక్కి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు సుబ్బరామయ్య" వంశీ చెప్పసాగాడు.
    
    "చివరికి ఓ సంబంధం సెటిలయింది. పెళ్ళికూతురు పేరు దేవిక. పదవతరగతి వరకూ చదువుకుంది. పెళ్ళి కుదిరేనాటికి ఆమె వయసు ఇరవైపైనే అందంగా, సెక్సీగా వుండేది.