కొంతమంది సీనియర్ నటులూ, గొప్పనటులూ ఇప్పటికీ అప్పుడప్పుడూ సినిమాల్లో నటిస్తున్నవారూ, "సినిమాల్లో అసభ్యత, అసహజం, క్రైమ్ ఎలిమెంట్ పెరిగిపోయింది" అని అవకాశమొచ్చినప్పుడు తమ అభిప్రాయాలు వెల్లడించటం లేదా?
    
    ఇప్పటి సంగీతాన్ని గురించి అలాటి గొప్ప గొప్ప సంగీతదర్శకులు ఆందోళన వెలిబుచ్చటం లేదా?
    
    కాబట్టి ఆయా రంగాల్లోని వారికే ప్రస్తుత స్థాయిమీద తీవ్రమైన అసంతృప్తి వుంది.
    
    మనోబలం వయసు చెల్లినవారికే వుండదు, యవ్వనంతో మిడిసిపడుతున్న వారి కుంటుందా?
    
    ప్రపంచమంతా మనోబలంతో నిండిలేదు, మనోరుగ్మతలతో నిండివుంది.
    
    వాటిని ఇంకా రెచ్చగొట్టడం ధర్మమేనా?
    
    ఇంత వ్యతిరేకతా, మాకు అన్నీ తెలుసు అన్న అహంకారం ఎక్కణ్ణుంచి పుట్టుకు వస్తున్నాయి?
    
    ఎవరికైనా "మీ ప్రవర్తన బహుశా సరిగ్గా లేదు" అని మృదువుగా చెప్పి చూడండి.
    
    వాళ్ళకు వెంటనే కోపమొచ్చేస్తుంది.
    
    అసలు వినరు. వినిపించుకునే ప్రయత్నం చెయ్యరు.
    
    "వీళ్ళు మాకు చెప్పేవాళ్ళా?" అన్నట్లు చూస్తారు.
    
    "మాకు అన్నీ తెలుసులే!" అన్న అహంకారంతో ఓ చూపు విసురుతారు.
    
    ఈ 'అన్నీ తెలుసులే' అన్న అహంకారం మనిషిని ఎక్కడికి తీసుకుపోతోంది?
    
    ఒక్కొక్కసారి! వొంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు అవరిస్తోంటే ఎంతో బాధవేస్తుంది.
    
    ఈ మీడియా మత్తులోపడి ఎన్ని అపురూపగ్రంథాలు చదవకుండా వదిలేస్తున్నారు?
    
    ఎవరో కొందరు జిజ్ఞాసవుల్లో తప్ప ఈ పఠానాసక్తి చాలావరకూ తగ్గిపోయింది.
    
    జి.కె. జి.కె. జి.కె... జనరల్ నాలెడ్జి పుస్తకాలు కొన్ని ప్రయోజనాల కోసం చదువుతున్నారు.
    

    జనరల్ నాలెడ్జి... కేవలం కొన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలూ, జవాబులూ బట్టీ పడితే వస్తుందా? ఏదో కొన్ని క్విజ్ పోటీలకు, అవీ కొంత స్థాయివరకూ మాత్రమే వెళ్ళగలుగుతారు.
    
    రాజకీయాలపైన స్పష్టమైన పరిశీలనా, అవగాహనా వుండాలి.
    
    భారత భాగవత రామాయణాలు క్షుణ్ణంగా చదివివుండాలి. దేశదేశాలకు సంబంధించైనా ఉత్తమ సాహిత్యం, తప్పక చదివి తీరవలసిన గ్రంథాలు చదివి వుండాలి.
    
    ఎన్ని అపురూప గ్రంథాలున్నాయి! ఎంత పోగొట్టుకుంటున్నాం!
    
    ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఈరోజు సంక్రాంతి పర్వదినం. మధ్యాహ్నం మంచి కార్యక్రమాలేమైనా వున్నాయేమోనని టీవీ ఆన్ చేస్తే బాపుగారు దర్శకత్వం వహించిన "శ్రీనాథకవి సార్వభౌముడు" వస్తోంది. నిద్ర వస్తోన్నా ఆపుకుని మొత్తం చూసేశాను.
    
    శ్రీనాథుని కవిత్వంలో, జీవనపథంలో, ఆ అహంకారంతో, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో ఎంత తపన, ఆర్తి వున్నాయి!
    
    ఈనాడు ఇన్ని సదుపాయాలున్నా అందుకోలేకపోతున్న లోతులు, ఆరోజుల్లోనే ఎంత గొప్పగా అందుకోగలిగాడు!
    
    నా హృదయం చాలాసేపు సాహిత్యపు మైకంనుంచి కోలుకోలేకపోయింది. కొంతసేపు ఏడ్చేశాను కూడా.
    
    ఈ పిల్లలు ఎంత మిస్ అయిపోతున్నారు! మనం తెలుసుకోవలసింది ఎంత దూరంగా జరిగిపోతోంది!
    
    మత్తు, మత్తు, మత్తు... నరాలకు చచ్చుపడేటట్లు చేసే ఈ మత్తు కాదు కావలసింది.
    
    నరాలను స్పందింపచేసి, నిన్ను పదిరెట్లు పెంచగలిగే విజ్ఞానపు మత్తు నీవు పొందగలగాలి!
    
    ఈ నిషాల జోరులో, ఆ బిజీలైఫ్ లో కొంత వీలు చూసుకుని ఎప్పుడో ఒకప్పుడు కొంత వీలు కల్పించుకుని, ఆ నిషా కొంచెం విడివడుతున్న సమయంలో, మళ్ళీ నిషాలోకి వెళ్ళిపోయే ముందు...కొంచెం టైంని మన్నించి, కొంచెం....ప్రయత్నిస్తూ నిన్ను నీవు చూసుకో.
    
    అవును. నిన్ను నీవు చూసుకో.
    
    కొన్ని ప్రశ్నలూ వేసుకో.
    
    కళ్ళు మూసుకుని నిన్ను నీవు చూసుకుంటూ...ఈ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయా, ఎలాంటి జవాబులు దొరుకుతాయి....ఆలోచిస్తూ మథించుకో.
    
    నేను ఈ అలవాటు ఎందుకు చేసుకున్నాను?

    నా అంతట నేను మోజుపడి వుంటే... ఎందుకు, దేనికోసం, ఏ సుఖంకోసం మోజుపడ్డాను?
    
    ఫలానిది కావాలని, పొందాలని ఇందులోకి దిగితే అవి పొందగలుగుతున్నానా?
    
    ఈ నిషా నాకు సుఖాన్నిస్తున్నదా? దుఃఖాన్నిస్తున్నదా?
    
    దీనివల్ల నా చదువుకూ, వ్యాపకాలకూ దగ్గరవుతున్నానా, దూరమవుతున్నానా?
    
    నన్ను నేను పోగొట్టుకుంటున్నానా? స్వీకరించగలుగుతున్నానా?
    
    నన్ను చూసి ఇతరులు ఏమనుకుంటున్నారు? మెచ్చుకుంటున్నారా? అసహ్యించుకుంటున్నారా?
    
    నా ఆరోగ్యం ఇదివరకటికంటే బాగున్నదా? దిగజారిపోతున్నదా?
    
    స్నేహితుల ప్రోద్భలంమీద చేసుకునివుంటే.... ఈ స్నేహితులు నాకోసం ఏ త్యాగమైనా చేసే స్నేహితులా?
    
    వారికీ, నాకూ మధ్య లింక్ గా వున్న ఈ అలవాటు తొలగిపోతే.... ఈ స్నేహం కొనసాగుతుందా? ఆగిపోతుందా?
    
    మా ఆర్ధిక పరిస్థితి ఏమిటి?
    
    మా నాన్నగారి సంపాదన ఎంత?
    
    ఆయన శక్తికి మించి నామీద ఎన్ని ఆశలు పెట్టుకుని నెలనెలా ఈ డబ్బు పంపించగలుగుతున్నారు?
    
    నాకున్న అలవాటు తెలిసి ణా తల్లిదండ్రుల హృదయాలు ఎంత విలవిలలాడుతున్నాయి?
    
    మా అన్నయ్య చదువులో, అంతస్థులో ఎంతో పైకి ఎదిగిపోయాదు. ఈ అలవాటు మత్తులో మునిగిన నేను జీవితంలో ప్రకాశించి ఆ అంతస్థును అందుకోగలనా?